కన్నీటి భారతం

. Delhipeople– గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతికి దేశవ్యాప్తంగా నివాళులు
– కొవ్వొత్తుల ప్రదర్శనలు.. ర్యాలీలు
– మృతురాలి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థనలు
– రేపిస్టులను ఉరితీయాలి.. నినదించిన యువత
– బాధితురాలి మృతిపై ప్రముఖుల సంతాపాలు
ఒక ఆశాదీపం ఆరిపోయింది! పోరాటస్ఫూర్తి రగిలించి.. మరలిరాని లోకాలకు తరలిపోయింది! తన కు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు బతకుమీద ఆశ పెంచుకున్న పారామెడికల్ విద్యార్థిని.. మృత్యువు ముందు ఓడిపోయింది! కానీ, ఆమె ఆకాంక్ష యువత గుండెల్లో చిరస్థాయిగా ఒదిగిపోయింది! ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌నకు గురైన పారామెడికల్ విద్యార్థిని మరణంతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఢిల్లీ వీధులన్నీ శోకసంవూదాన్ని తలపించాయి. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, చెన్నై, ఆంధ్రవూపదేశ్.. ఇలా ప్రతి చోట ప్రజలు ర్యాలీలు తీశారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొనాలని డిమాండ్ చేశారు.

భరతమాత ఓ సాహసిని కోల్పోయింది: రాష్ట్రపతి
భరతమాత ఓ ధైర్యవంతురాలైన కూతుర్ని, సాహసిని కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు మృత్యువుతో ఆ విద్యార్థిని పోరాడిందని, ఆ స్ఫూర్తి ఊరికేపోదని తన సంతా ప సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశ యువత కు ఆమె ప్రతీక అని, నిజమైన నాయకురాలని కీర్తించారు. ఆమె మరణంపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందన్నారు. మహిళలపై దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళలపై దాడులను నిరోధించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. కాగా, గ్యాంగ్ రేప్ బాధితురాలి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. ఆమెను కేవలం కు టుంబసభ్యులే కోల్పోలేదని, యావత్ దేశ ప్రజలు తమ చెల్లిని, కూతుర్ని కోల్పోయినట్లుగా బాధపడుతున్నారని పేర్కొన్నారు.

స్ఫూర్తిని కొనసాగిద్దాం: ప్రధాని
గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతిపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సంతాపం వెలిబుచ్చా రు. ఆమె స్ఫూర్తిని మనమంద రం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. మృతురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ఓ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు. యావత్ దేశం విషాదంలో మునిగిపోయిందని, ఆమె మరణించినా.. ఆమె ధీరత్వం ఎనలేనిదని వ్యాఖ్యానించారు. చివరి క్షణం వరకు ఆ విద్యార్థిని ప్రదర్శించిన పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని అన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై యువత స్పందించిన తీరు అభినందనీయమని, ఇలాంటి స్ఫూర్తి దేశానికి కావాల్సిందేనని పేర్కొన్నారు. యువతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, అందరూ శాంతించాలని విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణ, భద్రతకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. భార త్‌ను మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

logaoathamపోరాట స్ఫూర్తి వృథా కాదు: సోనియా
గ్యాంగ్ రేప్ బాధితురాలు మరణించడం తనను కలచివేసిందని, ఆమె పోరాట స్ఫూర్తి వృథా కాదని యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక మహిళగా, ఒక తల్లిగా తాను మృతురాలి తరఫున పోరాడుతున్న యువత మనోభావాలను, ఆవేదనను అర్థం చేసుకుంటున్నానని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని సోనియా అన్నారు.

పారామెడికల్ విద్యార్థిని మరణాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, తమ ప్రియమైన కూతుర్ని, చెల్లెల్ని కోల్పోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాగైనా బతకాలని, కలలను సాకారం చేసుకోవాలని, నిందితులపై పోరాడాలని విద్యార్థిని చివరి శ్వాసవరకు తపించిందని, ఆమె ఆరాటం మరువలేదని అన్నారు. దేశంలో మహిళలకు భద్రత, రక్షణ కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ అన్నారు.

యువత ఆందోళన సబబే: స్పీకర్ మీరాకుమార్
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అండగా యువత చేస్తున్న ఆందోళన సబబేనని, అందులో నిజాయితీ, అర్థం ఉందని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ వ్యా ఖ్యానించారు. ఇది సరికొత్త భారత్ నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. దేశం ఓ ధీరవనితను కోల్పోయిందని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మహిళల రక్షణ కోసం కఠినచట్టాల ఆవశ్యకత ఏర్పడిందన్నారు.

