ఇద్దరు ఇంటికి..

 

out-సీఎంతో 45 నిమిషాలు భేటీ..
పార్టీ హైకమాండ్ వైఖరి చెప్పిన కిరణ్
-అసంతృప్తి వ్యక్తం చేసిన ఇద్దరు మంత్రులు.. పదవులకు రాజీనామాలు
-కాన్వాయ్ వదిలి సొంత వాహనాల్లో తిరుగుముఖం..

….ఇప్పటికిద్దరు
-ఒప్పించి, తప్పించడంపై తిప్పలు పడిన సీఎం
-శ్రీకాకుళం నుంచి ధర్మానకు హుటాహుటిన పిలుపు
-అంతకు ముందు న్యాయశాఖ మంత్రి, న్యాయ నిపుణులతో సమాలోచనలు
-రేపో, మాపో రాజీనామాలు గవర్నర్‌కు?
-ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా మంత్రుల్లో టెన్షన్ టెన్షన్
-వారికీ ఉద్వాసన తప్పదా?
కళంకిత మంత్రులపై వేటు పడే ప్రక్రియ మొదలైంది. ఆదివారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డితో 45 నిమిషాలపాటు జరిగిన సమావేశం అనంతరం రాజీనామా లేఖలను సీఎంకు అందజేసి వెళ్ళిపోయారు. రాజీనామాల విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ముఖ్యమంవూతితో సమావేశానికి ఇద్దరు మంత్రులు కూడా సొంత వాహనాల్లోనే వచ్చారు. భేటీ అనంతరం కాన్వాయ్ లేకుండానే, సొంత వాహనాల్లో మీడియా ముందుకు రాకుండా వెళ్ళిపోవడం గమనిస్తే వారి రాజీనామాలను ధ్రువీకరించిన పార్టీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇద్దరు సోమవారం గవర్నర్‌ను కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రేపో, మాపో వారి రాజీనామాలను గవర్నర్‌కు పంపించి ఆమోదం పొందవచ్చనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవినీతి ఆరోపణలతో ఒక హోం మంత్రి రాజీనామా చేయడం రాష్ట్ర చరివూతలోనే ఇది తొలిసారి. ఇద్దరి రాజీనామాల నేపథ్యంలో వివిధ కేసుల్లో ఇరుక్కుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా మంత్రులూ ఇదే బాటలో పయనించాల్సి రావచ్చునంటున్నారు. ప్రస్తుతానికి ధర్మాన, సబితలపైనే సీబీఐ చార్జిషీటు దాఖలు చేయడంతో తొలగింపును వారికే పరిమితం చేశారని, సీబీఐ మిగతా మంత్రులపై చార్జిషీటు దాఖలుచేసినప్పుడు వారిని కూడా తప్పించాలనే నిర్ణయానికి సీఎం రావచ్చునని తెలిసింది. కళంకిత మంత్రులను తొలగించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు విపక్షాల నుంచి ఒత్తిడి రావడం, సొంత పార్టీ నేతలు సైతం బలంగా డిమాండ్ వినిపించడంతో పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర నిర్ణయం తీసుకోక తప్పలేదు.

కళంకిత మంత్రులను తొలగించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయబోతున్న తరుణంలో అంతకు కొద్ది గంటలముందే కళంకిత మంత్రుల జాబితాలో ఉన్న ఇద్దరు మంత్రులతో సీఎం మంతనాలు జరిపి, వారి నుంచి రాజీనామాలు తీసుకోవడం గమనార్హం. సీబీఐ చార్జిషీటు అందుకున్న మంత్రులు, అలాగే వివిధ కేసులు నమోదైన మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాల్సిందేనని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పార్టీ అధిష్ఠానం రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డితో జరిపిన సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిసింది. కళంకిత మంత్రులను తొలగించే విషయంలో సీఎంకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో కూడా శనివారం మీడియాతో మాట్లాడుతూ కళంకిత మంత్రులు స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకోవాల్సిందేనని పేర్కొనడం ద్వారా హైకమాండ్ మనసులో మాటను సుస్పష్టం చేశారు. దీంతో కళంకిత మంత్రులపై ఒకటి రెండు రోజుల్లో వేటుపడటం ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. మూడురోజులపాటు హస్తినలో మకాం వేసి అధిష్ఠానం నేతలతో చర్చలు జరిపిన సీఎం శనివారం నగరానికి తిరిగి రాగానే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంత్రి ధర్మానకు ఫోన్‌చేసి వెంటనే హైదరాబాద్ రావాలని కోరారు.

దీంతో మంత్రులపై చర్యలు తప్పవనేది తేలిపోయింది. ఆదివారం ఉదయం సీఎం తన క్యాంపు కార్యాలయంలో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌డ్డి, న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలిసింది. వివిధ కేసులు నమోదై, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రాడ్డి, పార్థసారధిల నుంచి కిరణ్‌కుమార్‌డ్డి రాజీనామా కోరనున్నట్లు ఆదివారం సాయంత్రం జోరుగా ప్రచారం జరిగింది. క్యాంపు కార్యాలయంలో వారితో సమావేశమై రాజీనామా లేఖలు తీసుకుంటారని వినిపించింది. సాయంత్రం ఆరుగంటలకు క్యాంపు కార్యాలయంలో జరగాల్సిన సమావేశం ఆలస్యం కావడంతో ఇటు మంత్రుల్లో, అటు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రాడ్డిలతో రాత్రి పది గంటల ప్రాంతంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి జూబ్లీహిల్స్‌లోని సొంత నివాసంలో సమావేశమయ్యారు.

