ఆరు నెలల్లో కొత్త రాష్ట్రం

వర్షాకాల సమావేశాల్లోతెలంగాణ బిల్లు ఉండదు: షిండే
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఆరు నెలల్లో కొత్త రాష్ట్రం రూపుదాలుస్తుందని పేర్కొంది. ‘లేదు.. ఈ సమావేశాల్లో కాదు. (బిల్లు) ఇంత తొందరగా వస్తుందని అనుకోను. shindeబహుశా.. వచ్చే సమావేశాల్లో రావొచ్చు’ అని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా విలేకరులడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మరిన్ని కొత్త రాష్ట్రాల కోసం వస్తున్న డిమాండ్లనూ వింటామని చెప్పారు. అయితే వాటికోసం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని హోంమంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల్లోగానే ప్రారంభమవుతుందని తెలిపారు. ‘కొత్త రాష్ట్రాన్ని ఏర్పరచాలంటే సాధారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. కానీ మేము సాధ్యమైనంత త్వరగా.. బహుశా ఐదున్నర నెలల నుంచి ఆరునెలల్లోగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తాం. అంతకన్నా ముందుగా కూడా కావొచ్చు’ అని ఆయన ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రానికి శాసనసభ తీర్మానం చేయకుండా దాటవేయనున్నారా అని అడిగినప్పుడు- ప్రత్యేక తెలంగాణ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గతంలోనే చర్చించిందని సమాధానమిచ్చారు. ‘అదేం లేదు (దాటవేయడం లేదు). ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ అంశాన్ని ఇదివరకే చర్చించారు. ఇప్పుడు, రాష్ట్రం నుంచే ఆ ప్రతిపాదన వస్తే మంచిదే. ఒకవేళ రాకపోతే వేరే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మేము రాజ్యాంగం ప్రకారం చర్చించి ముందుకు వెళతాం’ అని హోంమంత్రి తెలిపారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటే ఉంటుందా, ఇంకా పొడిగిస్తారా అన్న ప్రశ్నకు- ఇందుకు సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుందని, అయితే కేంద్ర కేబినెట్ సమావేశమై తెలంగాణ అంశాన్ని చర్చించినప్పుడు స్పష్టత వస్తుందని బదులిచ్చారు. పది తెలంగాణ జిల్లాలతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పరచాలన్నది సీడబ్ల్యూసీ నిర్ణయమని, తానిప్పుడు అదే పనిపై ఉన్నానని షిండే మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం ఏర్పాటవుతుందని, ఎవరైనా ఇంకేమైనా సూచించదలచుకుంటే, చేర్చాలని భావిస్తే ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు పంపొచ్చని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నిరసనలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల గురించి ప్రస్తావించగా- వాటి సంగతి తనకు తెలుసునని, కానీ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, ముందుకు వెళుతుందని చెప్పారు.

‘ప్రజలు ఆందోళన చేయొచ్చు. కానీ శాంతియుతంగా ఉండాలి. తెలంగాణపై ఏకాభిప్రాయం ఉంది. నేను ఈ అంశంపై చర్చించినప్పుడు కేవలం రెండు పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి’ అని మంత్రి తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ గురించి ఆయన వివరించారు. తొలుత కేబినెట్ కోసం హోంమంత్రిత్వశాఖ నోట్ రూపొందిస్తుందని, కేబినెట్ సమ్మతి తెలుపగానే మంత్రుల బృందాన్ని ఏర్పరుస్తారని, అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు సిఫారసులు చేస్తుందని తెలిపారు. బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి పరిశీలించి శాసనసభకు పంపొచ్చని పేర్కొన్నారు. అనంతరం న్యాయశాఖ సవరణలతో బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెడతారు. ఆమోదం పొందిన తర్వాత కొత్త రాష్ట్రం ప్రారంభమవుతుందని తెలిపారు.

కొత్త డిమాండ్లనూ వింటాం
ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంటున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరి బాధలను, ఇబ్బందులను జాగ్రత్తగా వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ‘కొత్త రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్నవారు హింసకు పాల్పడవద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆందోళనలు చేపట్టవచ్చు.. కానీ ప్రజాస్వామిక ప్రక్రియను అనుసరించాలి.. శాంతియుతంగా ఉద్యమించండి. భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరి బాధలను జాగ్రత్తగా వినేందుకు సిద్ధంగా ఉంది’ అని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. కూచ్ బెహర్ (ఉత్తర బెంగాల్), బోడోలాండ్, గూర్ఖాలాండ్, కర్బి అంగ్లాంగ్ డిమాండ్ల గురించి ప్రభుత్వానికి తెలుసునని ఆయన చెప్పారు. ‘మేమెవరినీ నిర్లక్ష్యం చేయడం లేదు. అందరి మాటలూ వింటాం. ఎక్కడ సాధ్యమవుతుందో పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని హోంమంత్రి చెప్పారు. రెండో ఎస్సార్సీని వేసే అవకాశాల్లేవని పేర్కొన్నారు.

డార్జిలింగ్‌లో గూర్ఖాలకు కేంద్ర పాలితం ప్రాంతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారా అన్న ప్రశ్నకు ఆయన ప్రతికూలంగా స్పందించారు. ‘నేను కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఎవరికీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అందరి మాటలూ విన్నాను. కానీ ఎవరికీ ఏమీ చెప్పలేదు’ అని షిండే తెలిపారు. ప్రభుత్వం ఇదివరలో మాదిరిగా భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయబోదని చెప్పారు. తెలంగాణతోపాటు విదర్భ డిమాండ్‌ను ఎందుకు అంగీకరించలేదని అడిగినప్పుడు- ఒక్క విదర్భ మాత్రమే కాదు.. భిన్న ప్రాంతాల్లోని సంస్థలు రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ చాలా పాత డిమాండ్ అని, 1951లో, 1956లో రేకెత్తిన సమస్య అని వివరించారు. చిన్న రాష్ట్రాల్లో నక్సలిజం ప్రబలే అవకాశముందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఘటనలు జరుగొచ్చని, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.