ఓబీసీ కోటాపై క్రీమీలేయర్ పెంపు

-ఆరు లక్షలుగా ఆదాయ పరిమితి.. కేంద్ర కేబినెట్ నిర్ణయం

– గాంధీ హెరి సైట్స్ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఓబీసీ కోటా రిజర్వేషన్ ఫలాలను మరింత మందికి అందించే దిశగా కేంద్రవూపభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాపై విధించిన క్రీమిలేయర్ సీలింగ్‌ను పెంచింది. ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు పొందడానికి ఇప్పటివరకు ఆదాయ పరిమితి రూ. 4.5 లక్షలు ఉండగా, దీనిని రూ. ఆరు లక్షలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది.

వినియోదారుల ధరల సూచి పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా క్రీమిలేయర్‌ను పెంచింది. ఇతర వెనుకబడిన తరుగుతుల (ఓబీసీ)లోని సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలు, సంపన్నులు రిజర్వేషన్ పొందకుండా క్రీమిలేయర్ పరిమితిని విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యావకాశాల్లో 27శాతం రిజర్వేషన్ పొందుతున్నారు. కాగా, గాంధీ హెరి సైట్స్ మిషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహాత్మ గాంధీకి సంబంధించి చారిత్రక ప్రదేశాలను పరిరక్షించి, అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ చేపట్టనున్నారు.

కాగా, ఇకపై ఢిల్లీలో మరణించిన వీవీఐపీలకు ప్రత్యేక సమాధులు నిర్మించకూడదని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖ వ్యక్తుల సంస్మరణ చిహ్నాలను ఒకే భవనంలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఇందుకోసం మధ్యఢిల్లీలోని యమునా నదీ సమీపంలో ‘రాష్ట్రీయ స్మృతి’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న (ఏపీఎల్) కుటుంబాలకు ఈ ఏడాది అదనంగా మరో ఆరు లక్షల టన్నుల సబ్సిడీ ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలన్న ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఈ ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.