ఎఫ్‌డీఐలకు రెడ్‌కార్పెట్

-12 రంగాల్లో పరిమితుల సడలింపు
-టెలికం రంగంలో 100శాతానికి పెంపు
-26 శాతం దాటే రక్షణ రంగ ఎఫ్‌డీఐలపై సీసీఎస్‌కు
-నిర్ణయాధికారం మల్టీబ్రాండ్ సెక్టార్‌పై నిర్ణయం వాయిదా
యూపీఏ సర్కారు మరోమారు భారీస్థాయి ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) గేట్లను మరింత బార్లా తెరిచింది. ఈసారి మొత్తం 12 రంగాల్లో పరిమితులను సడలించింది. టెలికం రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతినిచ్చింది. రక్షణ, బీమా రంగాల్లోనూ పరిమితులను పెంచింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ ఎఫ్‌డీఐల పరిమతి పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఈసమావేశంలో రక్షణ, ఆర్థిక, వాణిజ్య, పెట్రోలియం,ఆహారం, విద్యుత్, హోం శాఖ మంత్రులు పాల్గొన్నారు.

అందరి ఏకాభివూపాయంతోనే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, మరిన్ని ఎఫ్‌డీఐల రాకతో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, వృద్ధి పుంజుకుంటాయని సమావేశానంతరం విలేకరులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ అన్నారు. ఆయా రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే విషయంలో ప్రతిపాదనలు చేసేందుకు ఇదివరకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 20 సెక్టార్లలో పరిమితులు సడలించాలని కమిటీ ప్రతిపాదించినప్పటికీ పన్నెండు రంగాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకం(మల్టీ రిటైల్), పౌర విమానయానం, ఎయిర్‌పోర్టులు, మీడియా, బ్రౌన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను భారీగా సంస్కరించడం గడిచిన పది నెలల్లో ఇది రెండోసారి. గతేడాది సెప్టెంబర్‌లో మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి 51 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడంతోపాటు విమానరంగంలో 49శాతం, సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చింది.

ఆయా రంగాల వారీగా కేంద్రం నిర్ణయాలు..
టెలికంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో 49 శాతం వరకు ఆటోమెటిక్ పద్ధతిలో పెట్టుబడి పెట్టొచ్చు. రక్షణ రంగంలో ప్రస్తుతమున్న 26 శాతం ఎఫ్‌డీఐల పరిమితిని కేంద్రం యథాతథంగా ఉంచింది. కానీ ‘స్టేట్ ఆఫ్ ద ఆర్ట్’ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ విభాగంలో 26 శాతానికి మించే విదేశీ పెట్టుబడుల విషయంలో జాతీయ భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ(సీసీఎస్) తుది నిర్ణయం తీసుకుంటుంది. దేశీయ ఇన్సూన్స్ రంగంలో ప్రస్తుతమున్న 26 శాతం ఎఫ్‌డీఐ పెట్టుబడి పరిమితిని 49 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ పరిమితి పెంపునకు పార్లమెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్‌వూబాండ్ రంగంలో ఇప్పటికే వందశాతం ఎఫ్‌డీఐలను అనుమతించారు. ఇందులో 49 శాతం వరకు ఆటోమెటిక్ పద్ధతిలో, 49-100 శాతం మధ్యలో పెట్టుబడులను ఎఫ్‌ఐపీబీ ద్వారా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

పెట్రోలియం రిఫైనరీ రంగంలో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇకపై ఆటోమెటిక్ పద్ధతిలోనే పెట్టుబడులు పెట్టొచ్చు. విద్యుత్ ఎక్సేంజీల్లో 49 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఇకపై ముందస్తు అనుమతులు అవసరం లేకుండా ఆటోమెటిక్ రూట్లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆస్తుల పునర్‌నిర్మాణ సంస్థల్లో ప్రస్తుతమున్న 74 శాతం ఎఫ్‌డీఐల పరిమితిని 100 శాతానికి పెంచారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు. దేశీయ డిపాజిటరీలు, స్టాక్ ఎక్సేంజీల్లో 49 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమెటిక్ రూట్లో అనుమతించనున్నారు. కొరియర్ రంగ సంస్థల్లో ఎఫ్‌ఐపీబీ రూట్‌కి బదులుగా ఆటోమెటిక్ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారు.తేయాకు తోటల రంగంలో 49 శాతం వరకు ఎఫ్‌డీఐలను ఆటోమెటిక్ రూట్లో అనుమతించనున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.