ఇక తేలుస్తాం…

 

digvijay-singh – వారం పది రోజుల్లో ప్రత్యేక కోర్ కమిటీ
– రాహుల్ హాజరవనున్న కీలక సమావేశం
– సీఎం, డిప్యూటీ, పీసీసీ చీఫ్‌కూ ఆహ్వానం
– తెలంగాణపై ఇక డెడ్‌లైన్లు లేవని స్పష్టీకరణ
– చర్చలు ముగిశాయి.. నిర్ణయమే మిగిలిందని వ్యాఖ్య
– డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటన
– సర్దుకుపోవాలంటూ సీమాంధ్ర నేతలకు సూచనలు
– నిర్ణయం ఏదైనా పార్టీ నేతలంతా కట్టుబడాలని ఆదేశం
– రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి నర్మగర్భ వ్యాఖ్యల వెనుక?
– తెలంగాణపై సానుకూలతే అంటున్న విశ్లేషకులు
దశాబ్దాల డిమాండ్.. కోట్ల మంది జనం ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అతి త్వరలో సాకారం కానుందా? ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన తెలంగాణ అంశానికి కేంద్రం కొద్ది రోజుల్లో పరిష్కారం చూపనుందా? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకుని, మొదటిసారి ఆ హోదాలో రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ పర్యటన సుడిగాలిని తలపించింది. ఉదయం నుంచి రాత్రి వరకూ బిజీబిజీగా గడిపిన డిగ్గీరాజా.. వివిధ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ విషయంలో సానుకూల నిర్ణయానికే వచ్చేటట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వరుస భేటీలతో దిగ్విజయ్ క్షణం తీరికలేకుండా గడిపారు. తొలుత పీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. అనంతరం సీమాంధ్ర నేతలతో, తెలంగాణ ప్రాంత నాయకత్వంతో విడివిడిగా సమావేశమయ్యారు. తర్వాత జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అది ముగించుకున్నాక సుదీర్ఘంగా సాగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. తర్వాత కూడా తన సమావేశాల పరంపరను కొనసాగిస్తూ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. వ్యక్తిగతంగా తనను కలిసేందుకు వచ్చిన పలువురు నేతలతో, వివిధ ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీ నాయకత్వంతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీ సుబ్బిరామిడ్డిని కూడా కలిశారు. ఈ సమావేశాలు జరిగిన దాదాపు ప్రతి చోటా ఆయన నర్మగర్భంగానే మాట్లాడినట్లు కనిపించినా.. తెలంగాణపై సానుకూలతే కనిపించిందని అంటున్నారు.

cm04 పీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడిన దిగ్విజయ్.. తెలంగాణపై అధిష్ఠానం కచ్చితమైన నిర్ణయం తీసుకోబోతున్నదని, ఇందుకోసం వారం పది రోజుల్లో ప్రత్యేకంగా తెలంగాణ అంశంపైనే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగనుందని వెల్లడించారని సమాచారం. నిర్ణయం ఎలా ఉన్నా.. అటు సీమాంధ్ర నేతలు, ఇటు తెలంగాణ నాయకత్వం అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని నేతలకు విస్పష్టంగా చెప్పారని తెలిసింది. కుటుంబం విడిపోతేనే కొన్ని సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళతారని చెప్పిన దిగ్విజయ్.. రాష్ట్రం విడిపోవడం అంటే సమస్యలు ఎక్కువే ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు అంశాన్ని ఈ సందర్భంగా దిగ్విజయ్ ప్రస్తావించడం విశేషం. ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు అనంతరం తలెత్తిన పర్యవసానాలను తాను చూశానని, అవి ఇక్కడ రాకూడదన్నదే తన అభివూపాయమని చెప్పడం ద్వారా.. కాంగ్రెస్ వైఖరిని ఆయన చూచాయగా వెల్లడించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. విలేకరుల సమావేశంలో కూడా దిగ్విజయ్ ఈ మేరకు క్లారి‘టీ’ ఇచ్చారన్న చర్చ జరుగుతున్నది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం లేదా.. విడగొట్టి తెలంగాణను ఏర్పాటుచేయడం.. తమ ముందు ఈ రెండు మార్గాలే ఉన్నాయని చెప్పడం ద్వారా ఇతర ప్రచారాలను ఆయన విస్పష్టంగా తోసిపుచ్చారని అంటున్నారు. రాయల తెలంగాణ గురించి విలేకరులు ప్రస్తావించగా.. ఆ వదంతులను తానూ విన్నానని అనటం గమనార్హం. దీంతో ఇన్నాళ్ళుగా ప్రచారం అవుతున్న రాయల తెలంగాణ, ప్యాకేజీ అంశాలు పూర్తిగా మరుగునపడ్డ విశ్లేషణలు వస్తున్నాయి. అన్నింటికి మించి డిసెంబర్ 9 ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని, ఆ ప్రకటనలో భాగంగానే ప్రస్తుత ప్రక్రియ నడుస్తున్నదని చెప్పడాన్ని, రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానంతో నిమిత్తం లేకుండానే రాష్ట్రాన్ని విభజించేందుకు లేదా సమైక్యంగా ఉంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడాన్ని పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నెల మొదటి పక్షంలోనే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుందని ప్రకటించిన దిగ్విజయ్‌సింగ్.. ఆ సమావేశం తెలంగాణపై తేల్చేందుకేనని చెప్పడమే కాకుండా.. దానికి యువనేత, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా హాజరవుతారని పేర్కొనడం విశేషం.

