ఎప్పుడొస్తవు తెలంగాణా

ఎప్పుడొస్తవు తెలంగాణా
ఎట్లొస్తవె తెలంగాణా
కండ్లు కాయలు కాచి, చూపు మందగించె
కనుచూపు మేరల్లో కనరావాయితివే… ॥ ఎప్పుడొస్తవు॥
కోరమీసం పోరగాండ్లు
దోరవయస్సు కోడెగాండ్లు
నిలువెత్తు మంటలో అగ్నికాహుతై
బంగారు బతుకుల్ని బలిపెట్టినా రాలే ॥ ఎప్పుడొస్తవు॥
రాస్తరోకోలు, రైలు రోకోలు
ప్రతిరోజు పస్తుల దీక్షలు
జంతర్ మంతర్ వద్ద జనమంత గుమిగూడి
ఢిల్లీ గద్దెలదర లొల్లి చేసిన రాలే ॥ ఎప్పుడొస్తవు॥
సింగరేణి సైరనూదె
తట్టి సెమ్మాసు సమ్మెజేసే
ఆదిలాబాద్ నుండి మాణుగూరు దాకా
బొగ్గుబాయిలన్ని భగ్గుమన్న రాలే ॥ ఎప్పుడొస్తవు॥
బతుకమ్మలు, బోనాలతోటి
గంగిరెడ్లు, పీరీల తోటి
ఊరూర ఊరేగింపులు తీసి
పొలిమేర సుట్టంత పోరు సల్పిన రాలే ॥ ఎప్పుడొస్తవు॥
అధికారులు మెదలుకొని
అటెండరు ఉద్యోగి దాకా
టీచర్లు, లాయర్లు, మేధావి, డాక్టర్లు
సబ్బండ వర్ణాలు సమ్మె జేసిన రాలే ॥ ఎప్పుడొస్తవు॥
ఇంటికొక్క మనిషి లెక్కన
చేతికొక్క జెండ చొప్పున
లాక్షలాది మంది సాగరు తీరాన
హారాల పేరుతో జంగు చేసిన రాలే ॥ ఎప్పుడొస్తవు॥
అందుకే, భగత్‌సింగోలే బాంబేయమంటవ
కొమరం భీమోలే కొట్లాడమంటవ
తూటాల ఆటలు, బాంబుల బాటలో
రక్తపు ప్రవహిస్తే వస్తవ
గప్పుడొస్తవ తెలంగాణ, గట్లొస్తవ తెలంగాణా

॥ ఎప్పుడొస్తవు॥
– చాగంటి కిషన్

This entry was posted in POEMS.

Comments are closed.