ఉస్మానియా రణన్నినాదం

తెలంగాణపై ఏమరుపాటు పడవద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. గతంలో ఏమరుపాటు కారణంగానే వచ్చిన తెలంగాణ వెనుకకు పోయిందన్నారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ విద్యార్థి యుద్ధభేరిలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 25న ఓయూలోనే తెలంగాణకు మద్దతుగా నిలిచిన విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అదే నెల 27న తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఎల్బీ స్టేడియంలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

వచ్చే నెల 6న కచ్చితంగా గుంటూరులో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సభ జరగనీయకుండా కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. దసరాను కూడా పండుగగా కాకుండా ఉద్యమంగా జరపాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను యూటీ అంటే ఒప్పుకోమని, హైదరాబాద్‌లేని తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. జూలై 30 చేసిన ప్రకటనను యధాతథంగా అమలు చేయాలన్నారు. ఏపీఎన్జీవో సభలో పుచ్చలపల్లి మిత్ర చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ హైదరాబాద్‌లో 30 లక్షల మంది సీమాంవూధులున్నారని మిత్రా ప్రకటిస్తే ఆనాటి సభకు వచ్చింది 40 వేల మంది మాత్రమేనని గుర్తించాలన్నారు.

సీమాంధ్ర మీడియాపై మందకృష్ణ ఫైర్:

సీమాంధ్ర మీడియా పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నదని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీస్టేడియంలో సమైక్య సభకు 12 గంటల లైవ్ ఇచ్చిన సీమాంధ్ర ఛానళ్లు, యుద్ధభేరి సభపై వివక్ష చూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులతో నడిచే ఛానళ్లు వివక్ష మానుకోకపోతే నష్టపోయ్యేది మీరేనని గమనించాలని హెచ్చరించారు. రాబోయేది హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రమని, ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటూ పోతే మా పాలన వచ్చాక వివక్షను తిప్పికొ కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రామోజీరావు నుంచి రాధాకృష్ణ వరకు ఇది వర్తిస్తుందని, భవిష్యత్తు రోజుల్లో జరిగే పరిణామాలను చవిచూడవద్దని తెలిపారు.

యూటీ అంటే యుద్ధమే యుద్ధభేరిలో విద్యార్థులు
మాణికేశ్వరీనగర్: ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరి బహిరంగ సభలో పాల్గొన్న పలువురు విద్యార్థి సంఘ నాయకులు హైదరాబాద్‌ను యూటీ చేస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణవాదులంతా మరోసారి ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గుంటూరులో అక్టోబర్ 6న నిర్వహించే అంబేద్కర్‌వాదుల మహాసభను సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటే తిప్పికొడతామని విద్యార్థి నేతలు ముక్తకం హెచ్చరించారు.

ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కార్యక్షికమంలో ఎంఎస్‌ఎఫ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయగౌడ్, బీఎస్‌ఎఫ్ అధ్యక్షుడు బండారి వీరబాబు, టీఎస్‌జేఏసీ కన్వీనర్ కరా విద్యార్థి సంఘాల నేతలు దరువు ఎల్లన్న, బండారు వీరబాబు, వేల్పుల సంజయ్, వట్టికూటి రామారావుగౌడ్, జన్ను భిక్షపతి, శిగ నరేష్‌గౌడ్, పీడీఎస్‌యూ నాయకుడు కోట రాజేష్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు స్టాలిన్, గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు నెహ్రూనాయక్, టీజీవీపీ రాష్ట్ర నాయకుడు శంకర్ నాయక్‌తోపాటు ఎంఎస్‌ఓ, జీవీఎస్, టీవీయూవీ, పీడీఎస్‌యూ, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఉద్యమగీతాలు
యుద్ధభేరి సందర్భంగా ఎమ్మార్పీఎస్ కళామండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు అశోక్, సంతోష్ బృందం ఆలపించిన ఉద్యమగీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. ‘చెప్పులు కుట్టిన చేతితో చరిత్ర మారుస్తాం’ అంటూ కళాకారుడు అశోక్ పాడిన పాటకు సభికులు హర్షద్వానాలు చేశారు. సభలో రసమయి బాలకిషన్, టీఎన్‌ఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, టీవీఎస్, టీజీవీపీ సహా అన్ని విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.