ఇదే బిల్లు పార్లమెంటులో పెడితే.. -సొంత పార్టీ ప్రభుత్వానికి సీఎం సవాల్

హైదరాబాద్, జనవరి 29 :రాష్ట్ర విభజన వ్యవహారం కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీకి పంపిన ముసాయిదా బిల్లును యథాతథంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సవాల్ చేశారు. అసెంబ్లీకి పంపింది ముసాయిదా బిల్లేనన్న సీఎం.. ఇది పార్లమెంట్‌లో అసలు అడ్మిట్ కాదన్నారు. కామా, ఫుల్‌స్టాప్ మార్చకుండా ఇదే బిల్లును ప్రవేశపెట్టడానికి పార్లమెంట్ అనుమతిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ లాబీలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీకి పంపింది కేవలం ముసాయిదా బిల్లుమాత్రమేనని, అది అసలు బిల్లు కాదని పునరుద్ఘాటించారు. అసెంబ్లీకి పంపిన ముసాయిదాలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. లోపాలను ఎత్తి చూపేందుకే మూడు వారాల గడువు కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై తుది నిర్ణయాధికారం పార్లమెంట్‌కే ఉంటుందని కేంద్ర మంత్రులు చెబుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఆ అధికారం పార్లమెంట్‌కే ఉన్నప్పుడు నేరుగా బిల్లును అక్కడే పెట్టుకోవచ్చు గదా అన్నారు.
nallari విభజనపై కేంద్రం తన అభిప్రాయాలు చెప్పకుండా అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరడంలో అర్థం లేదు. ఏ అంశంపై అసెంబ్లీ అభిప్రాయం చెప్పాలి? అని తన పాత ప్రశ్ననే మళ్లీ సంధించారు.

బిల్లులోని లోపాలకు రాష్ట్రపతి తప్పులేదన్న సీఎం.. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతిని మోసం చేసినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. విభజనపై అసెంబ్లీకి ఎలాంటి అధికారం లేనపుడు సభలో ఓటింగ్‌కు విభజనవాదులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల గడువు పొడిగిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. చూద్దాం. ఏం జరుగుతుందో అన్నారు. అనేక లోపాలున్న ముసాయిదా బిల్లును తాము తిరస్కరిస్తున్నామని, ఈ బిల్లును పార్లమెంట్‌కు పంపించవద్దని రాష్ట్రపతిని కోరుతున్నామని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని, సభలో ఓటింగ్ జరపాలని కోరుతూ అసెంబ్లీ ఫార్మాట్‌లో స్పీకర్‌కు అఫిడవిట్లను అందజేశామని, మిగిలిన ఒకరిద్దరు త్వరలోనే అఫిడవిట్లు సమర్పిస్తారని చెప్పారు. బిల్లుపై 86 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చర్చిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. విభజన బిల్లుపై 9,024 సవరణలు వచ్చాయని, సభ్యులందరూ మాట్లాడాల్సి ఉందని అన్నారు. ఇతర రాష్ర్టాల విభజన సందర్భంగా అక్కడి పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలు వేరని అన్నారు. ఏకాభిప్రాయంతోనే అక్కడ కొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాయని, ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

సమగ్రంగా రూపొందించి, పార్లమెంట్‌లో ఆమోదం కోసం సిద్ధం చేసిన బిల్లు మాత్రమే రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి రావాలని అభిప్రాయపడ్డారు. డ్రాఫ్ట్ బిల్లు పంపితే ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు. విభజనకు కారణాలు, లక్ష్యాలు బిల్లులో ప్రస్తావించనే లేదన్నారు. ఆస్తులు, ఖర్చులు వివరాలు లేవన్నారు. విభజనతో ప్రజలకు జరిగే లాభాలు, ఖర్చులు ఎవరు భరిస్తారు? అన్న అంశాలు లేవన్నారు. ఖర్చులను కేంద్ర భరిస్తుందా? రాష్ట్రం భరించాలా? అన్నది బిల్లులో లేదని చెప్పారు. ఇది సమగ్రమైన బిల్లు కాదని కిరణ్ తేల్చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లును యథాతథంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సవాల్ చేస్తున్నా. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అడ్మిట్ కాదు. ఒకవేళ దానిని పార్లమెంటు స్వీకరిస్తే రాజకీయల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ, కౌన్సిల్ ద్వారా అభిప్రాయాలు చెప్పమన్నప్పుడు సభల్లో చర్చకు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఓటింగ్‌కు ఎందుకు అంగీకరించడం లేదు? అని ఆయన ప్రశ్నలను సంధించారు. విభజన బిల్లుపై చర్చ మరో రోజుతో ముగుస్తుండగా ఇప్పుడే ఈ అంశాలను లేవనెత్తడమేమిటి? అని ప్రశ్నించగా.. సీఎం సుదీర్ఘంగా జవాబిచ్చారు. అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చిన రోజు నాకు ఆరోగ్యం బాగాలేక సభకు రాలేదు. కొద్దిగా ఆలస్యమైతే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు నానా యాగీ చేశారు.

