ఉస్మానియా చూడరా ఉద్యమాల ఊటరా

ఉస్మానియా చూడరా ఉద్యమాల ఊటరా
పల్లె తెలంగాణమంత పోరువీరుల బాటరా

శాస్త్రాలు జ్ఞానమంత శ్రమజీవుల సృష్ఠేనని
చరిత తిరగరాయాలని బతుకు పోరుసాగాలని
కష్టజీవి కన్నీళ్లకు కారణాలు తెలియజెప్పి
పెద్ద చదువులసారం జనులమేలు కోరాలని

యువతకు ఉత్తేజమిచ్చె నెత్తురు ఉస్మానియా
ప్రగతిశీల భావాల విత్తుర ఉస్మానియా //ఉస్మానియా //

మట్టిమనిషుల వెట్టి చాకిరికి వెలగట్టి
చెమటచుక్కల ఊటచెలిమెల్ని చూపించి
పోగుబడినసంపదల మూలాలు వెలికితీసి
పల్లెపేగుబంధాల పరిమళాలు వెదజల్లె

ఆధిపత్యధొరణిపై ధిక్కారం ఉస్మానియా
ఆత్మగౌరవపోరుకు ఆలంబన ఉస్మానియా //ఉస్మానియా //

మోసపుఒప్పందాల గుట్టునంత విప్పిజెప్పి
ఓట్లరాజకీయాల నాటకాలనెండగట్టి
సీమాంధ్ర పెట్టుబడుల కుట్రలపై దండెత్తి
ఢిల్లీ సర్కారుపైన విల్లంబులనెక్కుపెట్టి

మారాష్ట్రం కావాలని సైరనూదె ఉస్మానియా
గల్లినుండి ఢిల్లిదాక కవాతురా ఉస్మానియా //ఉస్మానియా //

భ్రాహ్మణీయ భావజాల బంధనాలు తెంచివేయు
ఫూలె అంబేద్కరుల పోరాట స్పూర్తినిచ్చు
ఉరితాటిపై భగత్ ఊపిరులను వినిపించి
నేలకొరిగిన వీరుల అడుగులను అందించు

చీకట్లనుచీల్చుకొచ్చె వెలుగురా ఉస్మానియా
మూలవాసిబహుజనుల దండోరర ఉస్మానియా //ఉస్మానియా //

ఉస్మానియా చూడరా ఉద్యమాల ఊటరా
పల్లె తెలంగాణమంత పోరువీరుల బాటరా
పోరువీరుల బాటరా వెలుగురవ్వల కాంతిరా
వెలుగురవ్వల కాంతిరా విశ్వవ్యాప్తమయ్యెరా

-గాజుల శ్రీధర్

This entry was posted in POEMS.

Comments are closed.