ఈ సమయంలో సీఎంగా ఉండటం నా దురదృష్టం- అసెంబ్లీలో కిరణ్

– నా జీవితంలో ఎన్నడూ మాట మార్చలేదు
– కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు
– సమైక్యంగా ఉంటేనే అందరికీ మేలు
– ఆంధ్రావారిని నిజాం ఆహ్వానించాడు
– నాటి సాయుధ పోరాట గీతాలు ఆంధ్రులవే
– తెలంగాణ అంత వెనుకబడిందేమీ కాదు
– పది మందిని రీపాట్రియేషన్ చేస్తే సరిపోతుంది
– సమైక్య రాష్ట్రమా? కాంగ్రెస్ పార్టీనా? తేల్చుకోవాల్సి వస్తుందని ఊహించలేదు
– సోనియాగాంధీ వల్లే సీఎం అయ్యాను..అయినా ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా
– ముసాయిదా బిల్లుపై చర్చలో సీఎం వ్యాఖ్యలు
రాష్ట్ర విభజనకు తాను పూర్తిగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్నానని బుధవారం శాసనసభలో ప్రకటించారు. రాష్ర్టాన్ని విభజించే బిల్లుపై ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిరావడం, ఈ సమయంలో సీఎంగా ఉండటం తన దురదష్టమని వ్యాఖ్యానించారు. సమైక్యంగా ఉంటేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. అసలు తెలంగాణ ఎక్కడ వెనుకబడిందని ప్రశ్నించారు. ఉద్యోగుల విషయంలో పదిమందిని రీపాట్రియేట్ చేస్తే సరిపోతుందని తేల్చేశారు. అన్ని పార్టీల నిర్ణయం అనంతరమే తమ పార్టీ నిర్ణయం తీసుకుందని.. అయినా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పిన సీఎం.. కాంగ్రెస్ నిర్ణయాన్ని ధిక్కరించేందుకు ఎంతగానో బాధపడ్డానని అన్నారు. ప్రజల కోరిక మేరకే రాష్ట్రం ఏర్పడిందన్న సీఎం.. సమైక్య రాష్ట్రమే జాతికి, రాష్ర్టానికి ప్రయోజనకారి అని అభివర్ణించారు. రైతులు,

ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసమే విశాలాంధ్ర ఏర్పడిందని చెప్పారు. ఏ విధంగా రాష్ర్టాలు ఏర్పడ్డాయో ఒకసారి చరిత్రలోకి వెళ్తే తెలుస్తుందని అన్నారు. బీజేపీనుంచి నీతి నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. తన జీవితంలో మాట మార్చలేదని అన్నారు. నాగం జనార్దన్‌రెడ్డిలా పదేపదే అభిప్రాయాలు మార్చుకునే వ్యక్తిత్వం తనకు లేదన్నారు.

billvrirekamసమైక్యతకోసమే సంస్థానాల విలీనం
దేశం సమైక్యంగా ఉండాలనే 550కిపైగా సంస్థానాల విలీనం జరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. భాషా ప్రయుక్త రాష్ర్టాల కోసం ఉద్యమాలు జరిగాయని ప్రస్తావించారు. 1908లో అలహాబాద్ కాంగ్రెస్ సదస్సులో మద్రాస్‌లో ఉన్న ఆంధ్రాకు రాష్ట్రం కావాలని అడిగారు. 1928, 1937లలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేయాలని లక్నో కాంగ్రెస్ తీర్మానాలు చేసింది. 1918లో అనిబీసెంట్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఆమె ఒప్పుకోకపోయినా పట్టాభి సీతారామయ్య అనుకూలంగా నిర్ణయం చేయించారు. 1920లో నాగపూర్ కాంగ్రెస్ సదస్సులో భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు తీర్మానించారు. 1937లో జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కళా వెంకట్రావు, కొండా వెంకట్‌రెడ్డిలద్వారా ఏకగ్రీవ తీర్మానం చేశారు అని చెప్పారు.

