ఎవరి దమ్ము గురించి మాట్లాడుతున్నావ్?-ముఖ్యమంత్రి దమ్ము వ్యాఖ్యలపై టీ నేతల ఫైర్

హైదరాబాద్: దమ్ముంటే బిల్లును యథాతథంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని, అలాచేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, దమ్ముంటే ఆయన రాజీనామా చేసి మాట్లాడాలని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, ఎంపీ మధుయాష్కీ బుధవారం డిమాండ్ చేశారు. టీ నేతల స్పందనలు వారి మాటల్లోనే..
దమ్ము ఎవరికి కావాలి? దురదష్టకరమంటూ పదవిలో ఎందుకు కొనసాగుతున్నావ్? దమ్ముందా అని ఎవరి గురించి మాట్లాడుతున్నావ్? నీకు సీఎం పదవి ఇచ్చిన పార్టీ అధినేత్రిని ఉద్దేశించా? లేక కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అని అడుగుతున్నావా? లేక కేంద్ర కేబినెట్‌నా? రాష్ట్రపతినా? ఈ మాటల వెనుక ఎవరున్నారు? రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నావ్, అలాంటప్పుడు ఆ పదవిలో ఎందుకు? ఈ మాటలతో ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. సీఎం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. బిల్లుపై సీఎం ప్రభుత్వం తరఫున స్పీకర్‌కు నోటీసు ఇవ్వటాన్ని అంగీకరించబోమని ఇప్పటికే స్పష్టంచేశాం. మంత్రివర్గంలో ఒక ప్రాంత మంత్రులంతా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు అది ప్రభుత్వ నోటీసు ఎలా అవుతుంది.
– పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి
సీఎంకు రాజీనామా అవసరం రాదు
సీఎం రాజకీయాలు వదలాల్సిన పరిస్థితి రాకపోవచ్చు. విభజన బిల్లుపై ఎమ్మెల్యేలు ఇప్పటికే 9,024 సవరణలు ప్రతిపాదించారు. ఇన్ని సవరణలు ప్రతిపాదించినప్పుడు యథాతథంగా బిల్లును పార్లమెంట్‌లో ఎలా ప్రవేశపెడతారు? బిల్లు కేంద్రానికి వెళ్ళిన తరువాత పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. కనుక సీఎం రాజకీయాల నుంచి తప్పుకునే అవసరం రాదని విశ్వసిస్తున్నా.
-డీకే అరుణ, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి
సీఎం ఆఫ్ నాలెడ్జితో మాట్లాడుతున్నారు. బిల్లులో మార్పులు, చేర్పుల అధికారం పార్లమెంట్‌కే ఉంటుంది. ఇలాంటి బిల్లుపై ఓటింగ్ అంటూ ఇంకా సీమాంధ్ర ప్రజలను మభ్య పెడుతున్నారు. బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే తెలపాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన లేఖల్లో, రాష్ట్రపతి ఇటీవల పంపిన లేఖల్లో సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బిల్లును తయారు చేసింది న్యాయకోవిదులు. జీవోఎంలో ఉన్న మంత్రులు చిదంబరం, కపిల్ సిబల్, మొయిలీలాంటి వారు ఆరితేరిన న్యాయవాదులు. అలాంటి వారు న్యాయపరమైన ఆంశాలను చూసుకోకుండా బిల్లును అసమగ్రంగా ఎలా పంపిస్తారు? అసలు సీఎంకే అర్థం కావటంలేదేమో!
– మధుయాష్కీగౌడ్, నిజామాబాద్ ఎంపీ

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.