అంతా ఉత్కంఠ.. : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో వైజాగ్ నుంచి విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోవాల్సింది. ధర్మాన వచ్చిన తరువాత ఆయనతోపాటే సబిత కూడా క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ కావాల్సి ఉంది. అయితే ధర్మాన రాక ఆలస్యం కావడం, కళంకిత మంత్రుల నుంచి సీఎం రాజీనామాలు తీసుకోనున్నట్లు వార్తలు రావడం, క్యాంపు కార్యాలయం వద్ద మీడియా హడావిడి బాగా పెరిగిపోవడంతో.. ముఖ్యమంత్రి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు.

శిల్పారామంలోని ఒక ప్రైవేట్ కార్యక్షికమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్ళారని, తిరిగి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చిన తరువాత సమావేశానికి రావాలని ధర్మాన, సబితకు సూచించినట్లు సీఎం కార్యాలయం వర్గాలు మీడియాకు తెలిపాయి. అయితే రాత్రి పది గంటల వరకు కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోలేదు. మరోవైపు రాత్రి 9.30 ప్రాంతంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం వద్దకు వెళుతున్నట్లు చెప్పి మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి బయలుదేరారు. సబితా ఇంద్రాడ్డి కూడా తన ఇంటి నుంచి వెళ్ళారు. రాత్రి 10.20 గంటల వరకు కూడా వీరు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చి మీడియా ఆరా తీసేసరికి, ముఖ్యమంత్రి కిరణ్ జూబ్లీహిల్స్‌లోని సొంత నివాసంలో మంత్రులు ధర్మాన, సబితతో రహస్యంగా సమావేశమైనట్లు రూఢి అయ్యింది. ఆ వెంటనే మీడియా అంతా కూడా అక్కడకు పరుగులు తీసింది. సీఎం ఆ ఇద్దరితో 45 నిమిషాలసేపు సమావేశమయ్యారు. రాత్రి 10.40 గంటల ప్రాంతంలో భేటీ ముగిసింది. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు.

అధిష్ఠానం తీరుపై అసంతృప్తి : కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తమ పట్ల వ్యవహరించిన తీరుపై మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రాడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో తాము బలిపశువులమయ్యామని వారు ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిసింది. సొంత పార్టీ నేతలే అనవసర రాద్ధాంతం చేశారని ఆ ఇద్దరు మంత్రులు సీఎం వద్ద వాపోయినట్లు సమాచారం. ఒకవైపు మంత్రులను బుజ్జగిస్తూనే మరోవైపు హైకమాండ్ ఆదేశాలను ముఖ్యమంత్రి వారికి వివరించారంటున్నారు. రాజీనామా కోరడం తనకు ఇష్టం లేదని, అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తప్పించాల్సి వస్తుందని వారికి వివరించినట్లు సమాచారం.

సీబీఐ చార్జిషీటులో పేరు ఉన్నందున నైతికంగా రాజీనామా చేయాల్సిందేనని అధిష్ఠానం స్పష్టం చేసిందని వివరించినట్లు తెలిసింది. గతంలోనే తాను రాజీనామా చేసినప్పుడు ఆమోదించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ధర్మాన సీఎంతో అన్నట్లు సమాచారం. ఇద్దరు మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఇష్టంలేని పనిని ఇబ్బందిలేకుండా చేసుకోగలిగారు. చార్జిషీటు ప్రకారం ప్రస్తుతానికి రాజీనామాలు ఇద్దరికి మాత్రమే పరిమితమయ్యాయని, త్వరలో మిగతా మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతాడ్డిలపై సీబీఐ చార్జీషీటు దాఖలుచేస్తే వారు కూడా రాజీనామాలు చేయాల్సి వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వారి రాజీనామలు ఎప్పుడో.. :ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవికి తొమ్మిది నెలల క్రితమే రాజీనామా చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ ధర్మాన కూడా నియమ, నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా వ్యవహరించారని ఆయనపై అభియోగాలు మోపింది. గతంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా ఉన్న వాన్‌పిక్ సంస్థకు 18వేల ఎకరాల భూకేటాయింపులో ధర్మాన నిబంధనలను తుంగలొతొక్కి, జీవోను జారీ చేస్తూ ఆ సంస్థకు సహకరించారని ఆరోపణలొచ్చాయి. చార్జిషీటు వేసిన వెంటనే ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ధర్మాన రాజీనామా చేసినప్పటికీ సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఆమోదించకుండా పక్కనపెట్టారు. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా ఉన్న దాల్మియా సిమెంట్‌కు గనుల కేటాయింపులో అప్పటి గనులశాఖ మంత్రిగా వ్యవహరించిన సబితా ఇంద్రాడ్డి నిబంధనలకు తూట్లు పొడిచారని పేర్కొంటూ సీబీఐ ఆమెపై ఏప్రిల్ 8న చార్జిషీటు దాఖలు చేసింది. అదేరోజు రాత్రి ఆమె సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్ళి తన హోం మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అయితే తొందరపడొద్దని, కొన్నిరోజులు వేచి చూద్దామని సీఎం, పీసీసీ చీఫ్ బొత్స, సహచర మంత్రులు కొందరు నచ్చజెప్పడంతో ఆమె తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాగా, కళంకిత మంత్రులను తొలగించిన పక్షంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కళంకిత మంత్రులతోపాటు తనకు తలనొప్పిగా తయారైన ఒకరిద్దరు సీనియర్ మంత్రులను తప్పించి వచ్చే ఎన్నికల కోసం సీఎం సొంత టీమ్‌ను నియమించుకుంటారని భావిస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.