ఇక అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు

 

factory01హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన పారిశ్రామికీకరణను అన్ని జిల్లాలకూ విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రాథమిక సమాచార సేకరణను పూర్తి చేసి ఒక నివేదికను రాష్ట్ర పరిశ్రమల శాఖ రూపొందించింది. ఏఏ జిల్లాల్లో ఏ వనరులున్నాయి? ఏఏ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు అనేది ఆ నివేదికలో పొందుపరిచారు.

ఆయా జిల్లాల్లో లభించే సహజ వనరుల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతోపాటు ప్రభుత్వాదాయం కూడా బాగా పెరుగుతుందని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఖనిజం విస్తారంగా ఉంది. అయిన ఖనిజ ఆధారిత రంగంలో తెలంగాణకు ఇప్పటి దాకా వచ్చే ఆదాయం రూ.171 కోట్లకు మించలేదు. పది జిల్లాలకు పారిశ్రామిక రంగం విస్తరించక పోవడం దీనికి కారణమని అధికారుల అభిప్రాయం. అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అన్ని సహజ వనరులను సమర్థంగా వినియోగించి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించే ప్రణాళికను సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా పరిశ్రమల శాఖ నివేదికను సిద్ధం చేసింది. గతంలో వచ్చిన ఆదాయం, పరిశ్రమల వివరాలతో పాటు ఏఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉందో పూర్తి వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.

factory

రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న అవకాశాలు..

ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి రంగం విస్తరణ, ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సాధిస్తుందన్న విశ్వాసం అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎన్నో కంపెనీలు ఇక్కడ వాటి ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో మిగతా అంశాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నమస్తే తెలంగాణ ఫోకస్.

2013-14లో తెలంగాణకు వచ్చిన రెవెన్యూ

బొగ్గు: ఉత్పత్తి- 50471035 టన్నులు,రెవెన్యూ- రూ.1146.90 కోట్లు.
– లైమ్‌స్టోన్(సిమెంటు ప్లాంట్లు): ఉత్పత్తి- 26367753 టన్నులు, రెవెన్యూ- రూ.128.17 కోట్లు
కలర్ గ్రానైట్: ఉత్పత్తి- 1064083 క్యూబిక్ మీటర్లు, రెవెన్యూ-రూ.162.65 కోట్లు
బ్లాక్ గ్రానైట్: ఉత్పత్తి- 273965 క్యూబిక్ మీటరు, రెవెన్యూ-రూ.23.60 కోట్లు
-మైనర్ మినరల్ నుంచి తెలంగాణకు 2009-10లో రూ.311 కోట్లు, 2010-11లో రూ.353 కోట్లు, 2011-12లో రూ.374 కోట్లు, 2012-13లో రూ.456 కోట్లు, 2013-14లో రూ.480 కోట్లు వంతున ఆదాయం లభించింది.

