ఇదేనా సీమాంధ్ర సంస్కృతి

 సమైక్య ఆందోళనకారులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఫ్లెక్సీకి తిరుపతిలో సమాధి కట్టడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. సమాధి కట్టినవారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా పేరిట గుళ్లలో పూజలు నిర్వహించి, చిత్రపటాలకు దిష్టి తీశారు.

సోనియా ఫ్లెక్సీకి సమాధి కడితే స్పందించవా?:ఎంపీ పొన్నం
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ భిక్ష మీద ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్డి తన సొంత జిల్లాలో సీమాంధ్ర ఉద్యమనేతలు సోనియాగాంధీ ఫ్లెక్సీకి సమాధి కడితే 24 గంటలు గడిచినా ఎందుకు స్పందించడం లేదని ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. చిత్తూరులో జరిగిన నిరసనపై సీఎంకు చీమూనెత్తురు లేక స్పందించడం లేదా లేక వారితో కుమ్మక్కయ్యాడా అని ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు సంస్కారహీనులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు

సోనియాకు సమాధి కట్టిన వారి శిక్షించాలి: దానం
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు ఉద్యమకారులు ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించలేదని, అదే సమైక్యాంధ్ర వాదులు పిచ్చి చేష్టలతో నేతలను అగౌరవపరుస్తున్నారని మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో సోనియాగాంధీ సమాధి కట్టిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాధి కట్టినందుకు నిరసనగా బుధవారం నెక్లెస్‌రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో సోనియాగాంధీ పేరుమీద పూజలు నిర్వహించి, ప్లెక్సీకి గుమ్మడికాయతో దిష్టితీశారు. సమాధి కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశానని తెలిపారు.

కర్మకాండలు చేసిన వారిని కఠనంగా శిక్షించాలి: పొంగులేటి
సోనియాగాంధీ దిష్టి బొమ్మకు తిరుపతిలో సమాధి కట్టి కర్మ కాండలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌డ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, డీజీపీ ప్రసాదరావును కలిసినట్లు ఆయన తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే మిత్రసేనతో కలిసి అసెంబ్లీ ఆవరణలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21న ఖమ్మంలో నిర్వహించబోయే కాంగ్రెస్ సభను వాయిదా వేసినట్లు తెలిపారు.

మీ నిర్లక్ష్యంతోనే దిష్టి బొమ్మకు సమాధి: రాపోలు
హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టి బొమ్మకు సమాధి కట్టి అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ బుధవారం లేఖ రాశారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటివి జరగడంపై ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. మీ నిర్లక్షం వల్లనే పార్టీ అధ్యక్షురాలిపై విలువలు లేకుండా సమైక్యవాదులు ప్రవర్తిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.

ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? :చిరంజీవి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీ దిష్టి బొమ్మకు తిరుపతిలో సమాధి కట్టడాన్ని కేంద్రమంత్రి కే చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఈ దురగతానికి పాల్పడిన దుండగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలను పూజించే మన దేశంలో.. ఇలాంటి చర్యల ప్రతి భారతీయడు తలదించుకునే విధంగా సమైక్య వాదం ముసుగులో కొంత మంది సోనియాగాంధీని హేయంగా చిత్రీకరించడం భావ్యం కాదన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.