రేపిస్టులకు మరణశిక్షే శరణ్యం: సుష్మాస్వరాజ్
అత్యాచారాలు, హత్యలు కేసుల్లో నిందితులకు మరణ శిక్ష విధించాల్సిందేనని బీజేపీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అభివూపాయపడ్డారు. ఇదే విషయాన్ని తాను 2011 ఫిబ్రవరి 10న కూడా ప్రస్తావించానని ఆమె శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహిళల భద్రతపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతికి ఆమె తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.

ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి..: పార్టీలు
గ్యాంగ్ రేప్ ఘటనపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. విద్యార్థిని మరణం జీర్ణించుకోలేకపోతున్నామని, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధానికి లేఖ రాశారు. ఢిల్లీ రేప్ ఘటనపై ఆందోళనకు దిగినవారి పట్ల రాష్ట్రపతి తనయుడు అభిజిత్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ప్రజల ఆందోళనలు, అభివూపాయాలను గౌరవించి, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఘటనపై చర్చించాలని కేంద్రాన్ని సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా డిమాండ్ చేశారు. నిందితులను వదలొద్దని సీపీఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. పారామెడికల్ విద్యార్థిని మరణంపై కేంద్రం స్పందించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మమతా శర్మ అన్నారు.

సింగపూర్ ప్రభుత్వం సంతాపం
ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతికి సింగపూర్ ప్రభుత్వం కూడా సంతాపం వెలిబుచ్చింది. సింగపూర్‌లో ఉన్న భారతీయులు కూడా గ్యాంగ్ రేప్ ఘటనను ఖండించారు. మృతిరాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అమ్మా..! బతకాలని ఉంది
– ధీర వనిత అమానత్ ఆకాంక్ష
అతి కిరాతకమైన సామూహిక అత్యాచారం.. ఒళ్లంతా గాయాల పుండు!! అయినా ఆమె గుండెనిబ్బరం ఏమాత్రం సడలలేదు. మొక్కవోని ధైర్యసాహసాలతో 13 రోజులపాటు మృత్యువుతో పోరాడింది. తనకు బతకాలని ఉందన్న ఆకాంక్షను వ్యక్తంచేసింది. మరణశయ్యపై ఉండి కూడా రెండుసార్లు మేజిస్ట్రేట్ ముందు ధైర్యంగా వాంగ్మూలం ఇచ్చింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో అత్యాచారానికి గురై మృతి చెందిన అమానత్ విషాదకర సాహస గాథ ఇది. సఫ్దర్‌జంగ్ ఆస్పవూతిలో చికిత్స పొందుతున్న అమానత్ డిసెంబర్ 19న తల్లి, సోదరుడితో మాట్లాడుతూ.. ‘‘నాకు బతకాలని ఉంది’ అని చెప్పింది. డిసెంబర్ 21న అత్యంత సాహసోపేతంగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చి.. తనపై ఘాతుకానికి ఒడిగట్టిన నేరస్తులకు కఠినమైన శిక్ష విధించాలని కోరింది.

కన్నీరుమున్నీరైన గ్రామస్తులు
బలిలా (ఉత్తరవూపదేశ్): గ్యాంగ్ రేప్ బాధితురాలి స్వగ్రా మమైన ఉత్తరవూపదేశ్‌లోని మంద్వారా కలన్‌వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధితురాలి ఆత్మశాంతికి నివాళులు అర్పించామని గ్రామ పెద్ద శివ్‌మందిర్ సింగ్ తెలిపారు.

ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌కు చుక్కెదురు
– జంతర్‌మంతర్ వద్ద అడ్డుకున్న యువత
– నిరసనల మధ్యే నివాళులు
గ్యాంగ్‌రేప్ బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) మృతికి సంతాపంగా నివాళులు అర్పించేందుకు శనివారం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంవూతికి చేదు అనుభవం ఎదురైంది. జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ప్రజలు షీలాదీక్షిత్‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాపస్ జావో’ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారుల్ని శాంతింపజేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో.. హడావిడిగా అక్కడే ఓ చెట్టు కింద కొ వ్వొత్తి వెలిగించి.. తలవంచి అమానత్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న ప్రజలు ‘సీఎం గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె వెంటనే పోలీసు భద్రతతో అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, గ్యాంగ్‌రేప్ ఘటనపై సిగ్గుపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణ ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.