ఆహార భద్రతకు ఆమోదం

 

rationబిల్లులో కీలక సవరణలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల ధాన్యాలు.. అత్యంత నిరుపేదలకు 35 కిలోలు
రూ. 3కు కిలో బియ్యం, రూ. 2కు కిలో గోధుమలు.. రూపాయికి కిలో చిరుధాన్యాలు
67 శాతం మందికి ఆహార భద్రత
ధాన్యం రవాణా, నిర్వహణ, పంపిణీ ఖర్చులు కేంద్రానివే
– ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల ధాన్యాలు
– అత్యంత నిరుపేదలకు 35 కిలోలు
– రూ. 3కు కిలో బియ్యం, రూ. 2కు కిలో గోధుమలు
– రూపాయికి కిలో చిరుధాన్యాలు పంపిణీ
– 67శాతం మందికి ఆహార భద్రత
– ఆహార భద్రతా బిల్లు సవరణలకు కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ, మార్చి 19: చరివూతత్మాక ఆహార భద్రతా బిల్లులో మార్పులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. నిరుపేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. దేశంలోని 67 శాతం మంది ప్రజలకు భారీ సబ్సిడీ రేటుకు ఆహార ధాన్యాలు అందజేయడం బిల్లు లక్ష్యం.

బిల్లులో తాజాగా చేపట్టిన సవరణల ప్రకారం ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను రూపాయి నుంచి మూడు రూపాయలకు కిలో చొప్పున రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తారు. ప్రస్తుతం మాదిరిగానే అత్యంత నిరుపేదలైన అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కుటుంబాలకు నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తారు. బియ్యం కిలో మూడు రూపాయలకు, గోధుమలు కిలో రెండు రూపాయలకు, జోన్నలు, చిరుధాన్యాలు కిలో రూపాయికి అందజేస్తారు. ఈ మేరకు బిల్లులో చేసిన 55 నుంచి 56 సవరణలకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ‘‘సవరించిన ఆహార భద్రతా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్లులోని సవరణలను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపె ప్రయత్నిస్తాం’’ అని కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ విలేకరులకు తెలిపారు. మే 10వ తేదీతో ముగిసే పార్లమెంటు సమావేశాల్లోనే ఆహార భద్రతా బిల్లును ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. ఈ బిల్లుపై పరిశీలన జరిపి.. గత జనవరిలో నివేదిక ఇచ్చిన పార్లమెంటు స్థాయీ సంఘం చేసిన సూచనల మేరకు.. బిల్లులో సవరణలు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం కిలో రూ. 20లకు, గోధుమలు కిలో రూ.16కు అమ్ముతుండగా, నూతన బిల్లులో భాగంగా, భారీ సబ్సిడీతో వీటిని అందజేయనున్నారు.

ఈ పథకానికి లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అయితే, ఈ బిల్లు పరిధిలోకిరాని 33 శాతం జనాభాను నిర్దేశించే ప్రాధాన్యాన్ని ప్రణాళిక సంఘం నిర్ణయించనుందని కేంద్ర మంత్రి కేవీ థామస్ తెలిపారు. ఆహార భద్రతా బిల్లును అమలుచేయడానికి 6.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయి. 2013-14 సంవత్సరానికి ఆహార సబ్సిడీ రూ. 1,24,747 కోట్లకు చేరుకుంటుంది. ఇది ప్రస్తుత సబ్సిడీతో పోలిస్తే రూ. 23,00 కోట్లు అధికం. తాజా కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 90 వేల కోట్లను ఆహార సబ్సిడీకి కేటాయించింది. ఆహార భద్రతా బిల్లు కోసం రూ.10 వేల కోట్లను ఇవ్వనున్నట్టు మొన్నటి బడ్జెట్‌లో ప్రస్తావించారు.గతంలో ఈ బిల్లులో లబ్ధిదారులను.. ప్రాధాన్య, సాధారణ గృహదారులంటూ రెండు కేటగిరీలుగా విభిజించి.. విభిన్న రేట్లకు వారికి ఆహార ధాన్యాలను అందించాలని ప్రతిపాదించగా, తాజా సవరణల ప్రకారం కేటగిరీలను తొలగించి.. లబ్ధిదారులందరికీ ఒకేరకమైన ధరలకు నెలకు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు అందజేయనున్నారు. 2011 డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో..

ప్రాధాన్య కేటగిరీకి చెందిన ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఏడు కిలోల ఆహార ధాన్యాలు అందజేయాలని, బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు కిలో వరుసగా రూ.3, రూ. 2, రూపాయికి అందజేయాలని ప్రతిపాదించారు. సాధారణ కేటగిరీలోని గృహదారులకు మద్దతు ధరకు సగం ధరకు ఈ ఆహార ధాన్యాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కలల ప్రాజెక్టుగా ఆహార భద్రతా బిల్లును తీసుకువస్తున్నారు. ఈ బిల్లును తెస్తామని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ చరివూతాత్మక బిల్లే ప్రధానాస్త్రంగా 2014 ఎన్నికలను ఎదుర్కోవాలని అధికార యూపీఏ భావిస్తోంది. సవరించిన బిల్లు ప్రకారం సాధారణ కేటగిరీ గృహదారులకు కూడా అతి తక్కువ ధరకు అత్యంత నాణ్యతతో కూడిన ఆహార ధాన్యాలు సరఫరా చేయనున్నారు. ఆహార ధాన్యాల కేటాయింపులో గత మూడేళ్లుగా సగటును కొనసాగించాలని రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను సైతం తాజా బిల్లులో అంగీకరించారు. ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణ, రేషన్ దుకాణం డీలర్లకు మార్జిన్లు తదితర విషయాలకు సంబంధించిన వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. అయితే మహిళకు పౌష్ఠికాహార భద్రత కల్పించడంలో భాగంగా రూ. ఆరు వేలను ప్రసూతి లబ్ధిగా వాయిదాల చొప్పున అందజేయాలంటూ ఈ బిల్లులో చేసిన ప్రతిపాదనలపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ప్రసూతి ప్రయోజనం కింద ఆరు నెలలకు రూ. వెయ్యి ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖ దిగువన ఉన్న (బీపీఎల్), అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కుటుంబాలకు వరుసగా రూ. 3, రూ. 5.65 చొప్పున 35 కిలోల బియ్యం అందిస్తున్నారు. దారిద్య్ర రేఖ ఎగువన ఉన్న (ఏపీఎల్) కుటుంబాలకు రూ. .30 కిలో చొప్పున 15 నుంచి 35 కిలోలు పంపిణీ చేస్తున్నారు. గోధుమలను కిలో రూ. 2 చొప్పున ఏఏవై కుటుంబాలకు, కిలో రూ. 4.15 చొప్పున బీపీఎల్ కుటుంబాలకు, రూ. 6.10 చొప్పున ఏపీఎల్ కుటుంబాలకు అందజేస్తున్నారు.ఆహార భద్రతా బిల్లు తాజా సవరణల ప్రకారం..
– దేశంలో 67శాతం మందికి లబ్ధి
– లబ్ధిదారులందరికీ ఒకే ధరకు ఆహార ధాన్యాలు
– ప్రతి వ్యక్తికి ఐదు కిలోలు అందజేత
– బియ్యం రూ.3, గోధుమలు రూ. 2,
చిరుధాన్యాలు రూపాయికి కిలో అందజేత

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.