ఇదేం బాదుడు!

cementసిమెంటు ధరల్లో భారీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు తగ్గించేందుకు నడుం కట్టింది. సోమవారంనాడు కంపెనీ యజమానులతో సామరస్యపూర్వక పరిష్కారానికి చర్చలు ప్రారంభించింది. వర్షాకాలం ముంగిట్లో పెంపునకు దారి తీసిన పరిస్థితులేమిటన్న విషయమై ఆరా తీసింది. మొదట తగ్గింపునకు ససేమిరా అన్న యాజమాన్యాలు చివరికి కొద్ది రోజుల వ్యవధి కావాలని కోరాయి. ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉందని వాదించాయి. తగ్గింపు ఏకపక్షంగా అమలు చేయలేమని, తమ అసోసియేషన్‌లో చర్చించుకుంటామని చెప్పాయి. ప్రభుత్వం చర్చలతో సానుకూల ఫలితాలను ఆశిస్తోంది. దేశంలో అత్యధిక ఉత్పత్తి రాష్ట్రంలోనే జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కంపెనీలు పక్కకు పెట్టలేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జనవరిలో బస్తా సిమెంటు ధర రూ.180 నుంచి 200ల మధ్య పలికింది. ఇప్పుడు అది రూ.300 నుంచి రూ.310 వరకు పెరిగింది. అయితే ఈ పెంపు దేశవ్యాప్తంగా ఉంది. వినియోగదారులు గగ్గో లు పెట్టడంతో రాష్ట్రప్రభుత్వం ఈ విషయమై దష్టి సారించింది. కంపెనీల యాజమాన్యాలతో సోమవారం చర్చలు ప్రారంభించింది.

సచివాలయం సీ బ్లాక్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతత్వంలో అధికారుల బందం చర్చలను ప్రారంభించింది. భారీగా ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ధరలను వెంటనే తగ్గించాలని యాజమాన్యాలకు సూచించింది. ఐతే ఇప్పటికిప్పుడు తగ్గించలేమని కొన్ని కంపెనీలు చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ సూచనలను దష్టిలో ఉంచుకుని తమకు నాలుగు రోజులు గడువు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏ కంపెనీకి ఆ కంపెనీ ఏకపక్షంగా వెళ్లలేము కాబట్టి తమ అసోసియేషన్‌లో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ చర్చలకు ప్రధాన కంపెనీలు ముఖం చాటేశాయి. పలు కంపెనీలు యాజమానులకు బదులు ఉద్యోగులనే పంపినట్టు తెలిసింది.

ప్రభుత్వ సూచనలను వారి యాజమాన్యాలకు చేరవేసే ప్రక్రియ మాత్రమే ప్రస్తుతం కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.చర్చల ప్రక్రియపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ చర్చలకు ఇది ఆరంభం మాత్రమేనన్నారు. గతంలోనూ ధరల అంశంపై ప్రభుత్వాలు కంపెనీలతో చర్చించిన దాఖలాలు అనేకం ఉన్నాయని చెప్పారు. కంపెనీలు కూడా సానుకూల దక్పథంతో ముందుకొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సిమెంటు రంగానికి సంబంధించిన అనేక కంపెనీలు మన రాష్ట్ర పరిధిలోనే ఉండడంతో ప్రభుత్వంతో ఉండే అవసరాల దష్ట్యా యజమానులు ఎంతో కొంత దిగి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పైకి మాత్రం పేద మాటలు…

ప్రభుత్వంతో చర్చలు జరిపిన తీరుపై టీ మీడియా పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఆరా తీసింది. ధరల తగ్గింపు పట్ల వారిలో సానుకూలత పెద్దగా కనిపించడం లేదు. పేరుమోసిన ప్రధాన కంపెనీలు కూడా చర్చలకు హాజరు కాలేదని తెలిసింది. తమకు ప్రభుత్వం నుంచి సమాచారం అందలేదని కొందరు మేనేజింగ్ డైరెక్టర్లు చెప్పారు. ఆహ్వానిస్తే తప్పక హాజరయ్యే వారమన్నారు. ప్రస్తుతం ధరల తగ్గింపు ప్రసక్తే లేదని వారంటున్నారు. ఇటీవలే పాణ్యం, కోరమండల్, బీమా వంటి అనేక పరిశ్రమలు నష్టాలతో మూతపడ్డాయని ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు.

తమ రంగం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వాలు అమ్మకం పన్నులు, వాణిజ్య పన్నులు, వ్యాట్ వంటి వాటిలో మినహాయింపులు ఇవ్వరని.. లాభాలొచ్చినా, నష్టాలొచ్చినా తాము అదే తీరున పన్నులు చెల్లిస్తున్నామని చెప్పారు. ముడి సరుకుల ధరలు, రవాణా చార్జీలు రెట్టింపయ్యాయిపభుత్వం నుంచి ఎలాంటి సాయం అందనప్పుడు, కంపెనీలు అప్పుల పాలై మూత పడే సమయమొచ్చినప్పుడు ధరల పెంపు అనివార్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సిస్టం కింద అన్ని కంపెనీలు బలహీన వర్గాల గహాల నిర్మాణానికి తగ్గింపు ధరకే సిమెంటు సరఫరా చేస్తున్నామని చెప్పారు.

దేశంలో అగ్రగామి

సిమెంటు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు అగ్రగామిగా ఉన్నాయి. ఇక్కడి ఉత్పత్తులే కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే కంపెనీలు వాటి సామర్ధ్యానికి తగ్గట్లుగా ఉత్పత్తి చేయకుండా కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తూ ధరలు తగ్గకుండా మార్కెట్‌ను అనుకూలంగా మలుచుకుంటున్నాయి. 2004-09 మధ్య కాలంలో గహ నిర్మాణం, జలయజ్ఞం సాగుతోన్న రోజుల్లోనే సిమెంటు కంపెనీల ఉత్పత్తి సామర్ధ్యం 60 మిలియన్ టన్నులు కాగా 42 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి చేశారు. సాధారణ సమయాల్లో కేవలం 25 మిలియన్ టన్నులే ఉత్పత్తి జరుపుతున్నారు. సామర్ధ్యానికి తగ్గట్లుగా ఉత్పత్తి చేయకుండా గిట్టుబాటు కావట్లేదని గగ్గోలు పెట్టడం హేతుబద్ధంగా లేదని నిర్మాణ రంగ యాజమాన్యాలు అంటున్నాయి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.