ఉరిమిన ఉస్మానియా

– పోలీసులు – విద్యార్థుల బాహాబాహీ

– టియర్‌గ్యాస్, లాఠీఛార్జీ, రాళ్లదాడులు
– బలవూపయోగం చేసిన పోలీసులు, రాళ్లురువ్విన విద్యార్థులు
-ఓయూ చుట్టూ ఉన్న దారుల్లో ఖాకీల కాపలా
– కొనసాగుతున్న ఉద్రిక్తత
ఉస్మానియా యూనివర్సిటీ వరుసగా రెండోరోజూ రణరంగమైంది. శుక్రవారం నాటి చలో అసెంబ్లీకి రిహార్సలా? అన్నరీతిలో పోలీసులు, విద్యార్థులు హోరాహోరీ తలపడ్డారు. లాఠీఛార్జీలు, భాష్పవాయు ప్రయోగాలు, విద్యార్థుల రాళ్ల దాడులతో ఉద్రిక్తత రోజంతా రాజ్యం చేసి ఇంకా కొనసాగుతోంది. బుధవారంనాటి ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు క్యాంపస్ పరిసరాల్లో గురువారం భద్రత మరింత పెంచారు.

ఎన్‌సీసీ గేటు వద్ద మూడంచెల బారికేడ్లతో భద్రత కట్టుదిట్టం చేశారు.క్యాంపస్ గేట్లను మూసివేశారు. ఏర్పాట్లను ఏసీపీ రంజన్త్రన్ కుమార్, సీఐ అశోక్‌లు పర్యవేక్షించారు. ఉదయం 11 గంటలకు విద్యార్థులు టీఎస్‌జేఏసీ నాయకుడు పిడమర్తి రవి, తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు భట్టు శ్రీహరినాయక్, టీఎస్‌జేఏసీ (స్వతంత్ర) నాయకుడు చారుకొండ వెంక ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయల్దేరారు. వారిని పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డగించారు. విద్యార్థులు తాము శాంతియుతంగా కార్యక్షికమాన్ని నిర్వహించుకుంటామని విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట మొదలైంది.

విద్యార్థుల బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఆ దశలో కొంత తగ్గిన విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. కొద్దిసేపు హోరాహోరి అనంతరం విద్యార్థులు తిరిగి గేటు వైపు దూసుకొస్తుండడంతో పోలీసులు అనేక రౌండ్లు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీనితో విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. కొందరు బాష్పవాయువు పీల్చడంతో అస్వస్థతకు లోనయ్యారు. ఆగ్రహించిన విద్యార్థులు అక్కడే బైఠాయించి ‘పోలీస్ గోబ్యాక్’ ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాతా విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు కొనసాగాయి. సుమారు రెండు గంటల సమయంలో మళ్లీ విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుతుండడంతో పోలీసులు చెదరగొ ప్రయత్నించారు.

కొద్దిపాటి ఉద్రిక్తత అనంతరం తాము శాంతియుతంగా సామూహిక భోజనాలు చేస్తామని విద్యార్థులు ప్రకటించి రోడ్డుపై వృత్తాకారంలో బైఠాయించి భోజనాలు చేశారు. ఆ తరువాతా పెద్దసంఖ్యలో విద్యార్థులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే వచ్చింది. మొత్తమ్మీద రోజంతా పోలీసులు 12 రౌండ్ల బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. తోపులాట సమయంలో పోలీసులు అయిదుగురు విద్యార్థులను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో ఓయూజేఏసీ నాయకుడు కందుల మధు, రైల్వే డిగ్రీ కళాశాల విద్యార్థి ఎండీ మోబిన్, పాత్రికేయుడు ఎన్.రమేష్, ఓయూ మెస్‌లో వెయిటర్లు వి.దినేష్, డిపకాష్‌లు ఉన్నారు. తాను రిపోర్టర్‌నని చెబుతున్నా రమేష్ ఐడీకార్డును లాక్కొని వాహనంలోకి ఎక్కించారు. పోలీసుల వైఖరిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.