తొలుత పీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కోర్‌కమిటీకి రోడ్‌మ్యాప్‌తో సీఎం, పీసీసీ చీఫ్‌లను రావాల్సిందిగా కోరిన దిగ్విజయ్.. అనంతరం తనను తెలంగాణ నేతలు కలిసి.. తమ ప్రాంతానికి చెందిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను కూడా ఆహ్వానించాలని చేసిన విజ్ఞప్తి అప్పటికప్పుడే సమ్మతించడం గమనార్హం. సీమాంవూధకు చెందిన సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రమే కోర్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా వెళితే.. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించే వారు ఉండరని భావించిన టీ మంత్రులు చేసిన ప్రతిపాదనను వెంటనే దిగ్విజయ్ అంగీకరించడం విశేషం. మరోవైపు తనను కలిసిన సీమాంధ్ర నాయకులతో కూడా నిర్ణయం ఏదైనా కట్టుబడి ఉండాల్సిందేనని, సర్దుకుపోవాల్సిందేనని చెప్పడం అటు సీమాంధ్ర నాయకత్వంలో కలకలం రేపింది. ఇన్ని వాయిదాలు, ఇన్ని ఉల్లంఘనల అనంతరం కాంగ్రెస్ సానుకూల ధోరణి ప్రకటించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్ పెద్దల్లో ఈ మార్పు వచ్చినట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయని పలువురు అంటున్నారు.

2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి అత్యధిక లోక్‌సభ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడంతో కేంద్రంలో రెండు సార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. మూడోసారి ఇదే విధంగా ఆంధ్రవూపదేశ్‌పై ఆధారపడక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. సీమాంవూధలో పార్టీ స్థితిగతులు ఆధ్వాన్నంగా ఉండగా, తెలంగాణలో మరింత దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాంతంలో పార్టీ బలం పెరిగి.. ఇక్కడ ఎక్కువ సీట్లుసాధించే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దల్లో ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత కాంగ్రెస్‌పార్టీకి ఏర్పడిందని చెబుతున్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యల అంతస్సారాన్ని తాము ఈ కోణంలోనే చూస్తున్నామని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీని కాంగ్రెస్ నాయకత్వం ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అధిక సంఖ్యలో లోక్‌సభ సీట్లను గెలుచుకోవాలంటే తెలంగాణపై నిర్ణయం తీసుకోక తప్పని స్థితి కాంగ్రెస్‌కు ఉందని అంటున్నారు. సంఖ్యాపరంగా యూపీఏ-3 ఏర్పాటుపై ప్రభావం చూపగల ఈ అంశాన్ని అందుకే ముగించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. దిగ్విజయ్‌సింగ్ చేసిన నర్మగర్భవ్యాఖ్యలు ఈ క్రమంలోనివేనని చెబుతున్నారు.

మధ్యవూపదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయినప్పుడు ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నది దిగ్విజయ్‌సింగే. ఆ అనుభవం ఆంధ్రవూపదేశ్ విభజనకు ఉపకరిస్తుందని భావించే ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిందన్న వాదన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని సమస్యలు అనివార్యమంటున్న దిగ్విజయ్.. రాష్ట్ర విభజనపై ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కొనాలి? అన్న అంశంపై ప్రెజెం కూడిన రోడ్‌మ్యాప్ తయారు చేసుకుని రావాలని సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లను ఆదేశించడం తెలంగాణపై సత్వర నిర్ణయానికి మరో స్పష్టమైన సంకేతమని అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తన 12 సంవత్సరాల ఉద్యమ కల ఫలిస్తుందని, తన జీవితాశయం నెరవేరుతుందని చెబుతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ప్రస్తుత పరిణామాలపై కొంత సానుకూలంగానే ఉన్నా.. పార్లమెంటులో ఈ మేరకు బిల్లు పెట్టేదాకా కాంగ్రెస్‌ను నమ్మలేమని స్పష్టం చేస్తున్నారు.

దిగ్విజయ్ పర్యటన పరిణామాల నేపథ్యంలో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తదితరులతో జరిగిన సమావేశంలో.. ఒకవేళ తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. విలేకరులతో మాట్లాడిన కేకే కూడా ఇదే సంకేతం ఇవ్వడం గమనార్హం. తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే తెలంగాణ ప్రకటన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటూ టీ కాంగ్రెస్ నేతలు ఆదివారం నాడు నిజాంకాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ముక్తకం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని కూడా టీ నేతలు చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో ప్రజల్లో, పార్టీ నాయకుల్లో విశ్వాసం కల్పించేందుకు అధిష్ఠానానికి కూడా వేరే మార్గం కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ దిశలోనే తాను నివేదిక అందించేందుకు ఆయా వర్గాల నుంచి తీసుకున్న సమాచారం, చర్చల సరళిని క్రోడీకరించుకునేందుకు దిగ్విజయ్ సోమవారం రాత్రి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకుని సవివరమైన నివేదిక పార్టీ అధిష్ఠానానికి అందజేయనున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.