ఉత్తర తెలంగాణ ఎండుతున్నది

 

endalu-డెడ్‌స్టోరేజీకి చేరువలో ఎస్సాస్పీ
-ప్రస్తుత నీటి నిల్వ 9 టీఎంసీలు.. 4 టీఎంసీలు తగ్గితే అతలాకుతలమే!
-నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
-కరీంనగర్, వరంగల్‌కు తాగునీటి కష్టాలు
-15రోజుల్లో ప్రారంభంకానున్న ఖరీఫ్.. వర్షం పడితేనే సాగు సాగేది
-ఆందోళనలో ఆయకట్టు అన్నదాతలు
-మహారాష్ట్ర జలదోపిడే అసలు సమస్య!

ఉత్తర తెలంగాణ వరవూపదాయని.. శ్రీరాంసాగర్! ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి! మండుతున్న ఎండలతో నీటి మట్టం నానాటికీ ఆవిరైపోతోంది! ప్రస్తుతం తొమ్మిది టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మరో నాలుగు టీఎంసీలు ఆవిరైతే.. డెడ్‌స్టోరేజే! ఎస్సాస్పీలో నీరు అడుగంటడంతో రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాకపోవడంతో కరీంనగర్, వరంగల్ జిల్లాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. ఆయకట్టు కింద 18లక్షల ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా.. బీడువారే పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. 15రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుంది. వర్షాలు పడితేనే.. సాగు సాగేది! లేదంటే.. అంతే!! ఈ దయనీయ పరిస్థితికి గోదావరి జలాలను మహారాష్ట్ర సర్కారు అడ్డుకోవడమే కారణమని రైతులు అంటున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సాస్పీ) ఆయకట్టు రైతాంగానికి ఏటా కష్టాలు తప్పడం లేదు. ఏ ఒక్క సీజన్‌లోనూ రైతాంగానికి సరిపడా నీరు అందుతున్న దాఖలాల్లేవు. గడిచిన దశాబ్దకాలంగా ఒకటి, రెండు ఖరీఫ్ సీజన్‌లు మినహా ఏటా నిరాశే ఎదురవుతోంది. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సాస్పీలో 9టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎండలు ఇలాగే మండి.. మరో నాలుగు టీఎంసీల నీరు తగ్గిపోతే పరిస్థితి అతలాకుతలమే అవుతుందని అన్నదాతలు కలవరపడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా తయారవుతోంది. 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాల్సిన ఎస్సాస్పీ.. రెండు సీజన్‌లకు కలిపి పట్టుమని 10లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించడం లేదు.

సాగునీటితో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాలకు తాగునీటిని, రామగుండం ఎన్టీపీసీకి విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీటిని అందించాల్సిన ప్రాజెక్టు రోజురోజుకు సామర్థ్యాన్ని కోల్పోతున్నది. గత ఏడాది విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదు. ఇక్కడ ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదంటే శ్రీరాంసాగర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! 1091 అడుగుల నీటిమట్టంతో, 91 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు గత ఏడాది పూర్తిస్థాయిలో నిండనే లేదు. ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు ముఖం చాటేయడంతో దిక్కుతోచని రైతాంగం గోదావరి నీటిపై గంపెడాశలు పెట్టుకుంది. కానీ మహారాష్ట్ర జలదోపిడీతో గోదావరి నుంచి చుక్క నీరైనా శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి రాలేదు. మహారాష్ట్ర అక్రమ కట్టడాల కారణంగా ఇక్కడి రైతాంగం తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. గతయేడాది వర్షాలు అనుకున్న సమయానికి రెండు నెలలు ఆలస్యంగా కురిశాయి. అప్పటికే రైతాంగం సాగుకు దూరమైంది.

ఆగస్టులో కురిసిన వర్షాలతో ఎలాంటి లాభం జరగలేదు. గత ఏడాది 36 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. వర్షం నీరు వల్లే ఆమావూతమైనా నీరు ప్రాజెక్టులో చేరింది. అయితే.. అప్పటికే రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో కనీసం రబీలోనైనా నీటి విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు ఆలోచించారు. గత ఏడాది ఖరీఫ్‌లో చుక్క నీటిని కూడా ఆయకట్టుకు వదలలేదు. దీంతో 11లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన శ్రీరాంసాగర్ ఆయకట్టు 5లక్షల ఎకరాలకే పరిమితమైంది. రబీలో సైతం 19 టీఎంసీల నీటిని వరద కాలువ, కాకతీయ కాలువల ద్వారా కరీంనగర్‌లోని లోయర్‌మానేరు డ్యాంకు వదిలారు. ఇందులో 3 టీఎంసీల నీరు వృథాగానే పోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1056.50 అడుగులు కాగా 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్‌స్టోరేజీకి కేవలం 4 టీఎంసీల దూరంలో మాత్రమే ఉంది. సూర్యతాపం తీవ్రంగా ఉండటతో ప్రాజెక్టులో నీరు రోజురోజుకు ఆవిరవుతోంది.

