న్యూఢిల్లీ : స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస నోటీసు ఇచ్చి ఓవరాక్షన్ చేసిన సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. సభ లోపల, బయట తెలంగాణపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ తలనొప్పిగా మారిన ఆరుగురు ఎంపీలపై కాంగ్రెస్ హైకమాండ్ కొరడా ఝుళిపించింది. పార్టీ నుంచి ఆ ఆరుగురిని బహిష్కరించి కాంగ్రెస్ తన సిన్సియారిటీని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్(విజయవాడ), ఉండవల్లి అరుణ్‌కుమార్(రాజమండ్రి), సాయిప్రతాప్(రాజంపేట), హర్షకుమార్(అమలాపురం), రాయపాటి సాంబశివరావు(గుంటూరు), సబ్బం హరి(అనకాపల్లి)లపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకంది.
క్రమశిక్షణా రాహిత్యం కింద వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. ఈమేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. బహిష్కరణ వేటు తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. గత వారం రోజులుగా ఈ ఆరుగురు లోకసభలో కూడా ఆందోళన చేస్తూ సభకు ఆటంకం కలిగిస్తున్నారు. వీరిని సభనుంచి సైతం సస్పెండ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో ఆరుగురిపై చర్యలు తీసుకోవడం వల్ల మిగతా సీమాంధ్ర ఎంపీలను దారిలోకి తెచ్చుకోచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
మా గోల్ తెలంగాణ: అజయ్ మాకెన్
న్యూఢిల్లీ: తెలంగాణ తమ పార్టీ గోల్ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. తెలంగాణ బిల్ పాస్ చేయించడమే మా తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. మిగితా బిల్లులు తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. ఎంపీలపై వేటు మా లక్ష్యం చేరుకోవడం కోసమేనని చెప్పారు.