అనంతశయనం అయ్యంగార్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్‌లు 1947లో తీర్మానం చేయాలంటే సర్దార్ పటేల్ వ్యతిరేకించారని సీఎం గుర్తు చేశారు. 1948లో భారత ప్రభుత్వం థార్ కమిషన్ వేసిందని వెల్లడించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ర్టాన్ని ప్రకటించారని, రెండు ప్రాంతాల ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా కలిసి ఉద్యమించారని సీఎం తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గీతాలను సీమాంధ్ర వారే రాశారని చెప్పారు. కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ.. ఆయన సభలో చాలా చిన్నవారు. జాగ్రత్తగా నడుచుకోవాలి అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో విశాలాంధ్ర సమాలోచనలు జరిగాయని, ఆ సమయంలోనే ఆంధ్ర ప్రాంతంవారు వ్యవసాయం చేసుకునేందుకు తెలంగాణకు రావాలని, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ప్రాజెక్టులు వస్తున్నాయని నిజాం నవాబే స్వయంగా ఆహ్వానించారని చెప్పారు.

పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా
సమైక్య రాష్ర్టామా? కాంగ్రెస్ పార్టీనా అనేది తేల్చుకోవాల్సిన క్లిష్ట సమయం వస్తుందని ఊహించలేదని సీఎం చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే సీఎం అయ్యానన్న కిరణ్.. అయినా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ఉద్ఘాటించారు. బాధాతప్త హృదయంతో వాస్తవాలు చెప్పక తప్పడంలేదన్నారు. తన జీవితంలో ఇలాంటి సమయం వస్తుందని అనుకోలేదని, కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని భావించలేదని తెలిపారు.

తానెందుకు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సి వచ్చిందో చర్చ చివరలో చెబుతానన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో సౌకర్యాలున్నాయని, రోడ్లు, భవనాలు, సదుపాయాలున్నందున విశాలాంధ్ర ఏర్పడాలని, హైదరాబాద్ రాజధాని కావాలని 1952లో నిజామాబాద్ ఎంపీ కోరారని తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాలను కలిపితే సంపూర్ణ రాష్ట్రం అవుతుందని ఎంఆర్ కృష్ణ వెల్లడించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. తలసరి ఆదాయం నాటికి ఆంధ్రలోనే ఎక్కువన్న విషయాన్ని నాటి ఎంపీ జయసూర్య చెప్పారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం రావటానికి ముందే భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు ఉద్యమాలు జరిగియని కిరణ్ తెలిపారు. 1960లో తెలుగు మాట్లాడేవాళ్లు శ్రీకాకుళం నుంచి పులికాట్, మైసూర్‌దాకా ఉండేవారని ద్రవిడుల చరిత్రలో ఉందన్నారు.

నేటి పరిస్థితిని ఇందిర ఆనాడే ఊహించారు
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను బలవంతంతగా కలపలేదని సీఎం చెప్పారు. 14ఎఫ్ తొలగించినట్లుగానే ముల్కీ రూల్స్ తొలగించారని అన్నారు. కానీ అవి ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. భావోద్వేగ పరిస్థితి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోలేమన్న కిరణ్.. ఉద్వేగ పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దని నాడు ఇంధిరాగాంధీ చెప్పారని గుర్తుచేశారు. నిజాం పాలన బాగున్నప్పటికీ అందరికీ విద్యావకాశాలు రాలేదని ఇందిర డిసెంబర్ 21, 1972లో చెప్పారని వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవద్దని, సుదీర్ఘ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని పార్లమెంట్‌లో ఇందిరాగాంధీ చెప్పారని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ర్టాలు జాతీయోద్యమంలో భాగమేనని నాడు ఇందిర చెప్పారని తెలిపారు. తెలుగువాళ్లు దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్లబోరని ఆమె నమ్మారని, నేడు ఉత్పన్నమయిన పరిస్థితులను ఆమె ఆనాడే ఊహించారని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వెనుకబాటు లేదు
వెనుకబడిన ప్రాంతాలులేని రాష్ర్టాలు లేవని సీఎం అన్నారు. తెలంగాణలో అంతగా వెనుకబడిందేమీలేదని చెప్పారు. వెనుకబాటుతనాన్ని స్వార్ధానికి వాడుకోవద్దని ఇందిరాగాంధీ ఆనాడే చెప్పారని పేర్కొన్నారు. సమస్యకు విభజన పరిష్కారం కాదని చెప్పారు. ఎస్సార్సీ వల్లే పలు రాష్ర్టాలు ఏర్పాటయ్యాయన్న సీఎం.. ఏకాభిప్రాయంతోనే కొత్త రాష్ట్రం ఏర్పాటుకావాలని తొలి ఎస్సార్సీలో చెప్పారని అన్నారు. విశాలాంధ్ర కోరుతున్నానని బూర్గుల రామకృష్ణారావు నాడు శాసనసభలో ప్రకటించారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితికంటే మెరుగైన పరిస్థితి ఉంటేనే రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. తెలుగు ప్రజల భాష, సంస్కృతి ఒక్కటేకాబట్టి తొలి ఎస్సార్సీ రెండు ప్రాంతాలను కలిపిందన్నారు. జీవనదులు ఒకే రాష్ట్రంలో ఉంటే రైతులకు మేలు జరుగుతుందని నిర్ణయించారని చెప్పారు. ఇందులో భాగంగానే 1956లో ఫజల్ అలీ కమిషన్ తర్వాతే మహారాష్ట్ర, కర్ణాటకకు కొన్ని జిల్లాలు వెళ్లాయని తెలిపారు. తెలంగాణకంటే రాయలసీమ, శ్రీకాకుళం వెనుకబడ్డాయని ఇందిర గుర్తించారని, అన్ని జిల్లాల్లో అభివద్ధి ఒకేలా ఉండదని ఆనాడే ఆమె ఊహించారని సీఎం తెలిపారు.

