ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ బాధ్యతల స్వీకరణ

rajanముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజన్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తుల్లో రాజన్ ఒకరు. రాజన్ వయసు 50 సంవత్సరాల ఆరు నెలలు. ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇవాళ పదవి విరమణ చేశారు.

ఆర్థిక అంశాల విశ్లేషణలో తనకంటూ ఒక ప్రత్యేకత కనబరిచిన రాజన్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి అతికొద్ది మంది ఆర్థిక వేత్తల్లో ఒకరుగా ప్రపంచఖ్యాతి పొందారు. రాజన్ 1963లో భోపాల్‌లో జన్మించారు. ఏడో తరగతి వరకు విదేశాల్లో చదవగా, మిగతా పాఠశాల విద్యను ఢిల్లీలో పూర్తి చేశారు. ఐఐటీ ఢిల్లీలో బీటెక్, ఐఐఎం అహ్మదాబాద్‌లో పీజీ డిప్లొమా చేశారు. రాజన్ సమర్పించిన బ్యాంకింగ్‌పై వ్యాసాలకు గానూ 1991లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పొందారు.

2003 అక్టోబరు నుంచి 2006 డిసెంబర్ మధ్య ఐఎమ్‌ఎఫ్‌కు ఎకానమిక్ కౌన్సిలర్, డైరెక్టర్ ఆప్ రిసెర్చ్‌గా పని చేశారు. ఆ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడు ఆయనే. రాజన్ పలు రచనలు చేశారు. అవి ‘సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ది క్యాపిటలిస్ట్స్’ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేటికి ముప్పుగా పొంచి ఉన్న పెను సవాళ్ల గురించి ‘ఫాల్ట్ లైన్’ పుస్తకం రాశారు.

భారతదేశంలో ప్రణాళికా సంఘానికి సంబంధించి ఆర్థిక రంగ సంస్కరణలపై నివేదికను రూపొందించడంలో కూడా రాజన్ కీలక బాధ్యలు పోషించారు. 2013లో బర్టన్ ఫౌండేషన్ రెగ్యులేటరీ ఇన్నోవేషన్ అవార్డు, 5వ వార్షిక డాయిష్ బ్యాంక్ ప్రైజ్, 2012, 2010లో ఫారెన్ పాలసీ మ్యాగజైన్‌లో టాప్-100 అంతర్జాతీయ మేధావుల్లో స్థానం. 2010లో ఆయన రాసిన ఫాల్ట్ లైన్స్‌కు ఫైనాన్షియల్ టైమ్స్/గోల్డ్‌మాన్ శాక్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్, 2003లో అమెరికన్ ఫైనాన్స్ అసోసియేషన్ నుంచి ఫిషర్ బ్లాక్ ఫ్రైజ్ మొదలగుని అందుకున్నారు.

సవాళ్లను ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థ
ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. 20వ ద్రవ్య విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. డబ్బు విలువను పరిరక్షించాల్సి ఉందన్నారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.