ఒక్క శేఖర్… రెండు క్యాన్సర్లు-అల్లం నారాయణ

క్యాన్సర్ లొంగదీస్తున్న సమయాల్లోనే శేఖర్ అంతకుమించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యాడు.

శేఖర్ చెయ్యి పువ్వు వలె సుతిమెత్తగా ఉన్నది. కరస్పర్శ శీతలంగా ఉన్నది. కార్టూ న్లు వేసిన కరవాలం లాంటి చెయ్యి శేఖర్‌ది. కడుపు క్యాన్సర్ కోతతో ఖాళీ అని చెప్తున్నపుడు నిండా స్పహతోనూ, పూర్తి చైతన్యంతోనూ, కాలం గడుస్తూ ఉన్న కొద్దీ పదునుదేరుతున్నట్టు అతని మనసు మాత్రమే మిగి లి ఉన్నది. అదింకా రంగుల మంకెనపూలను కలగంటూ ఉన్నట్టున్నది. వినీవినపడకుండా ఉన్న లోగొంతు మాటలోనూ శేఖర్ ఒక విషయం మాత్రం సూటిగా చెప్పాడు. ఇట్లా ఒక ప్రాజెక్టు ఉన్నప్పుడు మాత్రమే మంచిగుంటున్నది. పనిచేస్తున్నప్పుడు మాత్రమే దిగులుపోతున్నది. ఆ పని మీదనే మనసు కొట్టుకుంటున్నది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు రెండు మూడు గంటలకన్నా వశపడుతలేదు అన్నడు శేఖర్.

శేఖర్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి కార్టూనిస్టు. అంతకుముందు ప్రజాశక్తి, ఆంధ్రప్రభ కార్టూనిస్టు. అంతకుముందు పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థి. అంతకు ముందు ఒక కులంలో పుట్టినందుకు వివక్షకు గురయినవాడు. జీవితం పొడవునా ఆ వివక్ష మూలాల శోధన కోసం చదివినవాడు. జీర్ణించుకున్నవాడు.

పీజీ తర్వాత చదువుతో వచ్చే ఉద్యోగాలకేసి కన్నెత్తి కూడా చూడకుండా రంగుల కలల లోకంలోకి తేరిపార చూసి రంగుల్లో మునిగినవాడు. జీవితమంటే దుక్కమూ, బీభత్సమూ, రౌద్రమూ, వెటకారమూ, వ్యంగ్యమూ, అంతిమంగా పోరాటమూ అని తెలుసుకున్నవాడు కనుకనే ఒక క్రో క్విల్, ఒక బ్రష్షు, ఒక ఒక కుర్చీ, కింద చెత్తబుట్ట, కొన్ని రంగులు, అన్నింటికి మించిన మనసులో కదలాడే సప్తవర్ణాల కదలికలతో శేఖర్ కార్టూనిస్టు అయ్యాడు. అచ్చం నల్లగొండలో వత్తి కులాల మూలాల నుంచి వచ్చిన పుట్టెడుమంది చిత్రకారుల్లాగా… ఏలె లక్ష్మణ్‌లాగా, శ్రీధర్, నర్సిమ్, శంకర్, మత్యుంజయ్, లింగరాజు, అవినాష్, రవినాగ్‌ల లాగానే కుంచెను ఎత్తిపెట్టి సమాజాన్ని కకావికలుగా కలియబెట్టే పనికి దిగాడు శేఖర్. అతనిప్పుడు అచ్చంగా నలభైవేల కార్టూన్ల పొగరుబోతు. అంతమాత్రమేనా? నల్లగొండ నుంచే ఎదిగివచ్చిన వత్తి కులాల నుంచి ఎగిసిపడి వచ్చిన రంగులు, శోభవర్ణితాలు, సాంచెలు, కలనేతలు, మట్టిని మలిచిన వత్తి కులాల మూలధాతువైన సజనాత్మకతను నిలువెల్లా నింపుకున్నవాడు శేఖర్.
రాజకీయ కార్టూన్ల కాలానికి ప్రతినిధి. ఒక్క మోహన్, ఒక్క సురేంద్రల నుంచి రాజకీయ కార్టూన్ల వరవడిని దిద్దుకుని దినపత్రికల ప్రథమ పుటల ఐ మూలాల్లోకి చేరుకుని ఏండ్ల తరబడి ముద్రలేసినవాడు శేఖర్. అతని చెయ్యిప్పుడు భయం గొలిపేంతగా శీతలం కమ్మినట్టుగా ఉన్నది.

