ఆర్టీసీ ‘అభివృద్ధి’ బాదుడు!

busphoto -ప్రతి ప్రయాణికుడి నుంచి రూపాయి సెస్ వసూలు
-సర్కారు అనుమతి..ఏడాదికి రూ.150 కోట్ల భారం!
-ఆర్డినరీ, సిటీ బస్సులకు మినహాయింపు
-నేటి నుంచే అమలు
ఇప్పటికే చార్జీలు, టోల్ గేట్ రుసుముల వసూళ్ల భారంతో తల్లడిల్లుతున్న ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన మరో భారం పడనుంది. బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడి నుంచి ‘అభివృద్ధి’ సెస్ పేరిట రూ.1 వసూలు చేసుకునేందుకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీ లక్ష్మీ పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఆర్డినరీ(పల్లె వెలుగు), సిటీ బస్సులు మినహా.. ఎక్స్‌వూపెస్, డీలక్స్, సూపర్ లక్జరీ, ఏసీ బస్సులు(ఇంద్ర, గరుడ, గరుడ+, వెన్నెల) తదితర అన్ని బస్సుల్లో తిరిగే ప్రయాణికుల నుంచి ఈ సెస్‌ను వసూలు చేయనున్నారు. మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. సెస్ బాదుడు మూలంగా ఆర్టీసీకి ఏడాదికి సుమారు రూ.150 కోట్ల దాకా అదనపు రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనా! ఈ ఆదాయాన్ని ప్రత్యేక నిధిగా జమ చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ బస్ స్టేషన్లలో సదుపాయాల కల్పనకు వినియోగించుకునేందుకు ఆర్టీసీకి వెసులుబాటు కలుగనుంది.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్టీసీ గత కొంత కాలం గా ఆధునిక సౌకర్యాలతో బస్ స్టేషన్లను నిర్మిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్ స్టేషన్లలో కుర్చీలు, బెంచీలు, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, సీలింగ్ ఫ్యాన్లు, పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు, ప్రయాణికుల రిజర్వేషన్ల కౌంటర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, క్లోక్‌రూంలు, లైటింగ్ తదితర సదుపాయాలు కల్పిస్తోంది. ప్రయాణికులకు రక్షిత మంచి నీటిని అందజేసేందుకు ఇటీవల దాతల సాయంతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతను ఆర్టీసీయే చూస్తోంది. అయితే, సంస్థ గత కొద్దికాలంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. 2012-13 నాటికి నష్టాల భారం రూ.2,980 కోట్లకు పేరుకుపోయాయి. మరోవైపు, పలు ప్రాంతా ల్లో కొత్తగా బస్ స్టేషన్లు నిర్మించాలని, స్టేషన్లలో సౌకర్యాలను విస్తరించాలని ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి రూ.1 చొప్పున సెస్ వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వంఅనుమతి ఇచ్చింది. ఆర్టీసీలో తిరిగే అన్ని బస్సుల్లో రోజుకు సుమారు 1.40 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టినరీ, సిటీ బస్సులను మినహాయిస్తే.. ఇతర బస్సుల్లో సుమారు 40 లక్షల మంది దాకా ప్రయాణిస్తారని అంచనా. ఈ నేపథ్యంలో సెస్ వసూలు మూలంగా సంస్థకు రోజుకు సుమారు రూ.40 లక్షలు, నెలకు రూ.12 కోట్లు, ఏడాదికి సుమారు రూ.150 కోట్ల దాకా అదనపు రాబడి చేకూరనుంది. ఈ మేరకు ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.