ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దు : కేసీఆర్

రంగారెడ్డి : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన తెలంగాణ ప్రజలు ఆగమాగం కావొద్దని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. చేవేళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆంధ్రా పార్టీలన్నింటిని బొంద పెట్టి టీఆర్‌ఎస్‌ను గెలిపించుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా జీవులన్ని ఒక్కటై ఆగమాగం చేయడానికి పన్నాగం పన్నుతాయని, వారి మాటలకు మనం మోసపోవద్దని సూచించారు.

ఇవాళ జీవితంలో మరుపు రాని రోజు అని కేసీఆర్ అన్నారు. కేవీ రంగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం, రంగారెడ్డి లాంటి మహానీయుడి విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. మనకు సంబంధం లేని విగ్రహాలు హైదరాబాద్ నిండా ఉన్నాయ్ అని కోపోద్రిక్తులయ్యారు. రంగారెడ్డి పాదాలతో పునీతమైన గడ్డ రంగారెడ్డి జిల్లా అని కొనియాడారు. పిడికిలి బిగించి కొట్లాడాలి అని పిలుపునిచ్చిన గొప్ప నాయకుడు కేవీ అని గుర్తు చేశారు. కేవీ మనుమడిగా విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంట్‌లో తెలంగాణవాదాన్ని వినిపించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి భూములన్ని బంగారు గనులు అవుతాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు కోట్లున్న ఎకరం భూమి ధర రూ. 20 కోట్లు అవుతుందని తెలిపారు. తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు తక్కువ అవుతాయని ఆంధ్రా బ్రోకర్లు అపోహా సృష్టించారని తెలిపారు. ఆంధ్రాతో కలిస్తే తమకు నీళ్లు రావు అని ఆనాడే కేవీ నెహ్రుకు చెప్పారని గుర్తు చేశారు.

ప్రాణహిత – చేవేళ్ల నీళ్లు మన మునిమనుమలు వచ్చినా చేవేళ్లకు రావు అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసమే అని పేర్కొన్నారు. ప్రాజెక్టు పేరుతో రంగారెడ్డి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కృష్ణా నది నీళ్లు రంగారెడ్డి జిల్లా పాదాల దగ్గరికి తీసుకోస్తానని హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతదని ఆనాడే కేవీ చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతదని తెలిపారు. తెలంగాణ వచ్చినంక అసెంబ్లీ ఎదుట కేవీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రకటన వచ్చిన మరుక్షణమే ఆంధ్రా జీవులన్నీ ఒక్కటి అయ్యాయని చెప్పాయి. ఇంకా ఆంధ్రా పార్టీల పెత్తనం అవసరమా అని ప్రశ్నించారు. 57 ఏండ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి పదవి అనుభవించింది మూడున్నర సంవత్సరాలే అని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.