ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ తథ్యం-కేసీఆర్‌

 

-మాతృభూమి విముక్తికే ఉద్యమంలోకి కడియం
-తెలంగాణ పునర్నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర
-శ్రీహరిని టీఆర్‌ఎస్‌లోకి స్వాగతిస్తూ కేసీఆర్
-ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ తథ్యం..
-కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలి..
-టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
-తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్
-ఉద్యమంలో సైనికుడిలా పనిచేస్తా..
-స్పష్టం చేసిన కడియం శ్రీహరి
కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లోకి రావడం రాజకీయ చేరిక కాదని, తెలంగాణ మాతృభూమి విముక్తి కోసమే ఆయన ఉద్యమంలోకి వచ్చారని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కడియం శ్రీహరి అనేక ఉన్నత శిఖరాలు చూశారని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే కావడానికి ఆయన రాలేదని అన్నారు. ‘2001లో పిడికెడు మందిమి. ఇప్పుడు ఉద్యమం ఉప్పెనై పొంగుతోంది. 1959, 1969లో తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది. ఇప్పుడు ఆగకూడదు. ఇప్పుడు ఓడిపోతే కట్టుబానిసలకంటే అధ్వాన్నంగా తెలంగాణ ప్రజలను చూస్తారు’ అని కేసీఆర్ అన్నారు.

ఆంధ్రపార్టీలు తెలంగాణ ప్రజలకు అవసరమా? అన్న చర్చను గ్రామాల్లో లేవనెత్తాలని సూచించారు. టీడీపీ, వైఎస్సార్సీపీలో తెలంగాణ నాయకుడెవరైనా పార్టీ అధ్యక్షుడు కాగలడా? సీఎం సీట్లో కూర్చొనగలడా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో టీడీపీ లీడర్ చంద్రబాబు, మండలిలో యనమల రామకృష్ణుడు. మరి మా తెలంగాణ నేతపూక్కడ?’ అని నిలదీశారు. ‘కాంక్షిగెస్ పేరుకే జాతీయ పార్టీ. ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో ఉన్న ఈ పార్టీని పాతాళంలోకి ఐదు కిలోమీటర్ల లోతుకు తొక్కాలి’ అని అన్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి.. బుధవారం వేల మంది కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్‌కు వచ్చి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన మెడలో గులాబీ కండువా వేసిన కేసీఆర్.. పార్టీలోకి స్వాగతించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చావు నోట్లో తలపెట్టి 57 సంవత్సరాల ఆకాంక్షను సాధిస్తే, తెల్లారేసరికి ఆంధ్రోళ్లంతా అడ్డం నిలబడి రాజీనామాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటించిన రాత్రి చంద్రబాబు, చిరంజీవి, చిన్నజీవి ఇలా అందరూ నిద్రపోకుండా కుట్ర చేశారని అన్నారు. జగన్ పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకుంటే, చంద్రబాబు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో బస్సుయాత్ర చేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల తరువాత తెలంగాణ తథ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘1956కు ముందు హైదరాబాద్ స్టేట్ పేరుతో మనం విడిగానే ఉన్నాం. మనది 63కోట్ల మిగులు బడ్జెట్. మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయి రూ.20కోట్ల లోటు బడ్జెట్‌తో ఉంది.

kadiyamప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నెహ్రూను కలుపుకొని కుట్రలు చేసి, తెలంగాణను ఇక్కడి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపారు. ‘సొచ్చేదాక సోమలింగం.. సొచ్చినంక రామలింగం’ అన్నట్లుగా ఇప్పుడు మాట్లాడితే హైదారాబాద్ అభివృద్ధి అంతా మాదే అంటారు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టాక చంద్రబాబు మేస్త్రిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయి దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 18నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారని, 180 నెలలైనా ఇప్పటి వరకు నీళ్లు రాలేదని అన్నారు. తెలంగాణకు 1300 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా కనీసం 300టీఎంసీలు కూడా రావడం లేదని అన్నారు. ఇప్పడు కడుతున్న ప్రాజెక్టులు మరో 40-50సంవత్సరాలైనా పూర్తయ్యేలా లేవని అన్నారు.