ఇక నేడో రేపో తలుపు తోసుకుని వచ్చే మత్యువు ముందు నిలబడి మాట్లాడే సాహసం చేస్తున్నందువల్ల శేఖర్ మనసు మాత్రం ఉష్ణకాసారంలా రగులుకున్న రగల్‌జెండాల రెపరెపలాడ్తున్నది. ఒక స్టమక్ క్యాన్సర్ పేషంట్ నాలుగోదశలో మత్యువును ధిక్కరించడమొక్కటే సాహసం అనిపించుకోదు. కానీ సర్జరీ, కీమోథెరపీ, రక్తపు వాంతులు, నిద్రపట్టని శీతల సుదీర్ఘ రాత్రుల కవి సమయాల్లో శేఖర్ సమాజ క్యాన్సర్‌ల మీద కత్తి దూస్తున్నాడు. ఇప్పుడతను తన క్యాన్సర్‌పై యుద్ధాన్ని నిలిపి క్యాస్ట్ క్యాన్సర్‌పై యుద్ధం ప్రకటించాడు. దటీజ్ శేఖర్. ఒక నల్లగొండ పిల్లవాడు. చిన్నప్పుడే బ్రాహ్మల పిల్ల సత్తుగ్లాసులో పైనుంచి నీళ్లు పోసినప్పుడు మొట్టమొదటిసారి స్పహలో క్యాస్ట్‌క్యాన్సర్‌ను కనుగొన్న శేఖర్. ఇంత కాలం తర్వాత.

మార్క్స్‌నూ, మావోనూ, అంబేద్కర్‌నూ, ఫూలేనూ, కంచె ఐలయ్యనూ చదువుకొని, విప్లవాలను కలగని, కలగని, చివరికి క్యాస్ట్ క్యాన్సర్‌పై యుద్ధం ప్రకటించాడు. ఇది ద్వంద్వ యుద్ధం. ఎడతెగని పోరు. అంతం లేని పోరు. శరీరంలో దాగున్న క్యాన్సర్ కణాలనన్నా జయించవచ్చునేమో కానీ క్యాస్ట్ క్యాన్సర్‌ను జయించడం సాధ్యమా? ఈ యుద్ధం అనాదిది. ఈ యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధం కొనసాగవలసి ఉన్నది. మత్యువును కాసేపు మంచం ప్రక్కనే నిలేసి శేఖర్ కుల పురాణాలు గానం చేసి నిచ్చెనమెట్ల వ్యవస్థ అంతరాల దొంతరలు, అంతస్తులు, తంతెలు తారుమారయితే ఎలా ఉంటుందని చిలిపి కలలు కంటున్నాడు. కళారూపం కార్టూన్ కనుక అది చిలిపిగానో, వ్యంగ్యంగానో, సరదాగానో కనిపించవచ్చు కానీ అది నిజానికి జీవితంలో కుల నిచ్చెనమెట్ల బీభత్సాన్ని తలకిందులు చేసి బ్రాహ్మణులను కింది తంతెలో, శూద్రులను పై తంతెలో కూచోబెట్టి ప్రకటించిన మర ఫిరంగుల తిరుగుబాటు.

