ఇందిర పరువు తీశారు!

ఇవాళ చాలా కబుర్లు చెప్పవచ్చుగానీ.. డిసెంబర్ 21 ప్రకటనపై ఆనాడు ఆంధ్రులు మండిపడ్డారు. తిరస్కరించారు. ఆ ప్రకటన చెత్తబుట్టపాలు చేసేదాకా నిద్రపోలేదు. గరీబీ హఠావోతో పేదల దేవతగా, బంగ్లాయుద్ధ విజయంతో అపర దుర్గగా దేశమంతా గడించిన ఇందిర కీర్తిని గంగపాలు చేశారు. పంజాబ్‌లాంటి సమస్యను ధీరోదాత్తంగా ఎదుర్కున్న ఇందిర నోట ఏం చేయాలో అర్థం కావడం లేదు అనే బేల మాటలు వచ్చేలా చేశారు. ఇవాళ ఇందిర ప్రకటనను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న ఆంధ్రులు ఆనాడు ఆ ప్రకటనకు ఇచ్చిన విలువ అది!

పార్లమెంటులో ఇందిర ప్రకటన రాగానే ఆంధ్రనాయకులు ఇందిర మీద మండిపడ్డారు. నోటికొచ్చినట్టు దూషించారు. వీధి ఉద్యమాలకు దిగారు. మరుసటి రోజే (డిసెంబర్ 22) గుంటూరులో జరిగిన సభలో కాకాని వెంకటరత్నం ఇందిరపై నేరుగా దాడి చేశారు. ఆంధ్రులు తలుచుకుంటే కొండమీద కోతిని కూడా దింపుతారు.. నువ్వెంత? అని నేరుగా వార్నింగ్‌లే ఇచ్చారు. అదే రోజు బీవీ సుబ్బారెడ్డి కోయిలకుంట్లలో మాట్లాడుతూ ఇందిర నిర్ణయాన్ని ఆమోదించేది లేనేలేదని ప్రకటన చేశారు. ఇందిర ప్రకటన వెలువడిన మూడో రోజు డిసెంబర్ 24న విజయవాడలో అరాచకం సష్టించారు. ఆరుగంటలపాటు నగరాన్ని స్థంభింపచేసి, విమానాశ్రయాన్ని దిగ్భందించి చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి కాల్పులు జరిపి నలుగురు చనిపోయే స్థాయిలో బీభత్సం సష్టించారు. అదే రోజు రాత్రి కోస్తా ఉద్యమనాయకుడు కాకాని గుండెపోటుతో మరణించారు. మళ్లీ మూడు రోజుల్లోనే డిసెంబర్ 27న అనంతపురంలో బంద్ పేరిట అదేస్థాయి విధ్వంసం.. కేంద్రప్రభుత్వ ఆస్తులన్నీ భస్మీపటలంచేసి, అడ్డువచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి ఓ కానిస్టేబుల్‌ను చంపేశారు.
INDIRaపోలీసు జరిపిన కాల్పుల్లో ఇక్కడ 8మంది మరణించారు. అంతటితో ఆగలేదు. ఇవాళ ఇందిరమ్మ అంటూ కాశీమజిలీ కథలు చెబుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా ఇందిర ప్రకటనను బంగాళాఖాతంలో విసిరేశారు. ఆమె ప్రకటన వచ్చిన 10వ రోజే తిరుపతిలో 108 మంది ఎంఎల్‌ఏలు, 20 మంది ఎంపీలు, 8 మంది జడ్‌పీ చైర్మన్లు మీటింగ్ పెట్టి తిరుగుబాటు చేశారు. ప్రకటన, నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి ఆమె పరువు తీశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా శాసనోల్లంఘన జరపాలని ప్రజలకు పిలుపు ఇచ్చి దేశం కనివిని ఎరుగని బీభత్సకాండకు శ్రీకారం చుట్టారు. ఆనాటినుంచి మొదలైన జైఆంధ్ర ఉద్యమంలో జరిగిన విధ్వంసాలు దేశాన్ని వణికించాయి. తిరుపతి సమావేశం పిలుపుకు తొలుత ప్రతిస్పందించింది ద్రోణంరాజు సత్యనారాయణ. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాష్ట్ర గ్రామోద్యోగుల సంఘం సమ్మెకు దిగింది. మిగిలిన సంఘాలు ఆ వెనకే క్యూ కట్టాయి. పాలన స్థంభించింది. అటు వీధుల్లో అరాచకమూ రాజ్యం చేసింది.