అన్నదాతలకు అందని భరోసా
శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద లక్ష్మీ, సరస్వతి, కాకతీయ కాలువల ద్వారా 11 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సీజన్‌లో నీటి విడుదల జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ తీవ్ర నిరాశజనకంగా ఉంది. ప్రాజెక్టు ఎండిపోయే పరిస్థితికి చేరువలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయకట్టుదారులకు భరోసా లేకుండాపోయింది. జూన్ మొదటివారంలో వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నా రైతుల్లో ఆందోళన తగ్గడం లేదు. గత ఏడాది నాట్లు వేసి నష్టపోయిన అన్నదాతలు.. ఈ ఏడాది వర్షాలు వచ్చే వరకు నాట్లు వేయవద్దని నిర్ణయించుకున్నారు.

ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల రైతాంగం పరిస్థితి ఎటు తేల్చు కోలేకుండా ఉంది. గత ఏడాది 6 లక్షల ఎకరాల్లో సాగు చేయలేని పరిస్థితి నెలకొన్నప్పటికీ వర్షాలపై నమ్మకంతో దాదాపు 9 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కానీ నాట్లు వేసిన దశలో మొదటి తడి నీరు అందక దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిపోయింది. బోరుబావులపై ఆధారపడి 5 లక్షల ఎకరాల్లో సాగును నెట్టుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో అటు మహారాష్ట్ర నుంచి గోదావరి జలాలు ఎస్సాస్పీలోకి చేరే అవకాశం ఎంతమాత్రం లేదు. దీనికితోడు మంజీర, ఆదిలాబాద్ జిల్లాలోని గడ్డెన్నవాగుపైనే శ్రీరాంసాగర్ ఆధారపడి ఉంది. సకాలంలో భారీ వర్షాలు కురిస్తే తప్ప శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతాంగం గట్టెక్కే పరిస్థితి లేదు. మరో పదిహేను రోజుల్లో.. అంటే, జూన్ మొదటివారంలో ఖరీఫ్ ఆరంభం కానుంది.

ప్రధానంగా జూన్ మొదటివారంలోనే నిజామాబాద్ జిల్లా రైతాంగం ఖరీఫ్ సాగును ఆరంభిస్తారు. పది రోజులు ఆటుఇటుగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా రైతాంగం కూడా వ్యవసాయ పనులను మొదలుపెడతారు. కనీసం ప్రాజెక్టు నీటిని కాలువల ద్వారా విడుదల చేయాలంటే 35 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉండాలి. అంటే జూన్ మొదటివారం నుంచి పదిహేను, ఇరవై రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే గానీ ప్రాజెక్టులోకి ఖరీఫ్‌నకు సరిపడే నీరు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టుపై ఆధారపడ్డ ఆయకట్టు రైతాంగానికి వర్షాలే దిక్కు.

ఎత్తిపోతల రైతాంగానికి గండమే…
శ్రీరాంసాగర్‌పై ఆధారపడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 22 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ప్రాజెక్టులో కనీసం 18 టీఎంసీల నీరు ఉంటే గానీ ఈ ఎత్తిపోతలు పనిచేయవు. రిజర్వాయర్ చివరినీటిపై ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఎత్తిపోతల ద్వారా దాదాపు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు అనేక ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. రబీ సీజన్ ఆరంభంలో ఎత్తిపోతలు కొంతమేర ఆదుకున్నప్పటికీ క్రమేణా తగ్గిన నీటిమట్టంతో చివరి తడి వరకు నీటిని అందించనేలేదు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్‌పై ఆధారపడి అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి.

ప్రధాన నీటి వనరులు ఇవే కావడంతో జిల్లా రైతాంగం ఖరీఫ్‌పై అయోమయంలో ఉంది. ఇదిలాఉంటే కరీంనగర్, వరంగల్ పట్టణాల తాగునీటి కోసం కనీసం 3 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. దీంతో పాటు ఎన్టీపీసీకి విద్యుత్ ఉత్పత్తి కోసం మరో 2 టీఎంసీల నీరు తప్పనిసరిగా అందివ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో లోయరు మానేరు డ్యాం నిండటంతో కొంతమేర ఉపశమనం కలిగినా ప్రస్తుతం మాత్రం రైతులకు ఇక్కట్లు తప్పేలాలేవు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.