ఇంకా ఆపుడంటే మూర్ఖత్వమే!

హైదరాబాద్, డిసెంబర్ 15 :తెలంగాణ అంశం ఇపుడు ఆఖరి మెట్టుమీద ఉందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్రం కృతనిశ్చయంతో ఉండడం వల్లనే బిల్లు అసెంబ్లీదాకా వచ్చిందని, ఇది పూర్తయిపోతే మిగిలేది పార్లమెంటు ఆమోదం మాత్రమేనని చెప్పారు. రాష్ట్రపతినుంచి వచ్చిన కమ్యూనికేషన్‌ను తక్షణమే సభ ముందుంచాలని రాజ్యాంగం చెబుతోందని, అందువల్ల సోమవారంనాడే అసెంబ్లీలో తెలంగాణ అంశాన్ని చర్చకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వాయిదా వేయడం, నాన్చడం అంటే అది రాష్ట్రపతిని అగౌరవ పరిచినట్టు కాగలదని హెచ్చరించారు. ఇంతదాకా వచ్చిన తెలంగాణను ఇంకా ఆపుతానని ఎవరైనా భావిస్తే అది పరమమూర్ఖత్వం తప్ప మరొకటి కాదన్నారు.

kcrhavaతెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారని ఆయన పునరుద్ఘాటించారు. ఈ అభిప్రాయం చెప్పడం అనేది అసెంబ్లీకి ఉన్న అవకాశం మాత్రమే తప్ప అది అధికారం కూడా కాదని టీఆర్‌ఎస్ అధినేత అన్నారు. పంజాబ్-హర్యానా విడిపోయినప్పుడు అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోలేదని, రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్‌పీ అత్యవసర సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. గంటన్నరపాటు సాగిన సమావేశంలో సోమవారం అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి.. చర్చను చేప ఎలా ఒత్తిడి తేవాలనే అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. విలేకరుల సమావేశం ఆయన మాటల్లోనే… ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రాష్ట్రపతి నుండి అసెంబ్లీకి వచ్చింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రేపు చర్చను చేప ఒత్తిడి తెస్తారు.

స్పీకర్ కూడా వెంటనే బిల్లును చేసి చర్చను చేపట్టాలి. ప్రస్తుతం ఇంతకు మించిన ముఖ్యమైన అంశం లేదు. చట్టప్రకారం రాష్ట్రపతి సమయం 42 రోజులు సమయం ఇచ్చినందున చర్చను వెంటనే ప్రారంభించాలి. ఇంత సమయం ఎందుకిస్తారంటే బిల్లు పంపినపుడు ఎక్కడన్నా అసెంబ్లీ ప్రోరోగ్ అయిన పరిస్థితి ఉంటే గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడం, స్పీకర్ సభను పిలువడం.. వంటి వాటికి కనీసం ఏడెనినిమిది రోజులు అవుతుందనే ఉద్దేశ్యంతోనే 42 రోజల సమయం ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ నడుస్తోంది కనుక వెంటనే చర్చను చేపట్టాలి. ఈ బిల్లుపై చర్చను చేప బీఏసీ సమావేశం కూడా అవసరం లేదు. ఇది నేను చెప్పింది కాదు.

కౌల్ అండ్ షక్దర్ రాజ్యాంగంలోని చాఫ్టర్‌8లో ‘రాష్ట్రపతి నుండి కమ్యూనికేషన్ వచ్చిన తరువాత స్పీకర్ వెంటనే చేయాలి’ అని ఉంది. ఇతర రూల్స్‌ను సస్పెండ్ చేసి వెంటనే చర్చ చేపట్టాలని ఉంది. రాష్ట్రపతి అంటే హెడ్ ఆఫ్ ది కంట్రీ కనుక వెంటనే చర్చ చేపట్టకుంటే అది రాష్ట్రపతిని అవమానించినట్లే అవుతుంది. రాజ్యాంగాధిపతిని అగౌరవపరిస్తే మనల్ని మనమే అగౌరవపరుచుకున్నట్లు. స్పీకర్‌పై కూడా మేం ఒత్తిడి తెస్తాం. రాష్ట్రాల ఏర్పాటుపై పార్లమెంట్‌కే సంపూర్ణ అధికారం ఉంది. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక బిల్లును ఎప్పుడైనా ఇంగ్లీష్‌లోనే పంపుతరు. అందులో ఏమైనా తప్పులు దొర్లితే ఇక్కడ అభిప్రాయం చెప్పి పంపిన తరువాత కేబినెట్‌లో చర్చించి సవరించి పార్లమెంట్‌లో పెడతారు.

