ఏళ్లతరబడి ఆగారు. కొన్ని నెలలు ఓపిక పట్టండి- హోం మంత్రి షిండే

shide

తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. అవసరమనుకుంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందో, తర్వాతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణపై తొందరపడవద్దని, త్వరలోనే తేల్చేస్తామని చెప్పారు. ‘ఏన్నో ఏళ్లు ఆగారు. మరికొన్ని నెలలు ఓపికపట్టండి’ అని విజ్ఞప్తి చేశారు. తన శాఖ నెలవారీ నివేదికను వెల్లడించేందుకు శనివారం ఆయన ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అంశంపై పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వివిధ సంస్థలు, వ్యక్తులతో చర్చలు జరిపామని, అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని అన్నారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణపై ఏమైనా మాట్లాడే అవకాశమున్నదా? అనే ప్రశ్నకు.. ‘ఇప్పటికే అందరితో చర్చలు జరిగాయి. పూర్తిస్థాయిలో తెలంగాణపై చర్చించాం. ఇంకా ఏమైనా ఉంటే పార్లమెంటు సమావేశాల అనంతరంగానీ, ముందుగానీ లాంఛనంగా చర్చిస్తాం. ఏమైనా సలహాలు వస్తే పరిశీలిస్తాం’’ అన్నారు. సూరజ్‌కుంద్ మేధోమథనం ముగిసిన అనంతరం సోనియా నివాసమైన 10-జన్‌పథ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణపై చర్చించామని ధ్రువీకరించారు. ఈ విషయంలో మీడియా ప్రశ్నకు తొలుత సమాధానం దాటవేతకు యత్నించిన షిండే..పదే పదే ప్రశ్నించడంతో ‘‘అవును. పార్టీ కార్యదర్శులు, కేంద్ర మంత్రులం ఎప్పటిలాగే 10 జనపథ్‌లో కలిశాం. అనేక అంశాలతోపాటు తెలంగాణపైనా చర్చించాం’’ అని తెలిపారు. తెలంగాణపై అఖిలపక్షం నిర్వహించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హోం శాఖకు లేఖ రాసిన విషయం తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.తెలంగాణకు పరిష్కారం కోసం టీడీపీ నుంచి సలహా వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని అన్నారు. ఈ సంవత్సరాంతానికి తెలంగాణ ప్రకటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు.. ‘తొందరపడకండి.. ఎన్నో ఏళ్లు ఆగారు.. ఇంకొన్నినెలలు ఓపిక పట్టండి’’ అంటూ సమావేశం ముగించారు. అనంతరం తెలుగు మీడియాతో మాట్లాడుతూ ఇక తెలంగాణ అంశాన్ని ‘లైవ్’లో ఉంచదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో అఖిలపక్షం అవసరం లేదనే అభివూపా యాన్ని హోంమంత్రి వ్యక్తం చేయడాన్ని ముఖ్యమైన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 10-జన్‌పథ్ భేటీలో తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకున్నందువల్లనే విలేకరుల ప్రశ్నకు సమాధానమివ్వడానికి షిండే తటపటాయించారని భావిస్తున్నారు. చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలా ఏకాభివూపాయం పాటపాడేవారు. దీనికి భిన్నంగా షిండే వ్యాఖ్య లున్నాయి.అఖిలపక్షం వద్దనుకుంటే పూర్తిగా కాంగ్రెస్ నిర్ణయంమేరకే తెలంగాణకు పరిష్కారం లభిస్తుందని పరిశీలకులు అంటున్నారు.

కదలికలు తెప్పించిన కేసీఆర్ వైఖరి?: తెలంగాణ ఇస్తే తన పార్టీనైనా త్యాగం చేస్తానని కాంగ్రెస్‌తో చర్చలు జరిపిన కేసీఆర్ ఇక కాంగ్రెస్‌తో సమరమేనని ప్రకటించిన సంగతితెలిసిందే. ఇకపై తనలో నరసింహావతారాన్ని చూస్తారంటూ ఉధృత కార్యాచరణకు కేసీఆర్ సిద్ధపడటం కాంగ్రెస్‌ను ఆలోచనలో పడేసిందనిసమాచారం.ఇప్పటికే వివిధ సర్వేలను అధ్యయనం చేసిన అధిష్ఠానం.. 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌కు తిరుగుండదని అర్థం చేసుకున్నదని అంటున్నారు. తమకు అనుకూలంగా ఉంటాడని భావించిన కేసీఆర్ ఎదురుతిరగడంతో అధిష్ఠానం ఆందోళనలో పడినట్లు సమాచారం. కేసీఆర్ అన్నంత పనీ చేస్తారని, తెలంగాణపై నాన్చడం కాంగ్రెస్‌కు శ్రేయస్కరంకాదని సోనియా నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఇన్‌చార్జులు అభివూపాయపడినట్లు తెలిసింది. ‘అనివార్యమైతేతప్ప సోనియా తెగేదాకా లాగరు. పుట్టినరోజు కానుకగా ప్రకటించిన తెలంగాణపై నిర్ణయం తీసుకోవటానికి సరైన సమయం కోసం వేచిచూస్తున్నారు. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించే కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ వంటి ‘కష్టకాలంలో పార్టీని ఆదుకునే’ సీమాంధ్ర వ్యాపార రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో తెలంగాణ అంశాన్ని నాన్చుతూ వచ్చిన సోనియా.. కేసీఆర్ వ్యాఖ్యలతో ఈ సమస్యను తేల్చాల్సిన అనివార్య పరిస్థితిలో పడిపోయారు’’ అని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

పని చేసిన టీఎంపీల హెచ్చరికలు!: ‘పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు అధిష్ఠానం తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోనిపక్షంలో తెలంగాణ కోసం దేనికైనా తాము సిద్ధం’ అని టీ కాంగ్రెస్ ఎంపీలు మాజీ ఎంపీ, సీనియర్ నేత కే కేశవరావు ద్వారా ఇప్పించిన అల్టిమేటాన్ని కూడా కోర్‌కమిటీ సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘2014 ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జగన్ పార్టీ తరఫున ఆయన సోదరి షర్మిల ఇప్పటికే పాదయావూతలు చేస్తున్నారు. మనం కూడా తొందరపడకపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది’ అంటూ రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావువంటి నేతలు పదేపదే సోనియా సహా పార్టీ పెద్దలకు స్పష్టం చేస్తున్న సంగతి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘తెలంగాణతో సహా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిందే. దానిని తేల్చకుండా ముందుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యాసదృశ్యమే’అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం చూస్తే.. ‘తెలంగాణ విషయంలో కొద్ది రోజులు ఓపిక పట్టండి’ అన్న నేటి షిండే మాటలు త్వరలో వాస్తవరూపందాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.