ఓట్ల కోసం మోడీని బూచిగా చూపొద్దు

‘సోకాల్డ్ సెక్యులర్’ పార్టీలకు ముస్లిం మతపెద్ద మహ్మద్ మదానీ సూచన
ముస్లిం మతపెద్ద, ‘జమాతే ఉలేమా ఈ హింద్’ (జేయూహెచ్) చీఫ్ మహ్మద్ మదానీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నరేంవూదమోడీ అధికారంలోకి వస్తారనే భయాన్ని రేకెత్తించి.. ముస్లిం ఓట్లను కొల్లగొ కొన్ని ‘సో కాల్డ్ సెక్యులర్’ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీయే కాదు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే తరహా ప్రతికూల పద్ధతిలో ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. మదానీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎవరో అధికారంలోకి వస్తారనే బూచిని చూపించి ఓట్లు అడగడం మానుకోవాలని జేయూహెచ్ చీఫ్ మహ్మద్ మదానీ సూచించారు. ‘ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు తమ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఏం చేశారో వివరించాలి. తాము నెరవేర్చిన హామీలేమిటి? ఇంకా నెరవేర్చకుండా మిగిలిపోయిన హామీలేమిటో.. తెలిపి ప్రజల నుంచి ఓట్లు అడగాలి.

అంతేకానీ ఎవరో ఒక వ్యక్తి అధికారంలోకి వస్తారనే భయాన్ని ఆధారంగా చేసుకొని.. ప్రతికూల ప్రచారంతో ముస్లిం ఓట్లు పొందేందుకు ప్రయత్నించకూడదు’ అని ఆయన విలేకరులకు తెలిపారు. మోడీ అంశంపై స్పందిస్తూ ఆయన ఎజెండా ఏమిటి? ఎలా గుజరాత్ ఎన్నికల్లో గెలిచారన్నది విభిన్నమైన అంశమని, ఈ విషయంలో మీడియా భిన్నమైన ధోరణి అవలంబిస్తోందని పేర్కొన్నారు. మదానీ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఓట్ల కోసం ఆ పార్టీ ప్రజలను విభజిస్తోందని, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి ఓట్లు పొందాలని చూస్తోందని, దీనిని ప్రజలు గుర్తించారని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ స్పందిస్తూ.. తామేమీ భయాన్ని రేకెత్తించడం లేదని, అది చాలాకాలంగా ఉందని, దానికి చరిత్ర ఉందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ఏ తరహా మత విభజనకు పాల్పడినా అది సరికాదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అభివూపాయపడ్డారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.