కానీ ఇక్కడ ఏం చేయడానికి లేదు. ఇక్కడ అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంది. అయితే అభిప్రాయం చెప్పే ‘అధికారం’ అసెంబ్లీకి ఏమాత్రం లేదు. మంచిచెడులు చెప్పడానికే ఇక్కడకు వస్తుంది. చాలా కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది. హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు బిల్లును పంజాబ్‌కు పంపనే లేదు. రాష్ట్రపతి పాలన పెట్టి బిల్లు పాస్ చేశారు. బాంబే నుండి గుజరాత్ విడిపోయినప్పుడు బాబూలాల్ పరాటే అనే వ్యక్తి కోర్టును ఆశ్రయిస్తే ఆయన పిటీషన్‌ను కొట్టేశారు. కారణం.. దీనిపై నువ్వుగానీ, మేంగానీ కల్పించుకోవడానికి అధికారం లేదని కోర్టు చెప్పింది. ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాంచల్ విడిపోయినప్పుడు హరిద్వార్ యూపీలోనే ఉండాలని కోర్టుకు పోతే.. ఏది ఎక్కడుండాలనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది.. మనం కాదని కోర్టు తేల్చి చెప్పింది. కానీ మన దగ్గరే చిత్రవిచిత్రమైన సమస్యలు తెస్తున్నారు.

మరో సెషన్ అంటే రాష్ట్రపతిని అగౌరవపరిచినట్లే..!
చంద్రబాబు అయితే బిల్లుపై గగ్గోలు పెడుతున్నాడు. బీద ఏడుపులు ఏడుస్తున్నాడు. పెడబొబ్బలు పెడుతున్నాడు. మతిస్థిమితం కోల్పోయిన చంద్రబాబు ఎన్నైనా మాట్లాడుతాడు. సీఎం కూడా అలాగే మాట్లాడుతున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాష్ట్రపతి పంపిన బిల్లును చర్చించకపోతే ఎలా? ఇంత కుసంస్కారంగా వ్యవహరిస్తారా…! స్పీకర్ వెంటనే చర్చకు పెట్టాలి. రాష్ట్రపతిని ఆయన గౌరవిస్తారని భావిస్తున్నా. అసెంబ్లీకి బిల్లు పంపడం అనేది చివరి మెట్టు. కేంద్రం కృతనిశ్చయంగా ఉంది కాబట్టే రాష్ట్రపతి నుండి బిల్లు అసెంబ్లీకి వచ్చింది. ఇంకా.. తెలంగాణ ఆగుతుందని అంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ఠే. ఆగుతుందని మూర్ఖులు తప్ప మరొక్కరు చెప్పరు.

మనం ఎవ్వరం వెయ్యేళ్లు బతకం. బతికినంత కాలం ఏం చేసినం అన్నది ముఖ్యం. 50 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం నిజం. ప్రాతిపాదిక లేకుండా ఏ ఉద్యమం అంతకాలం సాగదు. ఈ విభజనకు సీమాంధ్ర పాలకులే కారకులు. సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తెలంగాణ కాలువ ఒక రకంగా, ఆంధ్ర కాలువ ఒక రకంగా ఎందుకున్నాయి? కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన 36జీవో, ఎన్టీరామారావు ఇచ్చిన 610 జీవోలు ఎందుకు అమలు కాలేదు? ఎస్‌ఎల్‌బీసీ ఎన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది? తెలుగుగంగ ప్రాజెక్టు ఎందుకు తొందరగా పూర్తయ్యింది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది. మేం 14 సంవత్సరాలుగా వాస్తవాలు చెబుతున్నందున కేంద్ర రిలీఫ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయినా చిల్లరమల్లర రాజకీయాలు చేస్తే, పిచ్చికూతలు కూస్తే, బీద అరుపులు అరిస్తే ఎలా? రాష్ట్రం విడిపోతున్న సమయంలో సీమాంధ్ర ప్రజలకేం కావాలి, ఐఐటీ, ఐఎఎం, ఇతర ప్రాజెక్టులు తెచ్చుకోండి. ఇవేవీ అడగడం లేదు.

హుందాగా ప్రవర్తించండి. మూర్ఖంగా పోతే అది పరమమూర్ఖత్వం అవుతుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడినట్లే. అయినా రాష్ట్రపతి పంపిన బిల్లును ఈ సెషన్‌లో చర్చించకుండా మరో సెషన్‌లో చర్చిస్తామంటే ఆయన్ను అవమానించినట్లు కాదా. 371డీ అనేది ఏమాత్రం అడ్డుకానే కాదు. 371 అర్టికల్‌లో ఎ నుండి కే వరకు ఉన్నాయి. అందులో డీ మన రాష్ట్రానికి చెందినది. రాష్ట్రానికి చెందిన కొన్ని అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. రాష్ట్రం విడిపోతున్న సమయంలో దీన్ని ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. వద్దనుకుంటే పోతుంది. దీనిపై అనవసర వివాదం ఎందుకు. ఈ మధ్యే హైకోర్టు తీర్పు ఇచ్చింది. బిల్లును తర్జుమా చేయించుకోవాలనుకుంటే ఎమ్మెల్యేలు సొంతంగా చేయించుకోవాలి. రాజ్యాంగంలో కేంద్ర అధికారాలు, రాష్ట్రాధికారాలు, ఉమ్మడి అధికారాలు విడివిడిగా ఉన్నందున కేంద్ర అధికారం మీద వచ్చిన బిల్లు ఇంగ్లీష్‌లోనే వస్తుంది. చరిత్రలో ఎప్పుడూ బిల్లు తెలుగులో రాలేదు.

