ఎంపీ రాపోలు కారుపై దాడి

-స్వల్పంగా ధ్వంసం.. సమైక్యవాదుల పనిగా అనుమానం రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైంది. పోలీసులు, కారు డ్రైవర్ ఖలీల్ తెలిపిన వివరాల ప్రకారం.. అడిక్‌మెట్‌లోని రాంనగర్ గుండు ప్రాంతంలో నివాసముంటున్న ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌కు చెందిన ఏపీ 13ఏసీ 4455 ఇన్నోవా కారును రోజు మాదిరిగానే ఇంటి ముందు పార్కు చేశారు. కారు అద్దం కుడివైపు కవర్, డోర్‌పై భాగంలో స్వల్పంగా ధ్వంసమై ఉండటాన్ని ఉదయం గమనించిన డ్రైవర్ ఖలీల్ మంగళవారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఎంపీ ఆనందభాస్కర్‌పై ద్వేషంతో కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రపూరితంగానే ఈ పనికి ప్రేరేపించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎంపీ ఆనందభాస్కర్ ‘టీ మీడియా’తో మాట్లాడుతూ భవనం రెండో అంతస్తులో నివాసముంటున్న తాము అర్ధరాత్రి ఇంటి ముందు వాహనాన్ని పార్కు చేశామని, తెల్లారి చూసేసరికి స్వల్పంగా ధ్వంసమైందని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.