ఆంధ్రాతో కలిసిన తర్వాత తెలంగాణవారు ఎక్కడ వెనుకబడ్డారో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. అనేక జాతీయ సంస్థలు, విద్యా, పరిశోధన సంస్థలు ఇక్కడికి వచ్చాయి. ఉద్యమాలు జరుగుతున్నా ఇక్కడి సదుపాయాల రీత్యా పరిశ్రమలు వస్తున్నాయి. ఉపగ్రహాలకు వినియోగించే ఉపకరణాల యూనిట్ రింగ్‌రోడ్డుకు సమీపంలో రానుంది. ఇసుజూ కార్ల యూనిట్ త్వరలో ప్రారంభిస్తాం. అనేక సమ్మేళనాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచింది. కలిసున్నాం కాబట్టే సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయగలుగుతున్నాం అన్నారు.

రాయలసీమ ఉద్యోగుల కోసమే జయభారత్‌రెడ్డి కమిషన్
రాయలసీమ ఉద్యోగుల కోసమే జయభారత్‌రెడ్డి కమిషన్ వేశారని సీఎం చెప్పారు. తెలంగాణలో 15.5% ఉద్యోగులు బయటివాళ్లు ఉన్నారని ఆ కమిషన్ తేల్చిందన్నారు. 58వేల పైచిలుకు తెలంగాణేతరులున్నారని చెప్పింది నిజమన్న సీఎం.. అదే నివేదిక ఆంధ్రలో 30 వేలమంది, రాయలసీమలో 11వేలమంది స్థానికేతరులున్నారని తేల్చిందన్నారు. స్థానికేతరులు 18856 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 14784మందిని మాత్రమే వెనుకకు పంపాలని నిర్దేశించారని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలవారికి అవకాశం ఇవ్వాలని 6 సూత్రాల పథకం తెచ్చారని గుర్తుచేశారు. పదిమందిని రీపాట్రియేషన్ చేస్తే సరిపోతుందని సీఎం స్పష్టం చేశారు.

తీర్మానమేది?
గతంలో మూడు కొత్త రాష్ర్టాల ఏర్పాటులో అసెంబ్లీ తీర్మానం చేశాకే విభజన సాధ్యపడింది.. ఇప్పుడెందుకు ఆ ప్రక్రియ ప్రారంభించలేదని మా ప్రభుత్వాన్నే అడగాల్సి వస్తున్నది అని సీఎం వాపోయారు. అసెంబ్లీ తీర్మానం అవసరమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చెప్పారని తెలిపారు. విభజన ప్రక్రియలో గత పద్ధతులను అవలంబిస్తామని చిదంబరం రాజ్యసభలో ప్రకటించారని గుర్తుచేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటు కోరుతూ సోనియాగాంధీకి 41మంది విజ్ఞప్తులు చేశారని, విభజనపై నిర్ణయం తీసుకోవాలని ఆమె కేంద్రానికి లేఖలు రాశారని తెలిపారు. నరేంద్ర పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావిస్తే నాడు అద్వానీ తిరస్కరించారని చెప్పారు. రెండు ప్రాంతాలు కలిసి ఉన్నందుకే ఇంత అభివృద్ధి సాధ్యమైందని పునరుద్ఘాటించారు. రెండు ప్రాంతాలు రెండు రాష్ర్టాలుగా ఉంటే సాధ్యమయ్యేది కాదన్నారు. సమయాభావం వల్ల మిగతా విషయాలను గురువారం మాట్లాడుతానని తెలియజేసి ముగించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.