ఇందిర విజ్ఞప్తులు బుట్టదాఖలు..
ఆనాడు ఆందోళనకారుల దాడికి గురికాని రైల్వే స్టేషనే ఆంధ్రలో లేదంటే అతిశయోక్తి లేదు. చివరకు చిన్న రైలు స్టేషన్లను రైల్వేశాఖ మూసేసుకుంది. కొన్ని చోట్ల కేబిన్‌మేన్లు లోపల ఉండగానే బయటినుంచి రైల్వేకేబిన్లు దగ్ధం చేయడంతో డ్యూటీలు వారికి ప్రాణసంకటంగా మారాయి. నిడుబ్రోలులో రైల్వే కేబిన్‌మేన్ సజీవంగా దహనమయ్యాడుకూడా. పోస్టాఫీసులు, తంతి తపాలా కార్యాలయాలు అంతే. చివరకు ఇందిర దయచేసి రైల్వేలు, పోస్టాఫీసులను దగ్ధం చేయకండి. పేదప్రజలకు అవి ఉపయోగపడతాయి వాటి జోలికి వెళ్లవద్దు అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చింది. మరే ఉద్యమ సమయంలో ఏ ప్రధాని ఇలా ప్రకటించాల్సిన పరిస్థితి అంతకు ముందు లేదు. అయితే ఆ ప్రకటనను సీమాంధ్రలు లెక్క చేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో దగ్ధకాండ కొనసాగింది. విజయవాడ రేడియో స్టేషన్‌ను ఆక్రమించి ప్రసారాలు నిలిపివేసిన ఘటనకూడా చోటు చేసుకుంది.
list
ప్రైవేటు ఆస్తులను సైతం ఆందోళనకారులు వదిలిపెట్టలేదు. మాజీ కేంద్రమంత్రి మూర్తి ఇంటిని దగ్ధం చేశారు. వీధికో సేనలు వెలిశాయి. సరిహద్దుల్లో రహదార్లమీద చెక్‌పోస్టులు పెట్టి వాహనానికి ఇంత చొప్పున జై ఆంధ్ర టాక్సులు వసూలు చేశారు. తెలంగాణ మీద ఆగ్రహంతో ఆ ప్రాంతానికి ధాన్యం, పాలు, పెట్రోల్ రవాణాను నిషేధించారు. ఆ వైపు వెళ్లే లారీలను ఎక్కడకక్కడ నిలిపివేసి దోచుకున్నారు. హైదరాబాద్‌లో తయారయ్యే చార్మినార్ సిగరెట్ల వాడకాన్ని నిషేధించారు. ఎవరో కోకాకోలా హైదరాబాద్‌లో తయారవుతుందని చెబితే దాని అమ్మకాలు నిలిపివేశారు. కేంద్రం సీఆర్‌పీ దళాలను రంగంలోకి దింపింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సీమాంధ్ర వీధులన్నీ సీఆర్‌పీ ఆందోళనకారుల హోరాహోరీతో యుద్ధరంగంగా మారాయి. దాదాపు ప్రతిరోజు ఎక్కడోచోట పోలీసుల కాల్పులు సాధారణంగా మారాయి.