సరదాగా కాదు. అది జరగాల్సి ఉన్నది. కుల వ్యవస్థ తారుమారై. శూద్రులు పై తంతెలో ఉన్నప్పటి ఊహే చాలామందికి జ్వరమానికి చిక్కని జ్వరం తెప్పిస్తుంది. శేఖర్ అది సాధించాడు. అదీ ఆస్పత్రి బెడ్ మీద నుంచి… అచ్చంగా మహాసౌధాలను బద్దలుకొట్టమన్న ఫూలే లాగే నిచ్చెనలను తారుమారు చేసి, పిరమిడ్లను తారుమారు చేసి పైన శూద్రున్ని నిలబెడ్తున్నాడు శేఖర్. ఈ పిరమిడ్లను తలకిందులు చేయడాన్ని ఘంటా చక్రపాణి, సోషియో-హిస్టారికల్ థీమ్ అన్నాడు. ఇదొక అణగారిన కుల ఆక్రందనల నుంచి ఎలుగెత్తిన తిరుగుబాటు ఊహగా నాకు తోస్తున్నది.
శేఖర్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నది. వచ్చే ప్రాణం. పోయే ప్రాణం. ఆంధ్రజ్యోతిలో ఆయన కార్టూన్లు ఆగలేదు. చక్రపాణే అన్నట్టు కులానికీ, క్యాన్సర్‌కూ పైకి కనిపించకుండా మనిషిని తినే లక్షణం ఉన్నది. శేఖర్‌ను క్యాన్సర్ తినేస్తూ ఉన్నది. కానీ కులం క్యాన్సర్‌కు అనివార్యంగా శస్త్ర చికిత్స చేయడానికి, ఒక కీమోథెరపీ చికిత్స ఇవ్వడానికి శేఖర్ కుంచెనే తన ఆయుధంగా ప్రకటించుకున్నాడు.

కులం గాడి మీద అరవై నాలుగు కార్టూన్లు వేశాడు శేఖర్. బతుకులో ఎదురైన అనుభవాలు… చదువు నేర్పిన శాస్త్రీయత. సత్యశోధన. క్యాన్సర్, కులం ఒక్కటేనన్న జమిలి స్పహ. తెలంగాణ అతనికిచ్చిన జీవితం. నల్లగొండ అందించిన రంగుల ఆయుధాలు శేఖర్‌ను స్పహ కోల్పో ని కార్టూనిస్టును చేశాయి. నిజమే తెలంగాణ అంటే ఏడుపులు, శోకాలు, తీవ్ర మథనాలు, ఆగ్రహావేశాలేనా? వెసులుబాటులేని జీవితాలేనా! హాస్యం లేదా? ఎటకారం లేదా? ఉంది. కానీ అది ఆంధ్ర లాంటి వెసులుబాటు వెటకారం కాదు. తీరుపాటు వ్యంగ్యమూ కాదు. అది జీవితంలో ఉన్న దుమారాలు, చెత్తాచెదారాలూ, ఏ మాత్రం సుఖూన్ కాని వాతావరణాల మధ్య ఒక హాస్య, వ్యంగ్య, విషాద, బీభత్స, కరుణ రసాల సమ్మేళనమే కార్టూన్‌గా నమ్మిన తరపు నల్లగొండ తరహా కార్టూనిస్టు శేఖర్. కె. శ్రీనివాస్ అన్నట్టు తెలంగాణ జీవితం నుంచి వచ్చిన కార్టూనిస్టుల ధోరణుల్లో వెటకారం పాలు తక్కువ కావడానికి మూలాలున్నాయి. కారణాలున్నాయి.

దినపత్రికల్లో పనిచేసే అందరు రాజకీయ కార్టూనిస్టుల లాగా కేవలం రోజువారీ తంతు పేలినప్పుడు సరే, పేలనప్పుడు పేలవమైన ఐడియాలతో బండిలాగితే శేఖర్ సామాన్యుడయిన కార్టూనిస్టు మాత్రమే అయ్యేవాడు. అతను పత్రికల్లో ఉంటూ చేయరాని అతి ప్రమాదకరమైన పనులు చేశాడు. ఒకటి గిదీ తెలంగాణ థీమ్‌తో మొత్తం తెలంగాణ సంస్కతి, జీవితము, చరిత్రలతో అలయ్ భలాయ్ తీసుకున్నాడు.