మన జిల్లాల్లో లభించే ఖనిజాలు

ఖమ్మం: కోల్, ఐరన్ ఓర్, డోలమైట్, క్వార్ట్ బెరైటీస్, కాపర్, గార్నెట్, గ్రాఫైట్, గ్రానైట్, మార్బుల్.
నల్లగొండ: లైమ్‌స్టోన్, క్లే, సోప్‌స్టోన్, క్వార్ట్, గ్రానైట్.
వరంగల్: బొగ్గు, ఐరన్ ఓర్, లాటరైట్, క్వార్ట్, గ్రానైట్.
కరీంనగర్: ఐరన్ ఓర్, లాటరైట్, లైమ్‌స్టోన్, గ్రానైట్.
నిజామాబాద్: గ్రానైట్స్, క్వార్ట్, ఫెల్డ్‌స్పార్.
ఆదిలాబాద్: కోల్, లైమ్‌స్టోన్, మాంగనీసు, క్లే, ఐరన్‌ఓర్.
మహబూబ్‌నగర్: క్వార్ట్, ఫెల్డ్‌స్పార్, లాటరైట్, లైమ్‌స్టోన్, బెరైటీస్.
మెదక్: క్వార్ట్, అమోతైస్ట్, క్లేస్, లాటరైట్, ఫుల్లర్స్ ఎర్త్.
రంగారెడ్డి: క్వార్ట్, ఫుల్లర్స్ ఎర్త్, రెడ్ అండ్ ఎల్లో ఓక్రే, లైమ్‌స్టోన్, గ్రానైట్, శాబాద్ స్లాబ్స్.
ఆయా జిల్లాల్లో పరిశ్రమలకు ఉన్న అవకాశాలు
ఆదిలాబాద్: బొగ్గు దొరికే చోటే విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు. సిమెంటు కంపెనీలకు కూడా అవకాశం.
నిజామాబాద్: మినరల్ ఆధారిత పరిశ్రమలు బ్రిక్స్ తయారీ, సిమెంట్ మోసాయిక్ టైల్స్, వైట్ సిమెంట్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లు, సెరామిక్, కెమికల్ పరిశ్రమలకు అనుకూలంగా ఉంది.
కరీంనగర్: బొగ్గు దొరికే చోట థర్మల్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లు ఏర్పాటు చేయొచ్చు.

మెదక్: ఫెర్రో సిలికాన్ పరిశ్రమలు, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లు, గ్లాస్ తయారీ యూనిట్లు ఏర్పాటుకు అవకాశం.
వరంగల్: థర్మల్ పవర్ ప్లాంట్లకు అవకాశం. గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లు, ైఫ్లె యాష్ బ్రిక్స్, హైడ్రేటెడ్ లైమ్ యూనిట్లు, స్పాంజ్ ఐరన్ ప్లాంట్లు.
రంగారెడ్డి: సిమెంటు ప్లాంట్లు, సెరామిక్ ఇండస్ట్రీస్, గ్లాస్, ఫెర్రో ఇండస్ట్రీస్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లు.

మహబూబ్‌నగర్: గ్లాస్, ఫెర్రో సిలికాన్ ఇండస్ట్రీస్, పల్వరైజింగ్ యూనిట్లు, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్లు, స్టోన్ క్రషింగ్ యూనిట్లు ఏర్పాటు చేయొచ్చు.
నల్లగొండ: యురేనియం రిఫైనింగ్ యూనిట్, సిమెంటు తయారీ కర్మాగారాలు, గ్లాస్ అండ్ ఫెర్రో సిలికాన్ ఇండస్ట్రీస్, గ్రానైట్ కట్టింగ్ పాలిషింగ్ యూనిట్లు, స్టోన్ క్రషింగ్ యూనిట్లు.
ఖమ్మం: విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, హైడ్రేటేడ్ లైమ్ యూనిట్లు, స్పాంజ్ ఐరన్ ప్లాంట్లు, స్టీల్ ప్లాంట్, మార్బుల్, గ్రానైట్ కట్టింగ్ పాలిషింగ్ యూనిట్లు, గ్లాస్ అండ్ అలైడ్ యూనిట్లు.

ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలు

మినరల్ పాలసీలు, ఫీజులపై సర్దుబాటు చర్యలు చేపట్టాలి. ఇసుక రవాణాలోనూ సవరణలు జరుగాలి. అలాగే లీజుల మంజూరులో నిరభ్యంతర పత్రాలు జారీ చేయడంలో రెవెన్యూ అధికారుల అధికారాలపై సమీక్ష జరుగాల్సి ఉంది. రెవెన్యూ భూములైతే 25 హెక్టార్ల వరకు తహసీల్దార్లకు, 25 నుంచి 50 హెక్టార్ల వరకైతే ఆర్డీఓకు, అంత కంటే ఎక్కువైతే జాయింట్ కలెక్టర్‌కు అధికారం ఇవ్వాలి. ఒక వేళ పట్టా భూములతై పట్టాదారు అనుమతితో తహసీల్దార్ ఎన్‌ఓసీ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ సూచిస్తోంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.