ఏ హోదాలో బిల్లును వ్యతిరేకిస్తున్నారు?

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభా నాయకుడుగా మాట్లాడుతున్నారో? లేక శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నారో?సభకు తెలిపిన తర్వాతే తన ప్రసంగాన్ని కొనసాగించాలని రాష్ట్ర మంత్రి జానారెడ్డి శాసనసభలో బుధవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిముషాలకే మంత్రి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ స్పీకర్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టారు. ఒకవేళ ఆయన సభానాయకుడుగా కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన అభిప్రాయంతో తాము ఏకీభవించటం లేదని కుండబద్దలు కొట్టారు.

సీఎం సభా నాయకునిగా మాట్లాడినా ఆయన అభిప్రాయాల్లో తాము భాగస్వాములం కాబోమని ప్రకటించారు. బిల్లులో ఉన్న అంశాల పైనే చర్చ జరగాలి తప్పితే ఇతరత్రా అంశాలను ప్రస్తావించటం సమంజసం కాదని పేర్కొన్నారు. బిల్లుపై సభ్యులు అభిప్రాయాలు చెప్పటం వరకే పరిమితం కావాలని, ఓటింగ్.. తీర్మానం ఉండవని జానారెడ్డి చెప్పారు. గతంలో పెద్దలు ఏం చెప్పినా అవన్నీ గతమేనని, ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతిద్వారా వచ్చిన బిల్లు మనముందు ఉన్నందున దానిపై అభిప్రాయాలు మాత్రమే కోరుతున్నారని తెలిపారు. సభలో ఓటింగ్, తీర్మానం ఉండదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులలో చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జానారెడ్డి వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రతిపక్ష సభ్యులందరూ మంత్రి అభిప్రాయాన్ని బలపరుస్తూ బల్లలు చరిచారు. జానారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి మంత్రి డిమాండ్‌పై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు తమ స్థానాలకు వెళ్లలేదు. కిరణ్ ప్రసంగంపై ఇతర పక్షాల నేతలు అభ్యంతరాలు చెప్పారు. తన ప్రసగం రేపు కొనసాగిస్తానని సీఎం చెప్పటంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జానారెడ్డి డిమాండ్‌పై సభ వాయిదాకు ముందు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థానం నుంచి మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు ఏ హోదాలో అన్న సందేహాలకు తావు లేదని అన్నారు.

సీఎం హోదాను కిరణ్ అవమానపర్చారు: హరీశ్
రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభకు సభా నాయకుడుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన కిరణ్‌కుమార్‌రెడ్డి తన అంతటి దురదృష్టవంతుడు లేడని వ్యాఖ్యానించారని, ముందుగా ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సీఎం ప్రసంగంపై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాను కిరణ్ అవమానించారని, రాజ్యాంగాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. టీడీపీ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 10 ఉద్యోగాలు మాత్రమే రీపాట్రియేషన్ చేయాలని సీఎం అన్నారని, ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను శాసనసభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం సభా నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ప్రస్తుత సందర్భం చాలా క్లిష్టమైందని, ఏ పొరపాటు చేసినా చరిత్ర క్షమించదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో నిజాయతీ లేదని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం.. పెళ్లై, పిల్లలు పుట్టిన తరువాత.. జాతకాలు కలవలేదు. అన్నట్టుగా ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

కొత్త సంప్రదాయాలు అవసరంలేదు: స్పీకర్
టీఆర్‌ఎస్ సభ్యుల డిమాండ్‌పై స్పీకర్ మనోహర్ స్పందిస్తూ కొత్త నిబంధనలు, సంప్రదాయల గురించి చర్చించాల్సిన అవసరం లేదని, ప్రతీ శాసనసభ అక్కడి పరిస్థితికు అనుగుణంగా నడుచుకుంటుందని రూలింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా శాసనసభ్యులందరి అభిప్రాయాలనూ తెలియచేద్దామని తెలిపారు. అన్ని పార్టీల శాననసభా పక్షనాయకుడు అభిప్రాయాలను సేకరించి స్పీకర్ ఈ ప్రకటన చేశారు.

సీఎంకు జానారెడ్డి కౌంటర్
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు2013పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో బుధవారం చేసిన ప్రసంగంపై అభ్యంతరాలను లేవనెత్తి దూకుడుగా వ్యవహరించిన తెలంగాణ మంత్రి జానారెడ్డి, సభలో టీ సభ్యుల అభినందనలు అందుకున్నారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమం సాగినంతకాలం సీఎం వెనుకే తిరిగిన ఆయన, బిల్లుపై చర్చను యావత్ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్న ప్రస్తుత తరుణంలో సీఎంను ఎదుర్కొంటున్న టీ నాయకుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జోక్యం చేసుకున్న జానారెడ్డి, అసలు ముఖ్యమంత్రి ఏ హోదాలో బిల్లుపై ప్రసంగిస్తున్నారని నిలదీశారు. వ్యక్తిగత హోదాలో మాట్లాడుతున్నారా?…సభా నాయకునిగా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణలోని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో బిల్లుపై తీర్మానం అవసరం లేదని చాలా రోజులుగా టీఆర్‌ఎస్ తదితర సభ్యులు పదేపదే చెపుతున్న అంశాన్నే జానారెడ్డి ప్రత్యేకంగా చెప్పారు. బిల్లులో ఉన్న అంశాల పైనే చర్చ జరగాలి తప్పితే ఇతరత్రా అంశాలను ప్రస్తావించటం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. సభ్యులు అభిప్రాయాలు చెప్పటం వరకే పరిమితం కావాలని, ఓటింగ్.. తీర్మానం ఉండవని చెప్పారు. అవసరమైతే రెండు వందల మంది అభిప్రాయాలు చెప్పవచ్చని, సభ్యులందరి సూచనలు తీసుకోవచ్చని తెలిపారు. ఎవరెవరు ఏం మాట్లాడారో లెక్కగట్టి కేంద్రానికి పంపవచ్చని, అంతేగాని ఓటింగ్‌మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. దీంతో సీఎంను జానారెడ్డి సమర్థంగా నిలువరించారనే అభిప్రాయాన్ని కలిగించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.