ఉమ్మడి రాష్ట్రంలోనే పార్లమెంటు ఎన్నికలు- కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: వచ్చే పార్లమెంటు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే జరుగుతాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. అయితే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బిజినెస్ స్టాండర్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎందుకంటే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ర్టాల ఏర్పాటు అనుభవం ఉదాహరణగా తీసుకుంటే, రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడానికి రెండునుంచి మూడు నెలల కాలం పట్టే అవకాశముంది.

కానీ షెడ్యూలు ప్రకారం చూస్తే పార్లమెంటు ఎన్నికలు అంతకన్నా ముందే వస్తున్నాయి. అందువల్ల ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరగవచ్చు. ఏదేమైనా ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి కూడా ముగిసిపోతున్నందున ఆ ఎన్నికలు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే జరుగుతాయా? అన్న ప్రశ్నకు.. ఇదీ అంతే.. అయితే ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ మాత్రమే నిర్ణయించాలన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న ప్రశ్నపై షిండే భిన్నంగా స్పందించారు. ఈ విషయంలో ఇంత వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే సమస్య ఉండదన్నారు.

కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. నూతన రాష్ర్టాలకు సంబంధించి మూడు, నాలుగు నెలల మధ్యంతర ఆర్థిక సహాయంపై ప్రస్తుతం అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్షం కూడా మధ్యంతరంగా ప్రత్యేక ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేసిందని, ఈ విషయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉందని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.