ఎన్నికల్లో ఒంటరిపోరే -కాంగ్రెస్ నేతలారా కాస్కోండి

కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు వేల మంది అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

kcrnopothuluటీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళతారా? కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తారా? ఇక చూద్దాం.. అని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు కేసీఆర్ సవాల్ విసిరారు. తాను ఎవరికీ ద్రోహం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ప్రస్తావన వచ్చిన సందర్భాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు అత్మబలిదానాలు చేసుకుంటుంటే.. మీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైతే తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్నా. తెలంగాణ ఇస్తాం.. ఢిల్లీకి రండి.. అని వాయలార్ రవి పిలిచారు. మేం ఢిల్లీ వెళ్లాం. చర్చలు జరిపారు. నెల తర్వాత కూడా ఏమీ చెప్పలేదు. ఛీ అని వచ్చేశాం. ఇక ఢిల్లీ వచ్చేదిలేదని కూడా చెప్పాం. కరీంనగర్ మేధోమథనంలో ఒక నిర్ణయం చేశాం. మనమే 15 పార్లమెంట్, 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందాం. తెలంగాణ తెచ్చుకుందామని నిర్ణయించాం. చివరకు కాంగ్రెస్‌పార్టీ 1400 మందిని పొట్టనపెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చింది.

ఇప్పుడేమో తెలంగాణ అమరుల కుటుంబాలకు సీట్లిస్తామంటున్నారు. బతికున్నప్పుడు పాలు పోయలేనోడు.. సచ్చిన తర్వాత సమాధి మీద బర్రెను కట్టేశాడట.. ఇదీ కాంగ్రెస్ తీరు అని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో విలీనం చేయకపోవడానికి కారణాలను వివరించిన కేసీఆర్.. ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ రాగానే మీ కర్తవ్యం నెరవేరలేదు. పార్టీని విలీనం చేయవద్దు.. అని జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. అందుకే విలీనం చేయలేదు అని చెప్పారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలపై వివక్షకు వ్యతిరేకంగా ఏర్పడిందని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం ఉద్యోగులను జనాభా ప్రాతిపదిక పంచుతామంటున్నది. సచివాలయంలో తెలంగాణవాళ్లు 10 శాతం కూడా లేరు. ఆంధ్రోళ్లే 90 శాతం ఉన్నారు.

జనాభా ప్రాతిపదికన పంచితే తెలంగాణ సచివాలయంలో ఆంధ్రోళ్లే 80 శాతం ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వాళ్ల ఆధిపత్యమేనా? ఇది ఎట్లా అతుకుద్ది? అని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతికాదని జైరాంరమేశ్‌కు, దిగ్విజయ్‌సింగ్‌కు చెప్పినా వారు వినలేదని అన్నారు. పైగా పెన్షనర్లను కూడా ఇలానే పంచుతామంటున్నారని ఆయన అభ్యంతరం తెలిపారు. దేశంలో ఇతర కొత్త రాష్ర్టాలు ఏర్పడటం వేరు, తెలంగాణ ఏర్పడటం వేరు అని చెప్పినా పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు. ముల్కీ రూల్స్‌కు విరుద్ధంగా 24 వేల మంది ఆంధ్రావారు తెలంగాణలో పనిచేస్తున్నారని అప్పటి సీంఎ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలో 200మంది తెలంగాణ ఇంజినీర్లు రాయలసీమలో పనిచేస్తే ఆ ప్రాంతం వారు బెదిరించారు. కేవలం 200 మంది తెలంగాణ వారు ఆంధ్రలో పనిచేస్తేనే బెదిరిస్తున్నారు.. మరి తెలంగాణలో పనిచేసే అంధ్రా వారి పరిస్థితి ఏంటని ఎన్టీఆర్ హయాంలో టీఎన్జీవోలు ఆందోళన చేశారు. దీంతో ఎన్టీఆర్ ఒక కమిటీ వేశా రు.

తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా వారు 58,956 మంది పనిచేస్తున్నారని తేల్చారు. 610 జీవో ఇచ్చారు. బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్ ఇద్దరూ ఆంధ్రా వారే. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ఉద్యోగులు అక్రమంగా ఉన్నారని వారే నిర్ధారించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మేనల్లుళ్లను పొట్టుకున్నట్లు సాదాలనట. తెలంగాణ కేబినెట్‌పైకూడా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయట? ఇదెక్కడి న్యాయం? అని కేసీఆర్ ప్రశ్నించారు. స్పెషల్ కేటగిరీ తెలంగాణకూ ఇవ్వమన్నాం. జాతీయ ప్రాజెక్టు అడిగాం. అదీ ఇవ్వలేదు. సీమాంధ్రలో ఏడు తెలంగాణ మండలాలు కలుపుతున్నారు. కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం రాలేదు అని కేసీఆర్ విమర్శించారు. పదేండ్లు నాన్చారు. పదవులను అనుభవించారు. 1500మందిని పొట్టనబెట్టుకున్నారు. తెలంగాణ విద్యార్థులను జైళ్లపాలు చేసింది మీరు.

నేను ద్రోహం చేశారని ఎలా అంటారు? అని నిలదీశారు. వైఎస్ ఉండగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. పార్టీని చీల్చేందుకు కుట్రలు చేశారు. అయినా ధైర్యంగా నిలబడ్డాం. కేసీఆర్ స్థానంలో వేరొకరు ఉంటే ఊది పారేసేటోళ్లు. తెలంగాణ లేదు.. ఏమీ లేదు.. పొమ్మనేటోళ్లు అని చెప్పారు. పొత్తు పెట్టుకుంటామంటూనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్.. దిగ్విజయ్‌సింగ్‌పై విమర్శలు గుప్పించారు. ఇదేనా కలసి పనిచేద్దామని అనుకునేటోళ్ల పద్ధతి? ఇచ్చి పుచ్చుకునే పద్ధతే లేదా మీకు? అని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల విజయమే టీఆర్‌ఎస్ విజయమని చెప్పారు. నేను తెలంగాణ తెస్తానన్నా. ఉద్యమం వదిలి వెళ్లిపోతే రాళ్లతో కొట్టి సంపుమన్నా. తెలంగాణ తెచ్చా. ఇప్పుడు ప్రజలు గెలవాలి అన్నారు. గాడిదలకు గడ్డేస్తే ఆవులకు పాలు రావని చెప్పారు. ఎన్నికలు రాగానే చాలా మంది వస్తారు. ఆగమాగం కావద్దు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఎక్కువ గెలుచుకుని ఢిల్లీ మెడలు వంచుదాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.

పొన్నాలా.. నీ కళ్లు నెత్తికి ఎక్కాయా?
తెలంగాణ పీసీపీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. పొన్నాలా.. ఆంధ్రా దొంగ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది నువ్వుకాదా? భారీ నీటిపారుదల మంత్రిగా ఉండి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించింది ఎవరు? తెలంగాణ ప్రాజెక్టులకు ఒక సుక్క నీరన్న ఇచ్చినవా? నీ కండ్లు నెత్తికి ఎక్కినయా? నీకు తెలువదా? తెలంగాణకు ద్రోహం చేసింది నువ్వు కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ విద్యార్థులపై కేసులు పెట్టింది ఎవరు? ఒక్కో విద్యార్థిపై వందల కేసులు పెట్టారు. దానికి మీరే కారకులు. అయినా ఊరుకున్నాం. పదేండ్లు పదవుల్లో ఉండి వదలలేకపోయారు.

అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని హరీశ్‌ను అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. త్వరలోనే టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమ క్లిష్ట సమయాల్లో ప్రజలు గులాబీవైపే ఉన్నారని ప్రశంసించారు. మంచిర్యాలలో 70శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టుపై 5 టీఎంసీలతో రెండు చిన్న ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వివేక్, టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు బొంతు రాంమోహన్, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.