ఎన్నికల ముందు పేదలు గుర్తుకొచ్చారా?: ములాయం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుపై ఎస్పీ మండిపడింది. ఇవాళ లోకసభలో ఈబిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మాట్లాడారు. ‘దేశంలో ఉన్న పేదలు యూపీఏ ప్రభుత్వానికి ఇవాళ గుర్తుకొచ్చారా? వాళ్లు ఆకలితో చనిపోతున్నారనే విషయం ఇప్పుడు అర్థమయిందా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును ఆరు నెలల క్రితమే తీసుకురావాల్సిందని అభిప్రాయపడ్డారు. అప్పుడయితే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిందని అనుకునే వాళ్లమన్నారు. పేదలు ఎంత మంది ఉన్నారో లెక్కించకుండా పథకం ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. లబ్దిదారులను ఎలా గుర్తిస్తారని నిలదీశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదల సంఖ్యపై సరియైన గణాంకాలే లేవని అన్నారు.

రాష్ట్రాలు ఎలా భరిస్తాయి: ములాయం
ఆహార భద్రత అమలు వలన రాష్ట్రాలపై పడే ఆర్థిక భారంపై ములాయం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక భారాన్ని ఎవరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి చర్చించాల్సిందని అన్నారు. ఈ పథకంలో గ్యారెంటీ ఎక్కడ అని నిలదీశారు. కొంత మంది ఆహార సేకరణ కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారని, అలాంటి వారి కోసం ఆహారాన్ని ఉచితంగా సరఫరా చేయాలని ఆయన కోరారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.