తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి
బడ్జెట్ సమావేశాలప్పుడు ‘చలో అసెంబ్లీ’
‘ఎమ్మెల్యేలను గ్రామాలకు రానీయొద్దు’
నినాదంతో నియోజకవర్గాల్లో సభలు
టీ జేఏసీ ప్రోగ్రామ్స్ కమిటీ సమావేశం
నిర్ణయం
– కేంద్రంపై ఒత్తిడి
– బడ్జెట్ సమావేశాలప్పుడు ‘చలో అసెంబ్లీ’
– ‘మంవూతులు, ఎమ్మెల్యేలను గ్రామాలకు రానీయొద్దు’ నినాదంతో నియోజకవర్గాల్లో సభలు
తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయాలని టీజేఏసీ నిర్ణయించింది. శనివారం జేఏసీ కార్యాలయంలో ప్రోగ్రామ్స్ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ కన్వీనర్ కే రఘు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు సీవి అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఆదివారం జరుగనున్న టీజేఏసీ విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను రూపొందించారు. తెలంగాణ కోసం ఇప్పటి వరకు అనేక రూపాల్లో ఉద్యమాలను నిర్వహించిన నేపథ్యంలో కేంద్రంపై మరింత ఒత్తిడిని పెంచే విధంగా భారీ కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు తీవ్రమైన ఉద్యమ కార్యక్షికమాలను తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ, కర్నూల్ జాతీయ రహదారులను దిగ్బంధించాలని నిర్ణయించారు.
అయితే తేదీలను ఆదివారం జరుగనున్న భేటీలో చర్చించి ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ‘చలో అసెంబ్లీ’ కార్యక్షికమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాల షెడ్యూల్ విడుదలైన వెంటనే ‘చలో అసెంబ్లీ’ తేదీలను ఖరారు చేయనున్నారు. ‘తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాలకు రానీయొద్దు’ అన్న నినాదంతో వారి నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించడం ద్వారా వారిని ప్రజల్లో ఎండగ కార్యాచరణను తీసుకోనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం ఖరారు చేయనున్నారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా జేఏసీలు, జేఏసీ భాగస్వామ్య పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్షికసీలతోపాటు సీపీఐ నాయకుల సూచనలు, ప్రతిపాదనలను తీసుకొని ఉద్యమ కార్యాచరణకు తుది రూపం ఇవ్వాలని నిర్ణయించారు.
కేంద్రంపై ఒత్తిడే లక్ష్యం : కోదండరాం
కాంగ్రెస్‌పై ఒత్తిడిని తీవ్రతరం చేసే దిశగా ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు కోదండరాం తెలిపారు. కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. మోసాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా డెడ్‌లైన్‌ను విధించుకొని, తిరిగి తనకు తానుగా డెడ్‌లైన్‌ను పొడిగించుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి శంకర్రావు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని గట్టిగా నిలదీసినందుకే ప్రభుత్వం శంకర్రావును దుర్మార్గ పూరితంగా అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. శంకర్రావు పట్ల దుర్నీతితో వ్యవహరించిన ప్రభుత్వం.. సీమాంధ్ర నాయకులను అరెస్టుల నుంచి మినహాయింపునివ్వడం, రక్షణ కల్పించడం, నోటీసులు ఇచ్చి మర్యాదగా వ్యవహరిస్తోందని కోదండరాం అన్నారు. శంకర్రావు దళితుడు కావడం వల్లనే, ముఖ్యమంవూతిని విమర్శించడం వల్లే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్సింగ్లకు కోదండరాం కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం జరుగనున్న జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.