కుంచె చేతబట్టి తెలంగాణ అలయ్‌ల దుంకి అస్సోయ్ ధూలా ఆడాడు. తెలంగాణ సోయిని ప్రదర్శించి, ఇదీ నా తెలంగా ణ సౌరు అని చూపాడు. అది అప్పటి కార్టూను ఊహకు అందని విషయమే. తెలంగాణ వైభవోపేత గతం, విశిష్ట సంస్కతిల నుంచి వర్తమాన పోరాటంలో తలమునకలయి ఉన్నప్పుడు మీడియా రెండుగా చీలి కనబడుతున్నప్పుడు, తెలంగాణ సంగతులు ఎక్వ తక్వ మాట్లాడితే ప్రాంతీయ మౌఢ్యంగా పండితులు ముఖ్యంగా పత్రికా పండితులు ముద్రలు గొడ్తున్నప్పుడు బతుకుదెరువుకు ముప్పు వచ్చే ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా శేఖర్ తనకు తెలంగాణ తెలివిడి నుంచి వచ్చిన కొత్త చైతన్యం పురికొల్పిన సాహసం అయి గిదీ తెలంగాణ కార్టూన్లు గీశాడు. ఇది తెలంగాణ ఆత్మచిత్రణ అన్నారు తెలంగాణవాదులందరూ ఒకే గొంతుతో. కానీ శేఖర్ బచాయించిండు. ఆ ప్రమాదం అతన్నేమీ చేయలేదు. బహుశా తెలంగాణ నిలబడి ఉన్నందు వల్ల కూడా కావొచ్చు. కానీ ఆయన క్యాన్సర్ ప్రమాదంలో పడ్డడు.

పత్రికల్లో పనిచేస్తున్నవారు చేయకూడని నిషిద్ధ కార్యం మరొకటి కుల కళా సాధన. కులం పేరెత్తితే కష్టం. కులం లేని మీడియా తెలుగునాట లేదు. ఆ మాటకొస్తే భారతదేశంలోనే లేదు. కానీ శరీరంలో వ్యాపించిన క్యాన్సర్‌లాగే, దేశమంతా వ్యాపించిన కులం క్యాన్సర్ మీద కూడా శేఖర్ యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు ఆయన మీడియా ప్రమాదాలకు అతీతుడు. అతన్నిప్పుడు ఎవరూ ఏమీ చేయలేని అజేయుడు. క్యాన్సర్ లొంగదీస్తు న్న సమయాల్లోనే శేఖర్ అంతకు మించిన క్యాస్ట్ క్యాన్సర్‌ను నిలదీసి బజారుకీడ్చి, రచ్చచేసి, కిండల్ చేసి, అంతరాల దొంతరలను అవహేళన చేసి వెక్కిరించి నిటారుగా కుంచె మీద నిలబడి ధన్యుడయ్యా డు. చుండూరు కేసులో న్యాయం దళితులను వెక్కిరించింది. దేశం అట్లానే ఉన్నది.

కుల మూలాలు దాచుకున్న మనువు లు, మతాలు, మౌఢ్యాలు కొత్తరూపంలో మోడిత్వమై దేశమేలడానికి కమ్ముకుని వస్తున్నాయి. భూస్వామ్యం పడగవిప్పి కారంచే డు, చుండూరులై, లక్షింపేటలై బుసలు కొడ్తున్న సందర్భాల్లో మోడి ప్రభంజనాలు, దానిచుట్టూ గుంపు కడ్తున్న సామాజిక వర్గా లు… అంతా తేటతెల్లమే. ఈ కీలక సందర్భంలో స్పహను ప్రకటించిన శేఖర్‌కు, ఆయన పుస్తకం క్యాస్ట్ క్యాన్సర్‌కు జేజేలు. అనారోగ్య బాధితుణ్నే అయితేనేం యోధుణ్నే అని ప్రకటించుకున్న చెరబండరాజు లాగా… మంచం పక్కన చావును నిలబెట్టి మందితో మాట్లాడుతున్న శేఖర్‌కు జేజేలు. శేఖర్ ఇవ్వాళ్ల తెల్లటి నీ షర్టు.. నల్లటి ప్యాంటు.. నీ కొత్త డ్రెస్ బావున్నది. ఒక కొత్త ప్రాజెక్టుతో జీవితం, పని పొడిగిస్తూ… పొడిగిస్తూ…. ఉంటావని… ఆశపడుతూ… ఆశపడుతూ…

narayana.allam@gmail.com

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.