శ్రీహరి టీడీపీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారని, తెలంగాణకు ఎన్ని నీళ్లు రావాలన్న దానిపై ఆయన ఒక డాక్యుమెంట్ ఇచ్చారని, ఇప్పటికీ అది తన దగ్గర ఉందని కేసీఆర్ చెప్పారు. నాడు శ్రీహరి తెలంగాణకు దక్కే నీళ్లవాటాను రాతపూర్వకంగా ఇచ్చారని, దీంతో తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలో భవిష్యత్తులోనూ అడిగే హక్కు లభించినట్లైందని అన్నారు. తెలంగాణ కోసం మన తరంవాళ్లం కలిసి కొట్లాడాలి అని కడియంతో అన్నప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని, తద్వారా ఢిల్లీని శాసించి తెలంగాణ సాధించుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

పునర్నిర్మాణంలో శ్రీహరిది కీలక పాత్ర
తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రీహరి కీలక పాత్ర పోషిస్తారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉండే 10మందిలో కడియం ఒకరని ప్రకటించారు. తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసినా ఒక్కపైసా కూడా అవినీతికి పాల్పడని, మచ్చలేని మంత్రిగా ఉన్నారని ప్రశంసించారు. శ్రీహరి విలువలతో కూడిన రాజకీయ నాయకుడని అభివర్ణించారు. ఆయన సేవలను ఉపయోగించుకుంటామని, పార్టీలో ఉత్తమ స్థానంలో ఉంటారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు నిర్విరామంగా 8 గంటల కరెంటు, అదికూడా పగటిపూటే ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి సాధిస్తామని అన్నారు. మొదటి మూడు సంవత్సరాలు ఇబ్బంది ఉన్నా, ఛత్తీస్‌గఢ్‌లాంటి రాష్ట్రాల నుండి కరెంటు తెచ్చి ఇస్తామని అన్నారు.

కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పారు. పిల్లలను స్కూల్లో చేర్పించే బాధ్యతను పోలీసులకు అప్పగిస్తామని, పిల్లలు స్కూల్లో కాకుండా ఉళ్లో ఉంటే పోలీసులను సస్పెండ్ చేస్తామని అన్నారు. లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. హాస్టళ్లు సామాజిక వర్గాల ఆధారంగా ఉండవని కేసీఆర్ చెప్పారు. వాటి స్థానంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందులో సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పిస్తామని అన్నారు. తెలంగాణలో ఇంకా 72 నియోజకవర్గాలకు సాగునీటి వసతి లేదని, తెలంగాణ వచ్చాక నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడే సీఎం అవుతాడని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ముస్లింలకు 3%, గిరిజనులకు 12%రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. చిన్నచిన్న భూ కమతాలను మార్చి, ఒకే దగ్గర మూడు ఎకరాలు ఉండేలా చేస్తామని, ఇందుకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

సైనికుడిలా పనిచేస్తా: శ్రీహరి
రాజకీయ జన్మనిచ్చిన టీడీపీకంటే తనకు జన్మనిచ్చిన తెలంగాణ తల్లి విముక్తే ప్రధానమని భావించి టీడీపీని వీడినట్లు కడియం శ్రీహరి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ అని అభివర్ణించారు. తెలంగాణ సాధించాలనే సంకల్పంతోనే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరితోనైనా సర్దుకుపోతానని అన్నారు. ఉద్యమానికి ఉపయోగపడతాను కానీ నష్టం చేయనని హామీ ఇచ్చారు. టీడీపీ తనకు పదవులు, గుర్తింపు ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సామాజిక న్యాయం ఎజెండాతో వచ్చారని, నేడు ప్రజలు తెలంగాణ ఎజెండాగా పోరాటం చేస్తున్నారని అన్నారు.

ప్రజల ఎజెండా మారిందని, దాని ప్రకారం టీడీపీని వదిలి కేవలం తెలంగాణే ఎజెండాగా ఉన్న టీఆర్‌ఎస్‌లో చేరానని వివరించారు. తాను టీఆర్‌ఎస్‌లోకి పదవుల కోసం రాలేదని, తెలంగాణ ఉద్యమంలో సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. తమను ఎలా ఉపయోగించుకుంటారో ఆలోచించాలని కోరారు. తనతో వచ్చిన 2000మంది కార్యకర్తలు ఒకొక్కరు కనీసం 10 ఓట్లు వేయించగలవారని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరడం ఇప్పటికే ఆలస్యమైందని అన్నారు. టీడీపీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేయలేక, టీడీపీని వదులుకోలేక ఇన్నాళ్లు అక్కడున్నానని, ఇప్పుడు ప్రజల తీర్పు మేరకు టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. సీమాంధ్ర పార్టీలో ఉండి ఉద్యమంలో పాల్గొనలేక మానసిక సంఘర్షణకు గురవుతున్న వారంతా ఆత్మవంచన చేసుకుంటున్నారని కడియం అన్నారు. ‘రండి ప్రజా ఉద్యమంలోకి. రండి టీఆర్‌ఎస్‌లోకి. తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తోంది కేసీఆర్. ఆయన నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం. కొన్ని పార్టీలకు 4-5 ఎజెండాల్లో తెలంగాణ ఒకటి. టీఆర్‌ఎస్‌కు కేవలం తెలంగాణే ఎజెండా. నా వైపు నుండి తెలంగాణ ఉద్యమానికి కించిత్తు నష్టం ఉండదు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకుంటా’ అని ప్రకటించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.