-ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ కూటమి హవా
-తెలంగాణలో జయకేతనం.. సీమాంవూధలోనూ ఈయూదే పైచేయి
– 27న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. ఆ తర్వాతే తుది ఫలితాలు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ)-ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) కూటమి హవా సాగింది. విజయఢంకా మోగించింది. తెలంగాణ పది జిల్లాల్లో జయకేతనం ఎగురవేసింది. అటు సీమాంవూధలో కూటమిలోని ఈయూ సత్తా చాటింది. బస్‌భవన్‌లో ఇన్నాళ్లు తిష్టవేసిన నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) పాచికలు ఇటు తెలంగాణలో.. అటు సీమాంవూధలో పారలేదు. ఈయూ దెబ్బకు సీమాంవూధలో ఎన్ఎంయూ కుదేలైంది. టీఎంయూ-ఈయూ కూటమి విజయం దాదాపుగా ఖరారైంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆర్టీసీ కార్మికులు భుజాలకెత్తుకొని ఈ ఎన్నికల్లో చాటిచెప్పారు! బస్ భవన్‌పై తెలంగాణ జెండా రెపపలాడించారు. టీఎంయూ-ఈయూ కూటమికి భారీ మెజార్టీ కట్టబెట్టారు. శనివారం ఉదయం 5గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 6గంటలకు ముగిసింది. కార్మికులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలై.. రాత్రి 11గంటలకు ముగిసింది. టీఎంయూ-ఈయూ కూటమిదే హవా నడిచినట్లు లెక్కింపును బట్టి తేలింది. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఈనెల 27న లెక్కించనున్న నేపథ్యంలో అదే రోజు అధికారికంగా తుదిఫలితం వెలువడనుంది. ఉదయం నుంచే టీఎంయూ నేతలు థామస్‌డ్డి, అశ్వత్థామడ్డిలు హైదరాబాద్ నగరంలోని డిపోలను పర్యటించి ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు.
గుత్తాధిపత్యానికి చెక్
ఆర్టీసీలో ఇప్పటివరకు గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత నాలుగుసార్లు విజయం సాధిస్తూ అధికారాన్ని పొందిన ఎన్ఎంయూకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సకల జనుల సమ్మెలో పురుడుపోసుకున్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ దెబ్బకు కకావికలమైంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ కూటమి విజయంవైపు దూసుకెళ్లింది. తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో టీఎంయూ-ఈయూ కూటమి విజయ దుందుభి మోగించింది. సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలలో ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్ధూర్ యూనియన్ల మధ్య హోరాహోరు పోరు జరిగింది.
రిజియన్ గుర్తింపులో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎన్ఎంయూ అధిక్యంలో ఉండగా, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఎన్ఈసీలో ఈయూ విజయం సాధించింది. రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ పది జిల్లాల్లో టీఎంయూ-ఈయూ కూటమికి 14, 500లకు పైగా ఓట్ల అధిక్యం లభించింది. సీమాంవూధలో ఎన్ఎంయూకు ఈయూ-టీఎంయూ కూటమిపై 2 వేలకు పైగా అధిక్యత లభించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో వచ్చిన అధిక్యంతో ఎంప్లాయీస్ యూనియన్‌కు 12వేలకు పైగా మెజార్టీతో విజయం ఖాయమైందన్న సంకేతాలు వస్తున్నాయి.
తెలంగాణలో కూటమిదే హవా
తెలంగాణలో ఆది నుంచి టీఎంయూ-ఈయూ కూటమి హవా సాగింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, మణుగూరు డిపోల్లో కూటమి విజయకేతనం ఎగరవేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఆరు డిపోలకు బాన్సువాడ మినహా నిజామాబాద్-1,2, ఆర్మూర్, కామాడ్డి, బోధన్ టీఎంయూ కూటమి గెలుపొందింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎనిమిది డిపోల్లో టీఎంయూ కూటమి ఆరు డిపోల్లో విజయం సాధించింది. నారాయణపేట్, మహబూబ్‌నగర్ డిపోల్లో ఎన్ఎంయూ విజయం కైవసం చేసుకుంది. వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట్, షాద్‌నగర్, కల్వకుర్తి, గద్వాల డిపోల్లో టీఎంయూ జయకేతనం ఎగురవేసింది. మెదక్ జిల్లాలోని ఏడు డిపోల్లో సంగాడ్డి మినహా దుబ్బాక, నారాయణఖేడ్, గజ్వేల్, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట డిపోల్లో టీఎంయూ కూటమి విజయం సాధించింది. రంగాడ్డి రీజియన్‌లో టీఎంయూ కూటమి విజయం సాధించింది. రీజియన్‌లో ఆరు డిపోలు, ఆర్ఎం, ఈడీ యూనిట్లలో మెజార్టీ స్థానాలను టీఎంయూ కూటమి వశమయ్యాయి. తాండూరు, పరిగి, హైదరాబాద్-1, 2, పికెట్ డిపోల్లో, ఆర్ఎం, ఈడీ కార్యాలయ యూనిట్లలో టీఎంయూ-ఎంప్లాయీస్ యూనియన్ కూటమి భారీ మెజార్టీతో ఎన్‌ఎంయూపై విజయం సాధించింది. వికారాబాద్ డిపోలో 12 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎన్ఎంయూ ముందజంలో నిలిచింది. నల్లగొండ జిల్లాలో ఏడు డిపోలకు ఆరు చోట్ల టీఎంయూ-ఈయూ కూటమి హవా కొనసాగింది. నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లిలో టీఎంయూ కూటమి గెలుపొందింది. దేవరకొండలో మాత్రం ఎన్ఎంయూ దక్కించుకుంది. కరీంనగర్ జిల్లాలో 11 డిపోలకు తొమ్మిది డిపోల్లో టీఎంయూ కూటమి విజయం సాధించింది.