రాజీనామాకు సిద్ధపడ్డ ఇందిర…
ఈ దారుణకాండను చూసి కలవర పడ్డ ఇందిర మీ సమస్య పరిష్కారమవుతుందనుకుంటే నేను రాజీనామా చేసి వెళ్లిపోతా అనికూడా ప్రకటించారు. అయితే దాన్నీ ఆంధ్రనాయకులు అవహేళన చేశారు. మీ రాజీనామా ఎవరికికావాలి.. మీరేం చేసుకున్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా ఆంధ్రజాతి విశ్రమించబోదు అని నాటి ఎంఎల్‌సీ కొణజేటి రోశయ్య ఇందిరను ఎద్దేవా చేశారు. ఆంధ్రుల డిమాండ్‌ను కాదంటే ఇందిర నాయకత్వం ఉండదు… కాంగ్రెస్ పార్టీ ఉండదని బీవీ వార్నింగులులిచ్చారు. సీమాంధ్ర మీడియా యాధాశక్తి ఉద్యమానికి ఆజ్యం పోసింది. కాల్పుల్లో మతుల సంఖ్యపైన, సీఆర్‌పీ ఉనికిపైనా చిలవలు పలవలు ప్రచారం చేసింది. కేంద్రప్రభుత్వ ఆస్తులు పోస్టాఫీసులు, టెలికం, రైల్వేలు ఆందోళనకారుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఉద్యమం తీవ్రంగా కొనసాగుతూ వచ్చింది. వివిధ రంగాలనుంచి ప్రముఖులు మద్దతు ఆర్థిక సహాయం అందించడం మొదలైంది. ముఖ్యంగా ఆనాటి మీడియాకు ముఖ్యమంత్రి పీవీ ప్రధాన టార్గెట్‌గా మారాడు. ఆయన నోరు తెరిచినా.. తెరవకున్నా.. ఏదేదో అంటగట్టి పీవీని సీమాంధ్రుల దష్టిలో రాక్షసుడుగా మార్చాయి.
list1
ప్రతిపక్షాలనుంచి కాంగ్రెస్ చేతిలోకి…
తిరుపతి కాంగ్రెస్ సభ ఇచ్చిన సంకేతంతో సీమాంధ్రలో సుదీర్ఘ అరాచకానికి నాంది ప్రస్తావన అయింది. అంతదాకా ప్రతిపక్షాలే ఉద్యమంలో ముందుండగా తిరుపతి సభనుంచి కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని కైవసం చేసుకున్నారు. ఇదేరోజునుంచి రైళ్లమీద దాడులు, రైల్వే స్టేషన్ల దగ్ధాలకు శ్రీకారం చుట్టారు. సభ పిలుపు మేరకు జనవరి 1 బంద్ తీవ్ర హింసకు దారి తీసింది. కష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. నెల్లూరులో పీవీ మద్దతుదారు ఆనం వెంకటరెడ్డి ఇంటిపై జైఆంధ్ర పతాకావిష్కరణకోసం ఆందోళనకారులు, ఎదురుదాడికి ఎమ్మెల్యే వర్గం ఘర్షణకు దిగడంతో జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. మరోవైపు కాంగ్రెస్‌కు పోటీగా ప్రతిపక్షాలు పోరాటాలకు పదును పెట్టాయి. జనవరి 3వ తేదీనాడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టాన్ని విభజించాలని కేంద్రాన్ని కోరారు.
కొత్త మంత్రులను చేర్చుకున్న పీవీ..