దీంతో హడావుడిగా బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. మీ సీఎం మంచోడు కాబట్టి బిల్లు వచ్చిన రోజునే సభలో పెట్టారు. మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ విభజన అప్పుడు నేను అడ్వకేట్ జనరల్ సలహా కోసం 15 రోజులు బిల్లును ఆపాను అని ఆ సందర్భంగా దిగ్విజయ్ చెప్పిన విషయం మీడియాకు తెలుసు. విభజన బిల్లులోని లోపాలను గుర్తించేందుకు కొంత సమయం పట్టింది. ఆ లోపాలపై క్లాజ్‌ల వారీగా సవరణ కోరుతూ కేంద్రానికి లేఖలు పంపించాం. లోపాలున్న బిల్లును తిరస్కరిస్తున్నాం. చర్చకు మరింత గడువును కోరుతున్నాం అని కిరణ్ వివరించారు. ఉత్తరప్రదేశ్ విభజన సందర్భంగా 33 సవరణలు, బీహార్‌లో 370 సవరణలు, ఆంధ్రప్రదేశ్‌లో 9,024 సవరణలు వచ్చాయన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఓటింగ్ జరగాల్సి ఉందన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల గడువును పెంచాలని కోరుతున్నామని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష ఎప్పటి నుంచి చేస్తున్నారు అని ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. రాజ్యసభ ఎన్నికల్లో రెబల్స్‌ను పోటీ నుంచి విరమించుకోవాలని మీరు కోరుతున్నారా? అని ప్రశ్నించగా తప్పకుండా కోరుతాను అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. దీనిపై మరికొన్ని ప్రశ్నలు వేయగా కథ ఇంకా మొదలు కాలేదు.. తొందరెందుకు? అన్నారు. వంతెన వచ్చినప్పుడు దానిని ఎలా దాటుతామో చూడండి అన్నారు.

రాజ్యసభ రెబల్స్ అంశం కన్నా రాష్ట్ర విభజన అంశమే వేయిరెట్లు సీరియస్ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని, కేబినెట్‌లో భిన్న వాదనలు వచ్చాయని చెప్పారు. మొదటి ఎస్‌ఆర్‌సీ ద్వారా రాష్ట్ర విభజన జరిపితే ఇప్పుడున్న పరిస్థితుల కన్నా మెరుగైన అభివృద్ధి సాధించేలా ఉండాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించాలని ఎంపీలను కోరుతారా? అని ప్రశ్నించగా అసలు ఈ బిల్లు పార్లమెంట్‌లో అడ్మిట్ కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ, పార్లమెంట్ నిబంధనలు, మ్యాన్యువల్స్ అన్నీ క్షుణ్ణంగా చదివిన తరువాతే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ అంశాలపై పరిజ్ఞానం పెంచుకునేందుకు కేంద్ర లైబ్రరీల్లో ఉన్న నిబంధనల పుస్తకాలను చదువుకోవాల్సిందిగా ఆయన మీడియాకు సూచించారు. మీకు పార్టీ కావాలా? ప్రజలు కావాలా? అన్న ప్రశ్నకు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి. నేను సీమాంధ్రకు పరిమితం కాదు అని కిరణ్ సమాధానమిచ్చారు. విభజనపై సభలో చర్చ జరగాలి, ప్రతి ఎమ్మెల్యే మాట్లాడాలి అన్నదే తన అభిమతమన్నారు. సభా నాయకుడిగా, సీఎంగా తాను లేఖలు రాశానని చెప్పారు. కేబినేట్ నిబంధనలు తెలియని వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు. సభా నాయకుడిగా నా నిర్ణయాలను చెప్పాల్సిన అవసరం ఉండదు. కేబినేట్ నిర్ణయాలను విభేదించే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి మాట్లాడాలి అని ఆయన ఘాటుగా అన్నారు.

878
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.