ఎమ్మెల్యేలు వారు వ్యక్తిగతంగా తర్జుమా చేయించుకోవాల్సిందే. సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటామన్న ప్రతిసారీ బిల్లు ముందుకే పోతుంది. బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ ఉండదు. కేవలం అభిప్రాయం మాత్రమే తీసుకుంటారు. ఆంధ్రాస్టేట్‌లో బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుంటుండొచ్చు. వారేం చేస్తే మాకేం సంబంధం? తెలుగుదేశం పని అయిపోయింది. చంద్రబాబునాయుడు పక్కరాష్ట్రం మనిషి. నేను మరో రాష్ట్రం మనిషిని. మేం ఒకే రాష్ట్రంలో ఉంటే చర్చించే వాళ్లం. చంద్రబాబుకు ప్రాబ్లం (మెదడు వద్ద వేలు చూపిస్తూ) ఉంది. 14 సంవత్సరాల ఉద్యమం ఫలితం పొందపోతున్న తరుణంలో గండికొట్టే వ్యక్తిత్వం చంద్రబాబుది. చరిత్రలో కొన్ని కీలక మలుపులుంటాయి. ఎన్టీరామారావు పార్టీపెట్టిన నాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేశారు. నేడు తెలంగాణ ఏర్పాటవుతున్న తరుణంలో అడ్డుకుంటున్న వారు కాలగర్భంలో కలిసిపోతారు. అడ్డుకుంటే చరిత్ర కింద నలిగిపోవడం తథ్యం. ఈ సమయంలో బీద అరుపులు పనికిరావు. బీజేపీ వాళ్లు ఇంకెన్నిసార్లు చెబుతారు పాపం. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఉహాగానాలొస్తున్నాయి.. వాటిని నమ్మొద్దు అని ప్రకాశ్ జవదేకర్ చెప్పిండు.

టీడీపీ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడుతున్నారు
తెలుగుదేశం పార్టీ నుండి మాతో చాలా మందే మాట్లాడుతున్నారు. తెలంగాణలో టీడీపీకి స్థానం ఎక్కడిది? చంద్రబాబు టీఆర్‌ఎస్‌లో చేరితే ఆంధ్రలో టీఆర్‌ఎస్‌శాఖ పెడుతం. తెలంగాణ ప్రక్రియ చివరి అంకంలో ఉంది. ఏనుగు ఎల్లింది తోక చిక్కింది అన్నట్లుగా ఉంది. మహిళాబిల్లుకు తెలంగాణ బిల్లుకు ఏమాత్రం సంబంధం లేదు. అసెంబ్లీ అభిప్రాయం వచ్చే వరకు పార్లమెంట్‌ను సైన్‌డై చేస్తారు. ప్రోరోగ్ చేయరు. మన దగ్గర కూడా క్రిస్‌మస్‌ను ఎక్కువ మందే చేసుకుంటున్నరు కనుక సైన్‌డై చేసి అభిప్రాయం రాగానే స్పీకర్ ఒకటి రెండు రోజుల తేడాతో పార్లమెంట్‌ను సమావేశపరుస్తారు. కేంద్రం కృతనిశ్చయంతో లేకుంటే ప్రాసెస్ ఇంతవరకు రానేరాదు. ఎవరూ తెలంగాణను ఆపలేరు. అసెంబ్లీ పాత్రేమీ లేదు. 400 బిల్లు కాపీలను ఫ్లైట్‌లో కాకుండా సైకిల్‌మీద, ఎడ్లబండి మీద తెస్తరా.

మనదగ్గరికే కాదు ఎక్కడికైనా స్పెషల్ ఫ్లైట్‌లోనే తెస్తరు. అది ప్రోటోకాల్. డాక్యుమెంట్లు పంపింది రాష్ట్రపతి కనుక ప్రొటోకాల్ ప్రకారం తెస్తరు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా అనుభవం ఉన్న వ్యక్తి మూర్ఖంగా మాట్లాడితే ఎలా? ధీరూభాయ్ అంబానీ చనిపోతే స్పెషల్ ఫ్లైట్‌లో పోతే తప్పులేదుగానీ తెలంగాణ బిల్లు వస్తే తప్పా. అంటే నువ్వుపోయిన దానికంటే తెలంగాణ బిల్లు తక్కువనా. విలీనంపై దిగ్విజయ్‌సింగ్ మాట్లాడితే.. ఆయనకు పనిలేకుంటే మీకు పనిలేదా..?’ అని కేసీఆర్ అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.