ఈ సమావేశాల్లో టీ బిల్లు ఆమోదింపజేస్తం- కేంద్ర మంత్రి షిండే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 ): ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదింప చేస్తామని పునరుద్ఘాటించారు. సోమవారం తెలంగాణ బిల్లుపై సభలో చర్చ జరుగుతుందని వెల్లడించారు. ఇదే అంశంపై సోమవారం ఉదయమే కేబినెట్ సమావేశం ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న షిండే.. శనివారం షోలాపూర్‌లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమయంలో తెలంగాణ అంశంపైనా పలువురు ప్రశ్నించగా.. మేము తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు మా పార్టీ విధానం అని స్పష్టం చేశారు.

shindyrajతమ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్ తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అది తమ పార్టీ ఇచ్చిన వాగ్దానమని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదం పొందేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని షిండే స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ పార్లమెంటులో సృష్టించిన అరాచకంపై ఆయన మండిపడ్డారు. లగడపాటి తదితర ఎంపీలు వ్యవహరించిన తీరు తప్పుడు విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కేబినెట్ భేటీ మూడు రోజుల సెలవు అనంతరం పార్లమెంటు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశాన్ని సోమవారం ఉదయం 10.15 గంటలకు ఏర్పాటు చేసినట్లు షిండే తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ బిల్లులో చేర్చాలని బీజేపీ ప్రతిపాదించిన పలు సవరణలపై చర్చించి, వాటిని సభలో ప్రతిపాదించే అంశంపై చర్చించనున్నారని సమాచారం.

ఈనెల 21తో పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపే ఉభయసభల్లో తెలంగాణ బిల్లును పాస్ చేయించే అంశంపై చర్చించనున్నారు. అలాగే పార్లమెంటులో అనైతికంగా వ్యవహరించి, పార్లమెంటు ప్రతిష్ఠను దెబ్బతీసిన సీమాంధ్ర ఎంపీల వ్యవహారం కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ సంఘటనపై పార్లమెంటు భద్రతా వ్యవహారాల కమిటీని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపైనా కీలక నిర్ణయం వెలువడుతుందని సమాచారం. ఈ నెల 17న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ఇప్పటికే ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై చర్చపైనా నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తున్నది

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.