జోనల్ వర్కుషాపు, ఆర్ఎం, ఈడీ కార్యాలయాల్లో టీఎంయూ గెలిచింది. హుస్నాబాద్, మంథని, వేములవాడ, జగిత్యాల, కరీంనగర్-1, కోరుట్ల, సిరిసిల్ల, గోదావరిఖని, హుజురాబాద్‌తోపాటు రీజినల్ వర్కుషాపు, ఈడీ -ఆర్ఎం కార్యాలయాల్లో టీఎంయూ గెలుపొందింది. ఎన్ఎంయూ మెట్పల్లి, కరీంనగర్-2లో గెలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు డిపోల్లో ఐదు చోట్ల టీఎంయూ గెలిచింది. ఆదిలాబాద్‌లో ఫలితాలు బ్యాలెట్ పోస్టల్‌పై ఆధారపడి ఉండటంతో ఈనెల 28న గెలుపు ఎవరిదో తేలనుంది. భైంసా, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్, నిర్మల్ టీఎంయూ విజయం సాధించింది. వరంగల్ జిల్లాలోని ఎనిమిది డిపోలకు ఆరు చోట్ల టీఎంయూ, ఈయూ కూటమి గెలుపొందింది. జనగాం డిపోలో 15ఓట్లు, మహబూబాబాద్ డిపో 2ఓట్ల ఆధిక్యంతో ఎన్ఎంయూ వియజం సాధించింది.
అయితే ఈ డిపోకు చెందిన రెండు పోస్టల్ ఓట్లు ఈ నెల 29న లెక్కించాల్సి ఉంది. వరంగల్1, 2, హన్మకొండ, పర్కాల, తొర్రూర్, నర్సంపేట డిపోల్లో టీఎంయూ, ఈయూ కూటమి విజయం సాధించింది. హైదరాబాద్ రీజియన్‌లోని 25 డిపోలకు ఇబ్రహీంపట్నం మినహా అన్ని చోట్ల టీఎంయూ కూటమి విజయం సాధించింది. ఆర్టీసీ భవన్‌లోనూ ఐక్యకూటమి గెలుపొందింది. అయితే, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాతనే అధికారికంగా ఫలితాలు తేలనున్నాయి. సీమాంవూధలోనూ ఇదే కూటమి తన హవాను కొనసాగించింది. సీమాంధ్ర నేతల కనుసన్నలో కొనసాగుతున్న యూనియన్లకు ఆర్టీసీ కార్మికులు చుక్కలు చూపించారు. తెలంగాణ వాదాన్ని మరో సారి చాటిచెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ విజయం తెలంగాణవాదుల్లో ఉత్తేజాన్ని నింపింది.
దెబ్బకు రాజీనామా అస్త్రం..
దిమ్మ తిరిగే ఫలితాలతో ఎన్ఎంయూ నేతలు ఖంగుతిన్నారు. ఊహించని రీతిలో టీఎంయూ-ఈయూ కూటమి విజయపథం వైపు నడవడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అంబరాన్నంటిన సంబరాలు..
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ కూటమిల హవా సాగడంలో తెలంగాణ కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో మొదట్నుంచి ఈ కూటమే అగ్రస్థాయిలో నిలిచింది. దీంతో అర్ధరాత్రి దాకా ఆయా డిపో కార్యాలయాల్లో బాణాసంచాలు కాల్చుతూ, మిఠాయిలు పంచుకున్నారు.
కేసీఆర్, హరీశ్‌కు ఈ విజయం అంకితం: టీఎంయూ
‘ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్ఎంయూను మట్టి కరిపించి తెలంగాణవాదానికి పట్టం కట్టిన కార్మికులందరికీ కృతజ్ఞతలు. ఈ విజయాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు, ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్‌రావుకు అంకితమిస్తున్నాం’ అంటూ టీఎంయూ నేత అశ్వద్ధామడ్డి ప్రకటించారు.
ఎన్ఎంయూకు గుణపాఠం: సీపీఐ నేత నారాయణ
ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఎన్ఎంయూకు కార్మికులు గుణపాఠం చెప్పారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు. ఈయూ, టీఎంయూకు అండగా నిలిచిన కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్ఎంయూ సంఘం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ కార్మికుల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. ఈయూ, టీఎంయూ ఐక్య పోరాటంతో అవకాశవాద ఎన్ఎంయూను కార్మికులు ఓడించారని అన్నారు.
కార్మికులందరికీ కృతజ్ఞతలు: హరీశ్‌రావు
‘తెలంగాణ వాదం లేదని ప్రచారం చేసిన ఎన్ఎంయూ కుట్రలను తిప్పికొట్టిన కార్మికులందరికీ ఉద్యమాభివందనాలు. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు సీమాంవూధలోనూ టీఎంయూ-ఈయూ కూటమికి పట్టం కట్టినందుకు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల ముందు సీమాంవూధుల నాటకాలు నడవలేదు. ఈ పలితాలు సీమాంధ్ర నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి’ అని టీఎంయూ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు అన్నారు.