కన్నీటి సంద్రం

ఘోరం..! అన్నెంపున్నెం తెలియని పసిపిల్లలు అన్యాయంగా అసువులు బాశారు! పొద్దున్నే చిరునవ్వులతో చెప్పిన టాటాలు కడసారి జ్ఞాపకాలయ్యాయి! పసిప్రాయంలోనే వారికి నిండునూరేళ్లు నిండాయి! దేశమంతా నివ్వెరపోయిన ఈ ఘటన, మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ధ జరిగింది! కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది! మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం! సమయం ఉదయం 8.30! కాకతీయ స్కూల్ బస్సు 38 మంది విద్యార్థులతో ప్రయాణిస్తోంది! రైల్వే క్రాసింగ్ దాటి మూసాయిపేట గ్రామంలో మరి కొంతమంది పిల్లల్ని తీసుకుని తూప్రాన్ వెళ్లాలి! సరిగ్గా రైల్వే క్రాసింగ్ దగ్గరకు రాగానే- నాందేడ్ ప్యాసింజర్ రైలు చడీచప్పుడు లేకుండా యమశకటంలా దూసుకొచ్చింది! విపరీతమైన వేగంతో వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టింది! కళ్లుమూసి తెరిచేలోపు బస్సు గాల్లో ఎగిరి పడింది! బీభత్సం! భయానకం! అరుపులు. కేకలు! రెప్పపాటులో ప్రమాదం! బస్సు తునాతునకలైంది! పిల్లల మృతదేహాలు చీలికలుపేలికలయ్యాయి! బ్యాగులు, పుస్తకాలు, టిఫన్ బాక్సులు చెల్లాచెదరయ్యాయి! కర్కశమైన ఇనుప ముక్కలు చిన్నారుల దేహాల్ని ఛిద్రం చేశాయి! నుజ్జునుజ్జయిన బస్సు సీట్లకింద పిల్లలు విగతజీవులై కనిపించారు. డ్రైవర్, క్లినర్తో పాటు 18 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు! పిల్లల్ని బస్సు ఎక్కించి ఐదు నిమిషాలైందో లేదో ఊరిలో దుర్వార్త వినిపించింది! ఘటనా స్థలానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు! గుర్తుపట్టకుండా మారిన పిల్లల శవాల్ని ఆవేదనతో వెతుకుతున్న దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది! అప్పడే బస్సు కిటికిలోంచి టాటా చెప్పిన చిన్నారి -చివరి వీడ్కోలు పలికిందని తల్లిదండ్రులు రోదించిన తీరు గుండెను పిండేసింది! అప్పుడే ముద్దుముద్దు మాటలు మాట్లాడిన చంటిది- ఐదు నిమిషాల్లో నెత్తుటి ముద్దలా మారిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. ఆ ప్రాంతమంతా మరుభూమిని తలపించింది. పిల్లల తల్లి దండ్రులను ఓదార్చతరం కాలేదు. దుర్ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు! ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు! రైల్వే జీఏంతో మాట్లాడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైల్వే క్రాసింగ్ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు!మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు! క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు! గాయపడ్డవారికి సికింద్రాబాద్ యశోదలో వైద్యం అందుతోంది! అందులో 7గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నలుగురు సీరియస్గా ఉన్నారు. తొమ్మిదిమంది ఆరోగ్యం నలకడగా ఉంది. కండీషన్ క్రిటికల్గా ఉన్నవారిలో నితీష, ప్రశాంతి, శిరీష, రుచిత, శ్రావణి, దర్శన్, నబీరా ఉన్నారు. ఇక వరుణ్, శశాంత్, వైష్ణవి, తరుణ్ల పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం అత్యంత విషాదకరం. కిష్టాపూర్ కు చెందిన అక్కాతమ్ముడు రజియా-వాహిద్లు చనిపోయారన్న వార్త తెలుసుకున్న పిల్లల తండ్రి వలీయుద్దీన్ గుండెపగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు! మాసాయి పేట ఘటన మిగిల్చిన గర్భశోకం! కంటిపాపలు కళ్లముందే నెత్తురోడిన దృశ్యం! మాటలకందని విషాదం! తప్పెవ్వరిదైనా ఈ కుటుంబాలకు మిగిలింది పుట్టుడుదుఃఖమే! కొండంత ఆశతో పెంచుకున్న బిడ్డలు, నెత్తుటిముద్దలుగా మారినవైనం!

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.