ఉధృతంగాఉద్యమిద్దాం-రాయల తెలంగాణను అడ్డుకుందాం- కేసీఆర్

రాయల తెలంగాణపై కేంద్రం మూర్ఖంగా ముందుకు వెళ్తే ఉధృతస్థాయిలో ఉద్యమించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు అత్యవసర పొలిట్‌బ్యూరో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది.రాయల తెలంగాణను అడ్డుకునే సంపూర్ణ ఉద్యమ కార్యాచరణ రూపొందించే వరకు ఇప్పటికే ప్రకటించిన కార్యక్రమాలు పూర్తిగా విజయవంతం చేసేలా పార్టీ క్యాడర్‌కు స్పష్టమైన ఆదేశాలు పంపింది. మంగళవారం కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన చర్చల్లో రాయల తెలంగాణను అడ్డుకునే కార్యాచరణపై చర్చించారు. ‘జిల్లాల్లోని నాయకులందరితో మాట్లాడండి. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సంపూర్ణంగా విజయవంతం చేయాలి. అందుకు క్యాడర్‌ను మొత్తం సిద్ధం చేయండి. రాయల తెలంగాణ ఇస్తే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు తీరని అన్యాయం చేసినట్లు అవుతుంది. కొంత మంది కాంగ్రెస్ నాయకులు రాయల తెలంగాణకు సుముఖత చూపుతున్నట్లున్నారు. వారి భాగోతాలు కూడా బయటపెట్టాల్సిన సమయంలో బయటపెడుదాం. ఎన్నికలు ఎంతో దూరం లేవు. అనంతపురం, కర్నూల్ జిల్లాల్లోని కొందరు, తెలంగాణలోని కొందరు మాత్రమే రాయల తెలంగాణ అంటున్నారు.

ఆ రెండు జిల్లాల ప్రజలు ఏమాత్రం సుముఖంగా ఉన్నట్లు లేదు. మనం రాయల తెలంగాణను వ్యతిరేకించాల్సిందే. అందుకు ఉద్యమాన్ని నిర్మించాల్సిందే. పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చేసే ఉద్యమాలు రేపటి ఎన్నికలకు కూడా ఉపయోగం’ అని అన్నట్లు సమాచారం. రాయల తెలంగాణ గనుక ఇస్తే వారు మన పార్టీని విలీనం చేయాలనే మాట అనడానికి అర్హత పోగొట్టుకుంటారు. ఎన్నికల తరువాత మద్దతూ అడగలేరు.. అపుడు తెలంగాణకు ఏ కూటమితో అయితే ఉపయోగం అనేది ఆలోచించి అప్పుడు కేంద్రంలో కీలకంగా వ్యవహరిద్దామని కేసీఆర్ నేతలతో చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలోకి వచ్చే కూటమితో వెళ్లి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను, నిధులను తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడ మనకే పనికొస్తుందనే చర్చ కూడా కాసేపు జరిగినట్లు తెలిసింది. ఒకవేళ ఇపుడు రాయల తెలంగాణ బిల్లు ఆమోదిస్తే ఎన్నికల తర్వాత అప్పుడు అధికారంలో టీఆర్‌ఎస్ పార్టీనే ఉంటుంది కనుక అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ రెండు జిల్లాలను తొలగించుకునే వెసులుబాటు మనకు ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. కేసీఆర్ ఆ తరువాత విద్యార్థి నేతలతో కొద్దిసేపు సమావేశమయ్యారు. 4, 5 తేదీల్లో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించినట్లు తెలిపింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.