– లోక్‌సభలో సాధారణ మెజార్టీ 249
– యూపీఏ కూటమిలో అనుకూలం 233
– ఎన్డీఏ కూటమిలో అనుకూలం 122
– వామపక్షాలు ఇతరుల్లో 10
– వ్యతిరేక ఓట్లు 69 నుంచి 110 మాత్రమే
తెలంగాణ బిల్లు పార్లమెంటు ప్రవేశానికి సిద్ధమైన తరుణంలో ఆ బిల్లుకు సభలో ఎంతమంది మద్దతు పలుకుతారన్నది చర్చనీయాంశమైంది. ఎన్నికల ముంగిట్లో బిల్లు ఆమోదంతో ఆయా పార్టీల ప్రయోజనాలు, ఓట్ల లాభనష్టాలు, రేపటి పొత్తుల అంశాలు ముందుకు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలను నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు ప్రస్తుతం లభించే ఓట్లెన్ని అనే అంశాన్ని పరిశీలిస్తే లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం నల్లేరుమీద నడకేనని తేలుతుంది. ఆర్టికల్ 3 ని అనుసరించి సభలో జరిగే ఓటింగ్‌లో సాధారణ మెజార్టీ సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఏ కారణం వల్లనైనా ఎన్డీఏ పక్షాలు మద్దతు ఇవ్వలేకపోయినా బిల్లు నెగ్గడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో సభ్యుల మొత్తం సంఖ్య 543. ఇందులో ప్రస్తుతం 6 సీట్లు వివిధకారణాలతో ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుత సభ్యుల సంఖ్య 537. బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ అంటే 249 మంది సభ్యుల మద్దతు అవసరం.
యూపీఏ బలం..: ప్రస్తుతం అధికార యూపీఏ కూటమికి 275 మంది సభ్యులున్నారు. ఇందులో 223 మంది సభ్యులు నేరుగా మద్దతు ఇస్తుండగా, 42 మంది సభ్యులున్న వివిధ పార్టీలు వెలుపలినుంచి మద్దతు ఇస్తున్నాయి. ఇందులో 22 మంది సభ్యులున్న సమాజ్‌వాది పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఇకపోతే జనతాదళ్ ఎస్ (1) ఓటు విషయం ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 19మంది ఎంపీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అంటే మొత్తంగా యూపీఏ భాగస్వాముల్లో 42 మంది ఎంపీల ఓట్లు అనుమానంగా చెప్పవచ్చు. అంటే యూపీఏ పక్షాలనుంచి 233 మంది అనుకూలంగా ఓట్లు వేసే అవకాశముంది.
ఎన్డీఏ: నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌లో బీజేపీ 117, శివసేన 11, శిరోమణి అకాలీ దళ్ 4, హర్యానా జనహిత్ కాంగ్రెస్ 1 ఉన్నాయి. ఈ కూటమి మొత్తం సభ్యుల సంఖ్య 133. బీజేపీ అనుకూల నిర్ణయంపై నిలబడితే శివసేన మినహా మిగిలిన పార్టీల ఓట్లన్నీ అంటే 122 ఓట్లు తెలంగాణకు అనుకూలంగా వస్తాయి.
వామపక్ష కూటమి: ఈ కూటమిలో 25 మంది సభ్యులున్నారు. ఇందులో సీపీఐ 4 అనుకూలం. గతంలో తెలంగాణకు ఈ కూటమిలోని ఫార్వర్డ్ బ్లాక్ 2, ఆర్ఎస్పీ 2 మద్దతు పలికాయి. సీపీఎం 16 వ్యతిరేకం. ఈ కూటమినుంచి 4 నుంచి 8 ఓట్లు రావొచ్చు.
ఇతర పార్టీలు: ఏ కూటమికి చెందని పార్టీ సభ్యుల సంఖ్య 105 వరకు ఉంది. ఇందులో జనతాదళ్ (యూ) 19 ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. తణమూల్ కాంగ్రెస్ 19, డీఎంకే 18, ఏఐఏడీఎంకే 9, టీడీపీ (సీమాంధ్ర) 4, వైఎస్సార్సీపీ 2 వ్యతిరేకంగా ఉన్న పార్టీలు. వీటి మొత్తం సంఖ్య 52. ఇక అనుకూల పార్టీల విషయానికి వస్తే టీఆర్ఎస్ 2, టీడీపీకి చెందిన తెలంగాణ ఎంపీలు 2 , ఎంఐఎం 1, తెలంగాణకు మొత్తం ఐదుఓట్లు అనుకూలం.
వ్యతిరేక ఓట్లెన్ని?: తెలంగాణ బిల్లుకు వ్యతిరేకించే పార్టీల సంఖ్య చాలా స్వల్పం. వ్యతిరేక ఓటు వేసే అవకాశం ఉన్న పార్టీల్లో సమాజ్‌వాదీ 22, తణమూల్ కాంగ్రెస్ 19, డీఎంకే 18, ఏఐఏడీఎంకే 9, టీడీపీ (సీమాంధ్ర) 4, వైఎస్సార్సీపీ 2, కాంగ్రెస్ (సీమాంధ్ర) 19, సీపీఎం 16 ఉంటాయి. వీటి మొత్తం సీట్ల సంఖ్య 109 మాత్రమే. ఇందులో సమాజ్‌వాదీ, డీఎంకేలు కూడా కచ్చితంగా వ్యతిరేక ఓట్లు వేస్తాయని చెప్పలేము. అటు తిరిగి ఇటు తిరిగి కచ్చితంగా పడే వ్యతిరేక ఓట్లు 69 మించవనేది పరిశీలకుల అంచనా.
హాజరయ్యే సభ్యులు కీలకం..: ఆర్టికల్ 3 కింద రాష్ట్రవిభజన బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. అంటే బిల్లు ఓటింగ్‌కు పెట్టిన సమయంలో సభలో ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొంటారనే దానిపైనే బిల్లు ఆమోదం ఆధారపడి ఉంటుంది.
గతంలో యూపీఏ బిల్లులకు చివరిదాకా మద్దతు ఇవ్వబోనని చెప్పి ఆఖరు నిమిషంలో సమాజ్‌వాదీ, డీఎంకేలు మనసు మార్చుకున్నాయి. లేదా తటస్తంగా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ ఏ కారణం వల్లనైనా ముందుకు రాకపోతే రాజకీయ ఎత్తుగడగా ఎస్పీ అనుకూల ఓటు వేసే అవకాశం లేకపోలేదు. లేదా సభ్యుల గైర్హాజర్ ద్వారానైనా సహకరించే అవకాశం కూడా ఉంది.