ఉమ్మడి విద్య.. ఏడాదే

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విభజన జరిగిన ఏడాదిలోగా రెండు రాష్ర్టాల్లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 ప్రకారం రాష్ట్రంలో 107 రాష్ట్ర స్థాయి విద్యా, ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయి. రాష్ర్టాల ఆవిర్భావం నుంచి ఏడాదివరకు రెండు రాష్ర్టాలకు ఈ సంస్థలు సేవలు అందించాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర విభజన జరిగినా మూడేళ్లపాటు ఉన్నత విద్యా మండలిని విడగొట్టే అవకాశం లేదని, ఆ శాఖ అధికారులు భావించారు.

రూసా పథకం ద్వారా రెండు రాష్ర్టాలకు నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మూడేళ్లపాటు రెండు రాష్ర్టాలకు ఒకే ఉన్నత విద్యామండలి ఉంటుందని అధికారులు భరోసాగా ఉన్నారు. కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆయా శాఖలకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏడాదిలోగా రెండు రాష్ర్టాల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఉన్నత విద్యా మండలి చీలిక ఖాయం అయింది. బిల్లులో పేర్కొన్న ప్రకారం రెండు రాష్ర్టాల్లోని రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదేళ్లపాటు ప్రస్తుత విద్యా విధానం ప్రకారం సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, పదేళ్లపాటు ప్రస్తుత అడ్మిషన్ విధానం అమలైనా.. తెలంగాణలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు నిర్వహించేందుకు ఇక్కడి ప్రభుత్వం నిర్వహించే ప్రవేశపరీక్షకు సీమాంధ్ర విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఉమ్మడి ప్రవేశాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తేనే ఒకే సెట్ నిర్వహించవచ్చు.. కానీ ఇందుకు రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొత్త విధానం రూపొందించి సెట్స్ నిర్వహించే అవకాశం ఉంది. సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ వత్తి విద్యా కాలేజీల్లో ప్రవేశాలు పొందాలంటే తెలంగాణ ఉన్నత విద్యా మండలినిర్వహించే సెట్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. ఇందులో ఏమైనా క్లిష్టపరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం చూపించనుంది. కాగా, ఏడాదిలోగా ఉన్నత విద్యా మండలి విభజన నేపథ్యంలో.. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపరీక్షలు నిర్వహించాలనే అంశాలను స్పష్టంగా పేర్కొంటూ నిబంధనలు రూపొందించాలని ప్రధాన కార్యదర్శి మహంతి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.