ఏ.. డండనక డండనకా డం.. తెలంగాణ నోట్ వచ్చేసింది

ఏ… డండనక డండనకా డం.. తెలంగాణ నోట్ వచ్చేసిందోచ్.. అమరుల త్యాగం.. విద్యార్థుల పోరాటం.. కేసీఆర్ స్కెచ్.. జేఏసీ స్ట్రగుల్, టీఆర్ఎస్ వార్ ఫలించింది..   దశాబ్దాల తెలంగాణ పోరాటంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందురోజే తెలంగాణ కొత్త పూల సువాసనలతో గుబాళించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మహత్తరమైన ముందడుగు పడింది. దాదాపు నాలుగేళ్ల క్రితం 2009 డిసెంబర్ 9న నాటి హోం మంత్రి పీ చిదంబరం చేసిన ప్రకటన తాజాగా కేబినెట్ తీర్మానంతో పరిపూర్తి అయింది.
shindeనమస్తే తెలంగాణ దినపత్రిక గురువారం నాటి సంచికలో పేర్కొన్న విధంగానే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోంశాఖ రూపొందించిన నోట్ యథాతథంగా కేంద్ర కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లంరాజు, కావూరి సాంబశివరావు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం.. హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసేందుకు కేంద్రం అధికారికంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సకల వ్యతిరేక శక్తులు, మాట మార్చిన నేతలు ఏకమైనా.. కేంద్రం వారిని పట్టించుకోలేదు. తమ ఆందోళనల వల్లే టీ నోట్ కేబినెట్‌కు రావడంలో జాప్యం జరిగిందన్న ఏపీ ఎన్జీవోల వాదనను పూర్వపక్షం చేస్తూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు కొత్త రాజధాని ఏర్పాటు చేసేంతవరకూ హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, కొత్త రాజధానిని నిర్మించుకునేందుకు అవసరమైన సహకారాన్ని అందజేస్తామని ఆయన వెల్లడించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో విభేదించిన మంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావుతోపాటు.. పర్యాటక మంత్రి చిరంజీవి తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.

సంచలనం రేకెత్తించిన నమస్తే కథనం
టీ నోట్ గురువారం నాటి కేబినెట్‌కు రానుందని నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త సంచలనం సృష్టించింది. పది రోజుల్లో అసెంబ్లీకి తీర్మానం పంపే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయన్న కథనంతో తెలంగాణ వ్యతిరేక శిబిరాలు ఉలిక్కి పడ్డాయి. ఉదయం నుంచే అన్ని చానళ్లు ఇదే అంశంపై దృష్టి కేంద్రీకరించాయి. తొలుత ఇవన్నీ ఊహాగానాలేనని చిత్రం ఇచ్చేందుకు సీమాంధ్ర చానళ్లు ప్రయత్నించాయి. కేబినెట్ భేటీకి తెలంగాణ నోట్ వస్తుందో రాదో తనకు తెలియదని దిగ్విజయ్ చెప్పిన మాటలను, అన్నీ ఊహాగానాలేనంటూ షిండే చేసిన వ్యాఖ్యను పదే పదే ప్రసారం చేస్తూ టీ నోట్ కేబినెట్‌కు వచ్చే అవకాశాల్లేవని అభిప్రాయాలు రుద్దింది. టీ నోట్ ఎలాగూ కేబినెట్ ముందుకు వచ్చేదేనని దిగ్విజయ్ సంకేతం ఇచ్చినా.. చివరి వరకూ అనుమానాలు వ్యక్తం చేసిన చానళ్లు.. చివరికి వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. సాయంత్రం ఐదున్నరకు మొదలైన కేబినెట్ భేటీలో అనుకున్నట్లే టీ నోట్ చర్చకు వచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావడానికి రాజ్యాంగపరమైన ప్రక్రియ మొదలు పెట్టింది.‘తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అనంతరం విలేకరులకు చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజల భద్రత, వారి ప్రాథమిక హక్కులు కాపాడటం జరుగుతుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్తరాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సహాయం సహా వివిధ సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రెండు గంటలు సమావేశం జరిగితే గంటన్నర తెలంగాణ అంశంపై చర్చకే కేటాయించి, షిండే నోట్‌పై మంత్రులందరి అభిప్రయాలను ప్రధాని తెలుసుకున్నారని సమాచారం. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. సమావేశం ప్రారంభం కాగానే హోం మంత్రి షిండే టీ నోట్‌ను సభ్యులందరికీ అందజేశారు. 22 పేజీల నోట్‌లో అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు షిండే వెల్లడించారు. తెలంగాణకు హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉంటుందని, అదే సమయంలో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు. సీమాంధ్రకు నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం ప్యాకేజీని అందిస్తుందని వివరించారు. ఇతర విధి విధానాలను కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీనిని చర్చకు పెట్టడానికి ముందు మాట్లాడిన ప్రధాని.. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చి ఉందని, దానిని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ సమావేశాన్ని నిర్ణయానికి అనుగుణంగా సంసిద్ధం చేశారు.