ఈలోగా పరిస్థితిని రాజకీయంగా అదుపుచేయడానికి ముఖ్యమంత్రి పీవీ రాజీనామా చేసిన మంత్రుల స్థానాల్లో జనవరి 11న కొత్తగా 8 మందితో మంత్రివర్గ విస్తరణ జరిపారు. ప్రజల ఆకాంక్షలు లెక్కచేయకుండా ఆనం వెంకటరెడ్డి, ముద్దూరు సుబ్బారెడ్డి, వడ్డె నాగేశ్వర రావు, నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి, పీవీ చౌదరి, ఆర్ రాజగోపాలరెడ్డి, సీ దాస్, జీ సోమశేఖర్ పదవులు స్వీకరించారు. అయితే వారి పదవీకాలం 5 రోజులకే ముగిసింది. జనవరి 14నాడు పీవీ వారికి పోర్టుఫోలియోలు కేటాయించారు. అదేరోజు అధిష్టానం దూతగా రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చంద్రజిత్ యాదవ్ ఆంధ్రపాంతంలో ప్రత్యేకరాష్ట్ర డిమాండ్ కన్నా పీవీ నరసింహారావుపై వ్యతిరేకతే ఎక్కువగా ఉందని అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. ఫలితంగా అధిష్ఠానం ఆదేశంతో జనవరి 16న పీవీ ప్రభుత్వం రాజీనామా చేసింది. మరుసటిరోజు రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించారు. గవర్నర్ సలహాదారుగా శరీన్ పరిపాలన చేపట్టారు. పీవీ తొలగింపు ఇచ్చిన ఉత్సాహంతో ఆంధ్రలో హింస మరింత ప్రజ్వరిల్లింది. జనవరి 19న గుంటూరు, నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో కాల్పుల్లో ఐదుగురు, ఆ మరుసటి రోజే గుంటూరులో,తర్వాత రోజు విజయవాడలో కాల్పులు ఈసారి ఆరుగురు మరణించారు.
— ఏడాదికే ఇందిర ప్రకటన వెనక్కి.. రేపు

అంతా వేర్పాటువాదులే!
ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు..
జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిలో నాటి, నేటి ప్రముఖ నేతలు ఎందరో ఉన్నారు. ఇవాళ ఆ నాయకులు, వారి వారసులు సమైక్యాంధ్ర నినాదాలు చేయడం విచిత్రం. నాడు ఉద్యమాల్లో పాల్గొన్న వారిలో ఉద్యమనాయకుడు కాకాని వెంకటరత్నం, బీవీ సుబ్బారెడ్డి, ఎన్‌జీ రంగా, తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, వసంత నాగేశ్వరరావు, పాలడుగు వెంకట్రావు, కొణజేటి రోశయ్య, అనంత వెంకటరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, జూపూడి యజ్ఞనారాయణ, ద్రోణంరాజు సత్యనారాయణ, ఎం. వెంకయ్యనాయుడు, పూసపాటి ఆనందగజపతిరాజు, బైరెడ్డి శేషశయనా రెడ్డి, ఆరేటి కోటయ్య, పిన్నమనేని కోటీశ్వరరావు, సుంకర సత్యనారాయణ, చనుమోలు వెంకట్రావు, ఎడ్లపాటి వెంకట్రావు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కొమ్మారెడ్డి సూర్యనారాయణ, సీ బసిరెడ్డి , సాగి సూర్యనారాయణ రాజు, వాసిరెడ్డి కష్ణమూర్తి నాయుడు, మూర్తిరాజు, కీలారు గోపాలనాయుడు, కందుల ఓబుల రెడ్డి, చెంగల్ రెడ్డి, అగిశం వీరప్ప, మద్దూరు సుబ్బారెడ్డి, ఎన్ రఘురామి రెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, దామోదరం మునుస్వామి, బీ గోపాల్ రెడ్డి, బీ రాజగోపాల్ రెడ్డి, కే.సుబ్బారావు, అప్పలనాయుడు, కుడిపూడి ప్రభాకర్‌రావు, పంతం పద్మనాభం, ఎంఆర్ అప్పారావు, జీవీ రత్తయ్య, ప్రగడ కోటయ్య, తుమ్మల చౌదరి, నన్నపనేని శ్రీనివాసరావు, జీసీ కొండయ్య, అప్పలనాయడు, అప్పన్న దొర, బత్తిని సుబ్బారావు, రేబాల దశరథరామిరెడ్డి, జగ్గయ్య, గుమ్మడి, నార్ల, గోరా, లవణం, చల్లగుల్ల నర్సింహారావు తదితరులున్నారు. రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మరో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా ఆనాడు రాష్ర్టాన్ని విభజించమని చెప్పిన వారే.

This entry was posted in ARTICLES.

Comments are closed.