ఏం చేస్తావో చేస్కో

‘ప్రభుత్వం నాది, పవర్ నాది, పర్స్ నాది
చూడూ తెగేసి చెపుతున్నా.. రాస్కో
తెలంగాణకు పైసా ఇవ్వను చూస్కో
ఏం చేస్తావో చేస్కో’
‘మాటల వాణ్ణికాను, పక్కా చేతల వాణ్ణి
చేసింది తక్కువ చెయ్యబొయ్యేది ఎక్కువ
ఇంకేమేమి చేస్తానో చూస్కో
ఏం చేస్తావో చేస్కో’
‘ఖలీల్ జిబ్రాన్ కరక్టే అన్నాడు
మీ పిల్లలు మీ పిల్లలు కానే కారు
మా పిల్లలు ముమ్మాటికీ కారు కారు
ఎంతమంది చస్తే మాకేం,
ఇంకెంత మంది చస్తారో చూస్కో..
ఏం చేస్తావో చేస్కో’
కాకతీయ కారుచిచ్చు
ఉస్మానియా యుద్ధభూమి
క్యాంపస్‌లను క్యాంపులుగా మారుస్తా, చూస్కో..
ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో
ఏం చేస్తావో చేస్కో
ప్రభుత్వం నాది, పవర్ నాది
పల్లెత్తుమాటన్నావో పవర్ కట్‌చేస్తా
నీ పొలాలు ఎండినా నువ్వు పస్తులుండి చచ్చినా
పైసారాలదు చూస్కో
ఏం చేస్తావో చేస్కో
‘ఆవును మళ్ళీ మళ్ళీ అంటున్నా..
ప్రభుత్వం నాది, పవర్ నాది, పైసా నాది
నా రాష్ట్రం నా ఇష్టం
తెలంగాణ తెర్లయితది చూస్కో
ఏం చేస్తావో చేస్కో’
అవును కదా అధినాయకా.. మీరన్నది నిజం!
మన రాజ్యాంగ పవిత్ర ప్రాంగణం సాక్షిగా
మీరన్నది నిజం నిజం!!
కాగ్ పవిత్ర పత్రమేమీ కాదు నిజం,
కాకిలెక్కల చెత్తకాగితమే-నిజం
అవును కదా- అవును కదా… మీరన్నది నిజం నిజం
రాజ్యాంగం ఇలాగే వర్ధిల్లుగాక!
అంబేద్కర్ ఆత్మకు శాంతి కలుగు గాక!!

-లోచన్

This entry was posted in POEMS.

Comments are closed.