అనంతరం మంత్రుల అభివూపాయాలను కోరారు. ఈ సందర్భంగా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావు రాష్ట్రాన్ని విభజిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని వాదించారు. హైదరాబాద్ సహా దాదాపు అన్ని వనరులూ విభజన తర్వాత తెలంగాణ ప్రాంతానికే వెళ్లిపోయే కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (సీమాంధ్ర) దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా తయారవుతుందని పేర్కొన్నారు. నీటి కోసం కొత్త రాష్ట్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. వీరి వాదనలను తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి దీటుగా తిప్పికొట్టారు. దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడిన జైపాల్‌రెడ్డి.. సహచర మంత్రుల మద్దతును పూర్తిస్థాయిలో నోట్ ఆమోదానికి వినియోగించుకున్నారు. రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా చూడవద్దని కోరారు. విభజన ద్వారా తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు అద్భుత ప్రగతి ఉంటుందన్నారు. దేశంలోనే త్వరితగతిన అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలు నిలుస్తాయని వివరించారు.

తెలంగాణ చరిత్ర ఇదీ…:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండు ఇప్పటికిప్పుడు పుట్టింది కాదనే విషయాన్ని జైపాల్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణను ఆంధ్రాలోవిలీనం చేయడం షరతులతో కూడుకున్నదన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాలు అన్నీ ఉల్లంఘనకు గురయ్యాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని భావించడం వల్లనే తెలంగాణ ప్రజలు 1969 నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. ఈ మహోద్యమంలో దాదాపు 1500 మంది తెలంగాణ బిడ్డలు బలిదానమయ్యారని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ 400 ఏళ్ల చరిత్ర కలిగిన నగరమని, నిజాం కాలంలోనే ఆ నగరం నాలుగవ స్ధానంలో ఉన్నదని చెప్పారు.

అరవై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మేమేదో అభివృద్ధి చేశామనడం సీమాంధ్ర నేతలకు తగదన్నారు. 2001 నుంచి నేటి వరకు కాంగ్రెస్ వివిధ దశలలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావన, కనీస ఉమ్మడి కార్యక్షికమంలో చేర్పు వంటి అంశాలను జైపాల్‌రెడ్డి ప్రస్తావిస్తూ మాట్లాడారు. అన్ని పార్టీలతో సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం రాజకీయ అవగాహనా రాహిత్యమేనని అభివూపాయపడ్డారు. రాష్ట్రం నుంచి ఎంపికైన జైరాంరమేష్ కూడా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలికారు. విభజనతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోరాదని స్పష్టం చేశారు. నిర్ణయాన్ని త్వరగా అమలుపరచాలని లేనట్లయితే ఆందోళనలు పెంచినవారమవుతామనిప్రధానికి స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని ఎన్సీపీ చీఫ్, కేంద్ర మంత్రి శరద్‌పవార్ వ్యాఖ్యానించారు. 2004లోనే తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పడితే మహారాష్ట్రలో తలెత్తుతుందనుకుంటున్న విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంశాన్ని తాము చూసుకుంటామని ప్రధానికి పవార్ భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా సమర్థించిన ఆరెల్డీ అధినేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ ఈ సందర్భంగా హరితవూపదేశ్ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. తమ ప్రాంతంలో తలెత్తుతున్న చిన్న రాష్ట్రాల డిమాండ్లకు తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ విధానానికి కట్టుబడి ఉంటానని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఏకవాక్యంతో మద్దతు తెలిపారు. మిగిలిన మంత్రులందరూ తమ అంగీకారాన్ని ప్రకటించారు. అందరి అభిప్రాయాలు విన్న ప్రధాని మన్మోహన్.. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం, యూపీఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయని, ఇక ఈ విషయంలో ఇంకా జాప్యం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్న ప్రధాని.. రాష్ట్ర విభజన తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలకు సంబంధించిన అన్ని అంశాలపైనా దృష్టి సారించడం జరుగుతుందని హామీ ఇచ్చారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సీమాంధ్ర ప్రాంతానికి షిండే చెప్పిన విధంగా నూతన రాజధానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా ఉద్యోగాలు, నదీజలాల పంపిణీ తదతర అంశాలలో సీమాంవూధకు కేంద్రం సహాయ సహకారాలందిస్తుందని స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.