ఆదర్శప్రాయుడు ధర్మభిక్షం

DZGD– మాజీ ఎంపీ రెండో వర్ధంతి సభలో సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ సాయుధ పోరాటయోధులు, మాజీ ఎంపీ కామ్రేడ్ స్వర్గీయ ధర్మ భిక్షం గౌడ్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కొనియాడారు.  నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పట్టణ పౌర కమిటీ ఆధ్వర్యంలో ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ధర్మ భిక్షం కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఏదో ఒక వర్గానికి కాకుండా బహుముఖ సేవలు అందించి నేటి రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచాడన్నారు. నేడు రాష్ట్రం, దేశంలో రాజకీయపరిస్థితులు దారుణంగా ఉన్నాయని; మనిషిని మనిషి, వ్యవస్థను వ్యవస్థ దోపిడీ చేస్తోందన్నారు. పెట్టుబడి దారీ విధానం, నూతన ఆర్థిక విధానాల వల్ల అసాధారణంగా సంపద వస్తున్నప్పటికీ కేవలం కొంతమంది చేతుల్లోనే ఆ సంపద కేంద్రీకృతమవుతోందన్నారు. నేడు అవినీతి అనేది ఓ రాజకీయ క్రీడలా మారి అనేక మంది జైళ్లపాలవుతున్నారన్నారు. కొత్తగా ‘నేటి మంత్రే రేపటి ఖైదీ’ అనే కొత్త నినాదం వస్తోందని, ప్రజలు ఇలాంటి వాటిపై లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ భావిభారత రాజకీయ నేతలకు ధర్మ భిక్షం స్ఫూర్తిగా నిలుస్తాడని చెప్పారు. నాడు విశాలాంధ్ర కోసం పోరాడిన పార్టీ నేడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తోందని, ఇదే స్ఫూర్తితో సీపీఐ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేయాలని కోరారు. తెలంగాణలోనే అత్యంత గౌరవ ప్రతిష్టలు కలిగి, పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు భూస్వాముల గుండెల్లో పదిలంగా నిలిచిన ధర్మ భిక్షం గౌడ్ చరిత్ర, ఆయన ఆశయాలను పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పెట్టాలన్నారు. సభలో  రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్, డాక్టర్ బూర నర్సయ్య, విశాలాంధ్ర దిన పత్రిక ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, చెరుకు సుధాకర్, పల్లా వెంకట్‌రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, బొమ్మగాని ప్రభాకర్, మల్లెపల్లి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.