ఇటలీ.. తస్మాత్ జాగ్రత్త!

PM
– ఇద్దరు నావికులను తిరిగి పంపాల్సిందే
– లేకపోతే తీవ్ర పరిణామాలు
– ఇటలీకి ప్రధాని మన్మోహన్ హెచ్చరిక
– ఇది శత్రుపూరిత చర్యే: జైట్లీ
ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చిచంపిన కేసులో నిందితులైన తమ దేశ నావికులను భారత్‌కు తిరిగి పంపేందుకు నిరాకరిస్తున్న ఇటలీ తీరుపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసు విచారణ కోసం వారిని తిరిగి పంపకపోతే దౌత్య సంబంధాలపరంగా తీవ్ర పరిణామాలుంటాయని ఇటలీని హెచ్చరించారు. ఇటలీ నావికుల విషయమై పార్లమెంటు బుధవారం దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఉభయసభల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ అంశంపై గట్టి ప్రకటన చేశారు. నిందితులైన నావికులు మాసిమిలియనో లాతోర్, సాల్వతోర్ గిరోనె భారత్‌కు పంపకూడదన్న ఇటలీ నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. కేరళ తీరంలో ఇద్దరి జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ నావికులైన మాసిమిలియనో లాతోర్, సాల్వతోర్ గిరోనె విచారణ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతితో వారు గత ఫిబ్రవరి 22న ఇటలీకి వెళ్లిపోయారు. ఈ నెల 22లోగా తిరిగి వారిని భారత్‌కు అప్పగిస్తామని భారత్‌లోని ఇటలీ రాయబారి డానియెల్ మాన్సిని హామీనివ్వడంతో సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు అనుమతించింది. అయితే వారిని తిరిగిపంపకూడదని ఇటలీ నిర్ణయం తీసుకోవడంతో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఇటలీ గౌరవించి.. నిందితులను తిరిగి పంపాల్సిందేనని, వారిని వెనక్కిరప్పించేందుకు అన్ని దౌత్యపరమైన మార్గాల్లోనూ ప్రయత్నిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. కాగా, సుప్రీంకోర్టుకు తామిచ్చిన హామీపై వెనక్కితగ్గలేదని, ఈ అంశంపై పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తునామని భారత్‌లోని ఇటలీ రాయబారి మాన్సిని తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఇటలీ నిలబెట్టుకోకపోతే ఆ దేశ రాయబారిని పిలిపించి నిరసన తెలుపుతారా? అన్న ప్రశ్నకు ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ మంత్రి రంజన్ మతాయ్ తెలిపారు.శత్రుపూరిత చర్యే: జైట్లీ నోట బాండ్ డైలాగ్
నిందితులైన నావికులను ఇటలీ భారత్‌కు తిరిగిపంపొద్దని నిర్ణయం తీసుకోవడం శత్రుపూరిత చర్య అవుతుందని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ తెలిపారు. ఆయన బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘ఒక్కసారి అయితే పొరపాటు, రెండోసారి అయితే యాదృచ్ఛికం, మూడోసారి కూడా జరిగితే అది శత్రుపూరిత చర్యే’’ అంటూ జేమ్స్‌బాండ్ సినిమా డైలాగ్‌ను ఆయన ఉటంకించారు. భారత్‌లోని ఇటలీ రాయబారిపై చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఇటలీ నావికులను వెనక్కిపిలిపించి విచారించడం తప్ప ఎలాంటి ప్రతిపాదనకు భారత్ తలొగ్గరాదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ సూచించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.