ఉమ్మడి రాజధాని హైదరాబాద్.. తెలంగాణలో భాగమే

-పదేళ్ల తర్వాత ఎలాగూ అందులోకే..
-నొక్కి చెప్పిన దిగ్విజయ్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇంటర్వ్యూలో పదే పదే స్పష్టీకరణ
-ఢిల్లీ తరహాలో శాంతి భద్రతలు కేంద్రానికే..

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తెలంగాణలో భాగంగానే ఉంటుందని, పదేళ్ల తర్వాత ఎలాగూ తెలంగాణకే చెందుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానెల్‌లో నిర్వహించే ‘డెవిల్స్ అడ్వకేట్’ కార్యక్షికమంలో ఆయన కరణ్‌థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పునరుర్ఘాటించారు.
delhi హైదరాబాద్ అంశం ఇబ్బందికరంగా మారనుందని, ఇదివరలో చండీగఢ్ మాదిరిగానే కొనసాగే అవకాశం లేదా అన్న ప్రశ్నలకు ఆయన హైదరాబాద్ తెలంగాణ అంతర్భాగంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా కరణ్‌థాపర్ అడిగిన ప్రశ్నలు..

అందుకు దిగ్విజయ్‌సింగ్ ఇచ్చిన సమాధానాలు..:
కరణ్‌థాపర్: హైదరాబాద్ భవిష్యత్తు క్లిష్టమైన అంశం. ఉమ్మడి రాజధానిగా కొనసాగిన పదేళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణకే చెందుతుందని, చండీగఢ్ మాదిరి అనుభవం ఎదురుకాదని మీరు ఏ హామీ ఇవ్వగలరు? (పంజాబ్‌కే చెందుతుందని హామీ ఇచ్చిన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయింది. హర్యానా, పంజాబ్‌ల మధ్య శాశ్వతంగా విడిపోయింది.)
దిగ్విజయ్‌సింగ్: ఉమ్మడి రాజధానిగా వ్యవహరించే పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ను తెలంగాణలో భాగంగానే పరిగణిస్తాం. మీరు తీర్మానం చూస్తే.. తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ చెందుతుందని అది విస్పష్టంగా హామీ ఇచ్చింది.

1960లలో చండీగఢ్‌ను కూడా పంజాబ్‌కు హామీ ఇచ్చారు?..
దిగ్విజయ్: ఒక్క క్షణం.. తీర్మానంలో మరో మాటనూ చేర్చాం.. కొత్త సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పాం.

మిమ్మల్ని పరీక్షించేటువంటి ప్రశ్న అడుగనీయండి. ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ను తెలంగాణ ప్రాంతంలో భాగంగా పరిగణిస్తారా? లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా భావిస్తారా?
దిగ్విజయ్: అది తెలంగాణలో భాగంగా ఉంటుంది.

అంటే అది ఉమ్మడి రాజధాని అయినప్పటికీ తెలంగాణలో భాగమేనా?
దిగ్విజయ్: అవును.
ఇలాఉండగా, పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిని ఢిల్లీ మాదిరిగా కేంద్రం నియంత్రించవచ్చని దిగ్విజయ్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ ‘డెవిల్స్ అడ్వకేట్’ కార్యక్రమంలో పేర్కొన్నట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) వార్తాసంస్థ తెలిపింది. ‘శాంతిభద్రతలను నేరుగా హోంమంత్రిత్వశాఖ పర్యవేక్షించే ఢిల్లీ తరహా ఏర్పాట్ల గురించి మేము పరిశీలిస్తున్నాం. అక్కడ పోలీసు కమిషనర్ నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు.. అలాంటి తరహా ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం’ అని దిగ్విజయ్‌సింగ్ తెలిపినట్లు వివరించింది. పదేళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణలో భాగమే అవుతుందని కాంగ్రెస్ తీర్మానంలో చెప్పామని దిగ్విజయ్ గుర్తుచేశారు. ఆంధ్రకు కొత్త రాజధాని కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తర్వాత కొత్త రాష్ట్రాలకోసం డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కొత్తగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌కు కాంగ్రెస్ అనుకూలంగా ఉందా? అన్న ప్రశ్నకు- ఇందుకు సంబంధించి కాంగ్రెస్ 2002లో ఒక తీర్మానాన్ని ఆమోదించిందని, దానిని ఉపసంహరించుకోలేదని బదులిచ్చారు. ‘2002 నుంచి ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

ప్రభుత్వం దానిని అంగీకరిస్తుందో లేదో తెలియదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ కోసం కాంగ్రెస్ పార్టీ 2002లో తీర్మానాన్ని ఆమోదించింది. దానిని ఉపసంహరించుకోలేదు’ అని దిగ్విజయ్ చెప్పారు. విస్తృతస్థాయిలో ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ లాభం కోసమే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు. ‘ఇది పూర్తిగా తప్పు. ఈ నిర్ణయం ఎలాంటి రాజకీయ తొందరపాటుతో తీసుకున్నది కాదు. తెలంగాణ గురించి ఇటీవలనే మాట్లాడుకోవడం లేదు.. 1950ల నుంచి మాట్లాడుకుంటున్నాం’ అని దిగ్విజయ్ అన్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుపై రాజకీయ పార్టీలకు చెందిన అన్ని వర్గాలతో, రాష్ట్ర నాయకులతో సాధ్యమైనంత విస్తృతస్థాయిలో సంప్రదింపులు కొనసాగాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండుసార్లు తీర్మానాలను ఆమోదించిందని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.