ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?

రాష్ట్ర విభజన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో స్థానికతకు ప్రామాణికత ఏమిటనేది చర్చనీయమవుతున్నది. దీనిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల నేపథ్యంలో ఎవరు స్థానికులు? ఎవరు స్థానికేతరులు?.. అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొన్నేళ్లుగా సీమాంధ్రులు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగుల విద్యా ఉద్యోగ అవకాశాలను దోచుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సైతం స్థానిక కోటాలో చొరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో స్థానికతకు ప్రమాణాలు నిర్దేశిస్తూ అప్పటి సీమాంధ్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను సాకుగా చూపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రధానంగా మూడు తీర్మానాలు చేశారు. ఒకటి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేస్తుంది. రెండు.. తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. తెలంగాణ విద్యార్థులు సీమాంధ్రలో చదివితే వారికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఓపెన్ మెరిట్ కోటాలో తెలంగాణలో సీట్లు పొందిన సీమాంధ్ర విద్యార్థులకు సీమాంధ్ర ప్రభుత్వం ఇష్టం. మూడు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంలో కూడా ఇదే విధానం. 

exams

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు (లోకల్ విద్యార్థులకు) మాత్రమే ఫీజు రీయింబర్స్ చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. అయితే.. ఇప్పుడు లోకల్ నిర్ధారణ కీలకంగా మారింది. ఏ ప్రాతిపదికన లోకల్ విద్యార్థులుగా పరిగణిస్తారనేది తెలంగాణ విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటివరకు అనుసరించిన విధానం ప్రకారం.. వత్తి విద్యా కోర్సుల్లో 85శాతం స్థానికులకు, 15శాతం ఓపెన్ మెరిట్ కోటాలో ఇతర ప్రాంతాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇంజినీరింగ్, ఫార్మసీ డిగ్రీ కోర్సులు, బీటెక్, బీ ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సుల్లో ఓపెన్ మెరిట్ కోటా 15శాతంలో అడ్మిషన్లు పొందిన సీమాంధ్ర విద్యార్థులు పీజీకి వచ్చేసరికి లోకల్ కోటాలోకి షిఫ్ట్ అవుతున్నారు. వత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేటప్పుడు క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు ఏడేళ్లు ఎక్కడ చదివారనేది పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఏడేళ్లలో నాలుగేళ్లు ఏ జిల్లా, ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలో లోకల్ విద్యార్థి అవుతారు. ఇంటర్మీడియట్, పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు తరగతుల్లో నాలుగేళ్లు ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ లోకల్ విద్యార్థిగా భావిస్తారు. లేదంటే ఓపెన్ మెరిట్ 15 శాతంలోనే ప్రవేశాలు పొందాలి.

అయితే సీమాంధ్రకు చెందిన విద్యార్థి హైదరాబాద్‌లో 15 శాతం ఓపెన్ మెరిట్‌లోబీటెక్, బీ ఫార్మసీలో ప్రవేశం పొందేవారు ఎంటెక్, ఎం ఫార్మసీకి వచ్చేసరికి లోకల్ విద్యార్థులుగా మారుతున్నారు. హైదరాబాద్ లోకల్ కోటాలో పీజీలో అడ్మిషన్లు పొందుతున్నారు. పీజీ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునేవారు క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులు అవుతారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు బీటెక్, ఇంటర్, పది తరగతుల్లో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అవుతారు. సీమాంధ్ర విద్యార్థులు ఓపెన్ మెరిట్ (15శాతం)లో ప్రవేశం పొంది బీటెక్ నాలుగేళ్లు హైదరాబాద్‌లో చదివిన కారణంగా పీజీలో లోకల్ స్టేటస్‌లో సీట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటివారిని ప్రస్తుతం నిబంధనల ప్రకారం లోకల్ విద్యార్థులుగా పరిగణించాల్సి వస్తుందని, ఇది సరికాదని తెలంగాణ విద్యార్థులంటున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడమేందని ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగాల స్థానికత విధానాన్నే అడ్మిషన్లకు వర్తింపజేయాలి

ఉద్యోగ నియామకాల్లో స్థానికతకు, విద్యావకాశాల్లో స్థానికతకు వ్యత్యాసం ఉంది. ఉద్యోగ అవకాశాల్లో నాలుగు నుంచి పది తరగతి వరకు నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా స్థానికుడిగా గుర్తిస్తారు. వత్తి విద్యా ప్రవేశాలకు క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఈ వ్యత్యాసం కారణంగా విద్యావకాశాల్లో తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారు. ఉద్యోగ నియామకాలకు ఉన్న స్థానిక నిబంధనలనే విద్యావకాశాలకు వర్తింపజేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.