ఓట్లు, సీట్ల కోసం కాదు.. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ పోరాటం

 

KCRR-ఆంధ్రా పార్టీల్లో బానిసల్లా తెలంగాణ నాయకులు
– రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ అవతరిస్తుంది
-చలో అసెంబ్లీ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలి
-కోదాడ శిక్షణ తరగతుల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
: ‘‘ఎల్లయ్య, మల్లయ్యలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవడానికి ఉద్యమం చేయడం లేదు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాల నుంచి విముక్తి కోసం చేస్తున్న పోరాటం. చిల్లరమల్లరగా చేసే పోరాటం కాదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం. బతుకుల బాగు కోసం చేసే ఉద్యమం. మన ప్రాంతంలోని నీరు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ వారికే దక్కాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కొత్తగా వచ్చింది కాదు. స్వాతంత్య్రం తర్వాత ఎనిమిదేళ్లు తెలంగాణ ఉంది. వాళ్లకు కర్నూలు రాజధాని ఉండగా.. మనకు హైదరాబాద్ రాజధానిగా ఉంది. అప్పట్లోనే మనవారికి ఆంధ్రోళ్ల కంటే వేతన స్కేల్ ఎక్కువ. ఇక్కడి బొగ్గు, నీరు, ఉద్యోగాలపై కన్నేసి కుట్రపూరితంగా ఏర్పడిందే ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం’’అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని, కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లుగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక అమ్మాయి చనిపోతే లోక్‌సభ, రాజ్యసభ స్తంభించడంతో చట్టాలు, తీర్మానాలు చేశారు.. అదే తెలంగాణలో వెయ్యి మంది ప్రాణత్యాగం చేసుకుంటే పట్టదా..? అని రాజ్యసభలో కేకే అడిగితే జవాబు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎంత చెప్పినా వొడువదని అన్నారు. ‘‘లగడపాటి, జగడపాటి రాజగోపాల్ మైలవరం వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్ర ప్రాంతానికి నీరు రాదని తప్పుడు ప్రచారానికి దిగాడు. నిజానికి తెలంగాణ వస్తే మన నోరు కొట్టి అక్రమంగా తరలిస్తున్న నీరు ఆంధ్రాకు వెళ్లదు. వారికి న్యాయంగా వెళ్లాల్సిందే మాత్రమే వెళ్తుంది’’ అని అన్నారు. తెలంగాణలో లిఫ్ట్ అంటూ.. ఆంధ్రకు సాగునీరు థెఫ్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో 185కి.మీ. కాల్వ తవ్వితే కరువే ఉండదని అన్నారు. పక్కనే సాగర్ ప్రాజెక్టు ఉన్నా నీరు లేదని, సుమారు లక్ష మంది పసిపిల్లలు ఫ్లోరైడ్ మహమ్మారి కోరల్లో చిక్కారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తాను ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు.

తెలంగాణకు భగవంతుడు అన్ని ఇచ్చినా.. పాలకులు, మనుషులే శాపంగా మారారని అన్నారు. ‘‘నిండు అసెంబ్లీలో సీఎం తెలంగాణకు రూపాయి ఇవ్వనని అంటే ఏ మంత్రీ నోరు మెదపలేదు. తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని అవమానిస్తే.. ఒక్క టీఆర్‌ఎస్ పార్టీనే పోరాటం చేసింది. ఇలాంటి పార్టీలకు ఓటు వేయా లా..?’’ అని ప్రశ్నించారు. టీడీపీకి ఈ జన్మలో అధికారంలోకి రాదు.

తప్పిపోయి టీడీపీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సీఎం, అధ్యక్ష, శాసన సభ, మండలి పదవులు తెలంగాణకు దక్కుతాయా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌బాబు పార్టీలో తెలంగాణ నాయకులు గులాంగిరీ చేస్తున్నారని, ద్వితీయక్షిశేణి పౌరులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ రోజురోజుకూ బలపడుతున్నదని.. 100ఎమ్మెల్యే, 16ఎంపీ సీట్లు గెలిచి తీరుతుందన్నారు. ‘‘దేశంలో ఏ జాతీయ పార్టీ నేరుగా అధికారం దక్కించుకునే పరిస్థితి లేదు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. సంకీర్ణమే గతి. 17ఎంపీలు కాదు.. 15 ఎంపీలువచ్చినా తెలంగాణ తెస్తాం’’ అని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ పోరాటాలతోనే జార్ఖండ్ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ అవతరిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.67వేల కోట్ల ఆదాయం తెలంగాణ నుంచి వస్తే.. రూ.17వేల కోట్లు 13 సీమాంధ్ర జిల్లాల నుంచి వస్తున్నదని అన్నారు. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఈ నెల 14న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలిరావాలని కోరారు.

సోనియమ్మకు తెలంగాణ గర్భశోకం పట్టదా?: మందా 
‘‘కేసీఆర్ నిరాహార దీక్షతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కొందరు సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారు. కొందరు స్వార్థపరులు, ధనవంతుల ప్రలోభాలకు లొంగిన కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం నోటి కాడి ముద్దను గద్ద తన్నుకు పోయినట్లుగా చేసింది. వెయ్యి మంది చనిపోయినా కేంద్రంలో కదలిక లేదు. అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నాం’’ అని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. కాంగ్రెస్ అబద్ధాల కోరు. సమయం, పబ్బం గడిస్తే చాలని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు దేశం ఏమైపోయినా ఫర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ఈ ప్రాంత తల్లుల గర్భశోకం సోనియమ్మకు అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌పార్టీని వీడడంతో తలమీద బరువు తగ్గిందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.