ఐటీ భూ దందాలో తాజా మాల్!

రాష్ట్ర విభజన సందర్భంలో సీమాంధ్ర సర్కారు కొత్త కుట్రకు తెరతీసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల కోసం కొత్త ఎత్తుగడలను అమలు చేస్తున్నది. అగ్గువ ధరకు భూములు పొందిన ఐటీ కంపెనీలు.. షరతులను అమలు చేయలేకపోయాం.. కనికరించండని మొరపెట్టుకోవడమే తరువాయి వాటిపై అవ్యాజమైన ప్రేమ కురిపిస్తున్నది. షరతులు ఉల్లంఘించిన కంపెనీలకే వేలాది ఎకరాల హక్కులను తిరిగి రాసిచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గజం ధర రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు పలికే ఖరీదైన స్థలాలను హస్తగతం చేసుకునేందుకు తెర వెనుక కుట్ర సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు తీసుకోకుండా ఫీజు చెల్లిస్తే గడువు పెంచుతామంటూ ప్రభుత్వం మెలికపెడుతూ ఉత్తర్వులు జారీచేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒప్పందాల ఉల్లంఘన చూపి భూములు స్వాధీనం చేసుకుంటారని పసిగట్టిన సదరు సంస్థల యాజమాన్యాలు పాలక పెద్దలతో ముందుగానే రాజీ కుదుర్చుకొని తాజా ఒప్పందాలతో మరికొంత కాలం వెళ్లదీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దానికి ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా మద్దతు పలుకుతుండడం విశేషం. తాజాగా ఉల్లంఘనలపై చర్యలంటూ ఉత్తర్వులు.. అందులోనే హక్కుల కల్పన. అధికారమొక శాఖదైతే ఔదార్యం ప్రకటించింది మరో శాఖ కావడం విశేషం. భూ కేటాయింపులు, ఒప్పందాల అమలు బాధ్యతంతా ఏపీఐఐసీ చేపడుతోంది. కానీ ఉల్లంఘనలపై ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులు వల్లమాలిన ప్రేమను కురిపిస్తుండడం గమనార్హం.

పొడిగించడం ఎందుకు?
ఏపీఐఐసీ కేటాయించిన వాటిలో 30 శాతం కూడా వినియోగించని కంపెనీకి సంబంధించిన భూములను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఉన్న నిర్ణయాలు పరిశీలిస్తే అసలు బాగోతం బయట పడుతుంది. ఒప్పందాల మేరకు గడువులోగా హామీలు నెరవేర్చని ఐటీ కంపెనీలు తమ ఒప్పందాలను మార్చాలని, వెసులుబాటు కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడంతోనే ఈ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. వెసులుబాటు కల్పించడంతో పాటు కంపెనీలపై మరికొన్నేళ్ల పాటు చర్యలేవీ తీసుకోకుండా ఉండేటట్లుగా నిర్ణయాలు వెలువరించారు. ఉద్యోగాల కల్పనలో 31 నుంచి 80 శాతం వరకు హామీని నెరవేర్చిన సంస్థలు భూమి విలువలో పది శాతం ధరను ప్రభుత్వానికి ప్రాసెసింగ్ చార్జీల కింద చెల్లించాలి. అలాగే 81 నుంచి 100 శాతం హామీలను నెరవేర్చిన కంపెనీలు పూర్తి స్థాయిలో హామీలు నెరవేరుస్తామంటూ భూమి ధరలో 5 శాతం ప్రాసెసింగ్ చార్జీగా చెల్లించాలి. అయితే, ఉల్లంఘనుల నుంచి నామమాత్రపు ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేసి చర్యలను ఎత్తేస్తూ ఉత్తర్వులో పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. అంటే కేవలం 30 శాతం కూడా వినియోగించని కంపెనీల స్థలాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటామని అధికారులు ప్రకటించారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఏయే కంపెనీలపై ఐటీ శాఖ చర్యలు తీసుకోనుందో నమస్తే తెలంగాణ ఆరా తీసిం ది. ఐతే సదరు కంపెనీల జాబితా ఏదీ శాఖలో అందుబాటులో లేదని అధికారులు స్పష్టం చేశారు. ఏపీఐఐసీ ప్రధానంగా సెజ్‌లు, ఐటీ/ఐటీ రంగ సంస్థల కోసం లేఅవుట్లను ఎక్కువగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లోనే చేసింది. నానక్‌రాంగూడలో 50 ఎకరాలు, జడ్చర్ల పోలేపల్లి దగ్గర 250 ఎకరాలు, మెదక్ జిల్లా ములుగులో 100 ఎకరాలు, మహేశ్వరంలో 275 ఎకరాలు, మాదాపూర్‌లో 35 ఎకరాలు, మణికొండలో 30 ఎకరాలు, రాజేంద్రనగర్ మణికొండలో 26 ఎకరాలు, రావిర్యాలలో 150 ఎకరాలు సరూర్‌నగర్‌లో 60 ఎకరాలు, రాయదుర్గ్‌లో 11 ఎకరాలు, కంచ ఇమ్రాత్ రావిర్యాలలో 70 ఎకరాలు వంతున అనేక ఐటీ పార్కులకు వేలాది ఎకరాలు కేటాయించారు. ఇవన్నీ ఏపీఐఐసీ ద్వారా అమల్లోకి తీసుకొచ్చారు. ఏళ్లు గడుస్తున్నా సగానికి పైగా సంస్థలు షరతులను అమలు చేయలేదని సమాచారం. తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టేందుకే ఈ జీఓను విడుదల చేశారని, నిబంధనలను ఉల్లంఘించినప్పుడు భూములను స్వాధీనం చేసుకోవల్సిందేనని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీటన్నింటిపై పునరాలోచన చేస్తామని, సమీక్ష నిర్వహిస్తామన్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.