ఈసారి విజయవాడ జాతీయ రహదారిపై సడక్ బంద్

చలో అసెంబ్లీ కూడా చేపడతాం..త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం
– ఉద్యమం అణచివేతకు సర్కారు కుట్ర : కోదండరాం
 తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి సీమాంధ్ర సర్కారు కుట్ర పన్నుతున్నదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తూ చేపట్టిన సడక్‌బంద్ విజయవంతమైందని, రెండో దఫా సడక్ బంద్‌ను విజయవాడ జాతీయ రహదారిపై నిర్వహించేందుకు టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానించిందన్నారు. టీఆర్‌ఎస్ నేత సాంబశివుడి రెండో వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా వలిగొండకు బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటిసారిగా నిర్వహించిన సడక్ బంద్ కంటే రెండో దఫా సడక్ బంద్ మరింత పటిష్టవంతంగా నిర్వహించేందుకు త్వరలోనే మరోసారి సమావేశమై తేదీలను నిర్ణయిస్తామన్నారు. రెండో దఫా సడక్ బంద్‌తో పాటు ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించి, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కోదండరాం చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అడ్డం పడుతోందని ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.