ఇదో నాటకం-కల్వకుంట్ల కవిత

మోసకారి కృష్ణుడు మరో రూపంలో రాబోతున్నాడు. రాయల తెలం గాణ అనే డ్రామా స్క్రిప్ట్ తయారవుతున్నది. ఇదంతా కాలయాపన కోసం చేసే ఎత్తుగడ.‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న ట్లు తెలంగాణ ఇవ్వలేక కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ఇది. కాంగ్రెస్ వారి ‘ఏకాభివూపాయం’అనేది తెలంగాణ ప్రజల త్యాగాలతో మసి బారింది. పంచాయతీ ఎన్నికల ముందు ‘ప్యాకేజీ’ ముచ్చట్లతో కాంగ్రెస్ ముందుకు వస్తున్నది. ఉద్యమం ప్యాకేజీ కోసం కాదు. ప్యాకేజీలు ఇవ్వడం అంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే ప్రజలు ప్యాకేజీలు ఆమోదించరు. ఎన్నికల పబ్బం గడపడం కోసం కాంగ్రెస్ చేసే జిమ్మిక్కులు ఇవి. ఆకలితో అన్నం అడిగే వాడికి చాక్లెట్ ఇవ్వడం తెలివి తక్కువ తనం. ఫజల్‌అలీ కమిషన్ సిఫారుసులను తుంగలో తొక్కి, వేలాది మంది తెలంగాణ ప్రజల ప్రాణాలను బలిగొన్న కాంగ్రెస్‌కు ఇప్పటికి బుద్ధి రావ డం లేదు. ఏకాభివూపాయం, రెండో ఎస్‌ఆర్‌సీ, డిసెంబర్23 ప్రకటన, శ్రీకృష్ణ కమిటీ, ప్యాకేజీ, రాయల తెలంగాణ మొదలైనవి కాంగ్రెస్ నాటకంలోని అంకాలు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రతీ తెలంగాణవాది వీటిని మనస్పూర్తిగా ఖండిస్తున్నాడు. రాయల తెలంగాణ ఆమోదనీయం కాదని గోషిస్తున్నాడు. రాయల తెలంగాణ ఆలోచన వెనుక రాజధాని హైదరాబాద్‌ను వదులుకో కూడదు అనే స్వార్ధం ఉన్నది

ఆంధ్రవూపదేశ్ ఏర్పడే నాటికి ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఇవ్వాలని ఉద్యమం చేస్తుంటే, కాంగ్రెస్ స్వార్థ రాజ కీయతనాన్ని తెలంగాణ మీద రుద్దడం చౌకబారు రాజకీయం. ‘ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిది’ అని చెప్పిన నీలం సంజీవడ్డి, తెలంగాణ పదం అసెంబ్లీలో నిషేధించిన చంద్రబాబు, తెలంగాణ ఏర్పడితే వీసా తీసుకోవాలని ప్రజలను రెచ్చగొట్టిన రాజశేఖర్‌రెడ్డి, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తానని బీరాలు పలుకుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వారంతా రాయల సీమ వారే. సంస్కృతి రీత్యా రెండు ప్రాంతాలు వేర్వేరు. రాయలసీమ కృష్ణదేవరాయల వైభవానికి చిహ్నంగా ఉంది. అందుకే అనంతపురం రాజకీయ నాయకులు కర్నాటక ప్రాంతంతో కలసి ఉండాలని అంటున్నారు. తెలంగాణ వాళ్ళు నిజాం రాష్ట్రంతో ముడిపడి ఉన్నారు. శాతవాహనులు, కాకతీయులు ఈ ప్రాంతానికి చిహ్నం. తెలంగాణ వారు చిన్న రాష్ట్రాలను కోరుకుంటున్నారు. కనుక రాయల తెలంగాణకు వ్యతిరేకం. రాయల తెలంగాణ అంటే అధికార వికేంవూదీకరణకు గండి కొట్టినట్లే. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. రాయల తెలంగాణ అనేది కొందరు రాయలసీమ పారిక్షిశామిక వేత్తల, పెట్టుబడిదారుల కుట్ర మాత్రమే. నమస్తే తెలంగాణ ఆత్మీయ రథాన్ని ధ్వంసం చేయడం, ‘నమస్తే తెలంగాణ’ ప్రతులను తగలబెట్టడం, పత్రికా సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టడం లాంటి పనులు..పగ, ప్రతీకారాన్ని తెలిపే చర్యలు మాత్రమే.

ఇవి సమైక్యతను చాటే ధోరణులు కాదు. దీనిపై ఒకటి రెండు చానళ్లు తప్ప, ఏ మీడియా నోరు తెరువలేదు. అన్యా యం, అవినీతి, దురహంకారం లాంటి చిలుక పలుకులు పలికే చానళ్ళు, పత్రికలకు.. ‘ఆత్మీయ రథం’ పై జరిగిన దాడి కనిపించడం లేదా? ఇలాంటి వాతావరణంలో రాయలతెలంగాణ అనడం ఒక కుట్ర. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ప్యాకేజీలు, రాయల తెలంగాణలు ముందుకు వస్తున్నాయి. నాలుగు న్నర కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్‌తో కూడుకున్న 10 జిల్లాల భౌగోళిక ప్రాంతాన్ని మేం కోరుకుంటున్నాం. ఏ విలీనమైతే ఇంతటి ముప్పును తెచ్చిం దో దాన్ని పూర్వ పక్షం చేస్తూ పూర్వ స్థితిని మేము డిమాండ్ చేస్తున్నాం. అస్తిత్వ ఉద్యమంగా రాష్ట్ర ఆకాంక్ష ముందుకు వస్తున్న సమయంలో అనేక ప్రత్యేకతలు కలిగిన రెండు ప్రాంతాలను ‘రాయల తెలంగాణ’ పేరున రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామనడం మూర్ఖత్వం. చిన్న రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్న మేము ప్రత్యేక తెలంగాణ తప్ప దేన్నీ ఆమోదించలేం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణను ప్రకటించకపొతే ప్రజాగ్రహంలో సమాధి కాక తప్పదు.

-కల్వకుంట్ల కవిత
‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలు

This entry was posted in ARTICLES.

Comments are closed.